Sanathana Dharmamu    Chapters    Last Page

IX. గురు సంప్రదాయము

1. గురువు, ఆచార్యుడు

మనం సాధారణంగా వాడుకలో రెండు పద ప్రయోగాలు చేస్తుంటాం. ఇవి మనం పర్యాయ పదాలుగా భావించినా, పండితులు మాత్రం ఈ రెంటినీ కొంచెం భిన్న దృక్పధంలోనే చూస్తారు. ఆ పదములే గురువు, ఆచార్యుడు అనునవి.

ఆచార్యపదం, 'ఆచరణ', 'ఆచార', అనే పదములకు సంబంధించినది. చర అంటే నడచుట. చరిత, చరిత్ర అంటే నడత. దేశ చరిత్ర అంటే ఒక దేశంలో ఏమేమి జరిగిందో చెప్పే పుస్తకం. జీవిత చరిత్ర అంటే ఒక మనిషి పుట్టినదాది, ఏమేమి చేశాడో చెప్పే కథ. ఆచారం అంటే ఒక సమూహంలోని వాడుకలు, నడవడికలు.

ఆచార్యుడు అంటే జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏవిధమైన నైతిక ప్రవర్తన, శిష్టాచారము లనుసరించాలో చూపే మార్గదర్శకుడు. అహింస, సత్యము ఇలాంటి సామాన్య ధర్మములు మనకున్నవి. మన మతంలో ఎన్నో సంప్రదాయములున్నవి. ఆచారములున్నవి. ఒక్కొక్క సంప్రదాయానికీ వేర్వేరు శాస్త్రాలున్నవి. వైష్ణవులది ఒక ఆచారం. మాధ్వులకు మరొక్క ఆచారం. వీరితోబాటు నింబార్క, చైతన్య సంప్రదాయములున్నవి. వారి వాడుకలు, ఆచారములు వేరు. ఒక శైవ సంప్రదాయంలోనే ఎన్నో శాఖలున్నవి. వీరశైవం, కాశ్మీరశైవం, పాశుపతం, సిద్ధాంతము - ఇత్యాది బేధములున్నవి. ఇదేవిధంగా వైష్ణవులలోనూ, ఏకాంతికులు, వైఖానసులు, పాంచరాత్రులు వంటి విభాగాలున్నవి. అద్వైతులు, ఆచారవిషయాలలో స్మృతులను పాటిస్తారు.

ఆచార్య పదాన్ని వివరించే ఒక శ్లోకమున్నది. ''అచినోతిహిశాస్త్రార్ధాన్‌ ఆచారేస్థాపయత్యపి. స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్యం ప్రచక్షతే.''

ఎవడైతే శాస్త్రార్ధములను చక్కగా విచారిస్తున్నాడో, (ఇతరులకు వానిని బోధిస్తున్నాడన్నది గర్భితం) ఇతరులను ఆ ఆచారములను అనుష్ఠించి చేస్తున్నాడో, అంతటితో వదలక స్వయముగా ఆ ఆచారములను అనుష్ఠింప చేస్తున్నాడో, అంతటితో వదలక స్వయముగా ఆ ఆచారములను తాను కూడ అనుష్ఠిస్తున్నాడో, అతడే ఆచార్యుడు. అనగా (ఆంగ్లంలో దీనికి వాడుకలో వున్న పదములు PRECEPT AND PRACTICE) ఇతరులకు బోధచేయడం, వానిని స్వయముగా ఆచరించడం. ఈ రెండూ చేసే వాడే నిజమైన ఆచార్యుడు.

మనం ఆచారం, అనుష్ఠానం అని అంటూ వుంటాం. అవి పరస్పరసంబంధము కలవి. శాస్త్రోక్తములైన ఆచారములననుసరించేవే సంప్రదాయములు. శాస్త్రములనేవి విధి నిషేధాలను నిర్ణయించే గ్రంధాలు. సంప్రదాయములు అనూచానంగా వచ్చే వాడుకలు, ఆచారాలు. వైదిక మతము ఆధారంగా ఏర్పడినవే శాంకర, రామానుజ, ఇతర వైదిక సంప్రదాయములు, శాస్త్రములు సామాన్యంగా వున్నా సంప్రదాయాలు వేరుగా వుండవచ్చును. ఎన్నో దేశాచారాలున్నవి. ఒక్కొక్క ప్రాంతానికే నిర్దేశించిన కొన్ని వాడుకలుండాయి. కొన్ని కులములవారు పాటించే ఆచారాలున్నాయి. అవి కులాచారములు. కొన్ని ఆచారములు ఆయా కుటుంబములకు పరిమితమై వుండటం కూడా కద్దు. ఇట్లు వివిధ కులాచారాలూ, దేశాచారాలూ ఉండటం మనం చూస్తున్నాం.

ఈ విధంగా ఒక నియమ జీవనం చేస్తూ శాస్త్రోక్తమైన ఆచార అనుష్ఠానాలను పాటిస్తూ ఇతరులకు బోధిస్తూ వారిచే వాటిని అనుష్ఠింపచేస్తూ, తాను ఇతరులకు ఒరవడిగా ధర్మమూర్తిగా వున్నవాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యునికి ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యునికి తన సంప్రదాయ ధర్మములను బోధించి అనుష్ఠింపచేయాలి. అతడు విద్వాంసుడిగా వుండాలి. విద్వత్తు లేకపోతే అతడు ఇతరులకు ఏమి బోధ చేయగలడు? తన అనుచరుల ధర్మ సందేహాలకు అతడు జవాబు చెప్పాలి. తన సంప్రదాయానికి ప్రతి పక్షులైన వారికి యుక్తి యుక్తంగా జవాబు చెప్పాలి. అట్టివాడే ఆచార్యుడనిపించుకొంటాడు.

ఈ కాలంలో ఆచార్యులు బళ్ళు, కళాశాలలోవుండే అధ్యాపకులు. వారికి ఆచరణలో కానీ, బోధనలో కానీ ఏ విధమైన ధర్మమూ లేదు. పూర్వకాలంలోనూ కళలకు ఆచార్యులు వుండేవారు. ద్రోణాచార్య కృపాచార్యులు ధనుర్వేద ఆచార్యులు. వారు వారి కళలలోనే కాక సంప్రదాయములోను ధర్మంలోనూ కుశలులు. వారి అనుష్ఠానాలకే వారు గౌరవింపబడినారు.

2. గురు లక్షణం

ఆచార్యుల సమక్షంలోనే వుంటూ, విద్యాభ్యాసం చేయడం గురుకులవాసం. కానీ దానిని ఆచార్యకులవాసమని మనం అనడం లేదు. అందుచేత గురువు ఆచార్యుడు అంటే ఒక్కటే అని అర్థమౌతుంది. జగద్గురు శంకరాచార్య అని వ్యవహరించేటపుడు ఒకే మనిషి, గురువుగా ఆచార్యుడుగా వున్నాడని ఊహిస్తారు.

గురువంటే ఏమిటీ? గురువనగా ఘనమైనదీ, పెద్దదీ అని అర్ధం. మహిమకలవాడని భావం. బ్రహ్మ అంటే కూడ గొప్ప, పెద్ద అనే అర్ధం. గురువు దేనిలో పెద్ద? మీరందరూ నన్ను పెరియవా, పెరియవర్‌ అని పిలుస్తారు. నేను దేనిలో పెద్ద? శరీర ప్రమాణంలోనా? నాకు శంకరాచార్యుడనే పేరు ఉండడం వలన మీరందరూ, ఆయన గుణగణములూ, మహత్వమూ నాలో ఉన్నదని ఏమరి, నన్నుపెరియవా అనీ, మహాన్‌ అనీ పిలుస్తున్నారు.

మొత్తంమీద గురువంటే అంతర్గతంగా ఒక ఉత్తమస్థితిని అందుకొన్నవాడని తేలుతోంది. బాహిరంగా, ఒకని నడత, విద్వత్తూ అతనిని ఆచార్యుడుగా నిర్దేశిస్తుంది. అతని ఆచారఅనుష్ఠానాల వలన, అతని బోధనా చాతుర్యం చేతనూ, అతని శీలసంపద వలననూ మనం ఒకరిని ఆచార్యునిగా ఎన్నగలము.

ఇక గురువు మాట ఏమి? అతడు ప్రపంచంలో బహిరంగముగా దేనినీ చేయవలసిన అవసరం లేదు. అతనికి శాస్త్రపరిజ్ఞానమో, విద్వత్తో వుండనక్కరలేదు. ఆచార్యునివలె అతడు సంప్రదాయ, ఆచార అనుష్ఠానాలకు మార్గదర్శిగా వుండనవసరమూలేదు. అతడు నోరుతెరచి మాట్లడవలసిన అవసరంలేదు. ఉపదేశాలు ఇవ్వనక్కరలేదు. ఎంతోమంది మౌనగురువులు, ధ్యాననిష్ఠులు వుంటారన్న విషయం మనకు తెలిసినదే.

తాను తానుగా వుంటే ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ, ఎవరైనా వుంటే, అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠములు చెప్పవలెనన్న నియమంలేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడ వుండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి సులభంగా సిద్ధిస్తున్నది.

ఏ శాస్త్రాచారమునూ పాటించని ఇలాంటి గురువులు ఎందరో వున్నారు. ఉన్మత్తులవలె, పిశాచముల వలె నిరంకుశముగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మనదేశంలో వుండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూతగురువని ప్రసిద్ధి పొందారు.

ఒక మార్గాన్ని అనుసరించిపోయేవాడు ఆచార్యుడు. ఒక శాస్త్రసంప్రదాయాన్ని పాటిస్తూ అతడు శాస్త్రనిష్ణాతగా వుండటమేకాక, శాస్త్ర విధులను తాను అనుష్ఠిస్తూ ఇతరులకు బోధచేస్తూ, వారిచేత వానిని అనుష్ఠింపచేస్తూ విధివిధానంగా, మార్గదర్శకంగా వుండేవాడే ఆచార్యుడు. గురువట్లుకాదు. అతనికి మనదండం అతని ఆత్మోపలబ్ధియే. అందుచేతనే అతనిని మహాత్ముడని అంటారు. అతని ఆత్మానుభవం కొట్టవచ్చేటట్లు కనబడుతుండటంచేతనే అతనిని ప్రజలు గురువుగా వరిస్తున్నారు. వారికి శీలానుష్ఠానాల అవపరంలేదు. వారికి శాస్త్ర విజ్ఞానం వుండాలన్న నియమంలేదు. వారు జ్ఞానులు. వారెపుడూ బ్రహ్మనిష్ఠలో వుండేవారు. వారు ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో వుండే ఆనందోన్మత్తులగనో, చిత్తవృత్తుల నిరోధంతో సమాధ్యవస్థలో వుండే యోగులగానో వుంటారు.

ఒక గురువు, స్వయంగా, 'గురుత్వం' ఒప్పుకోకపోయినా 'నేను నీ శిష్యుడను' అని అతనిని ఆశ్రయించిన వాని మధ్యా, అయిష్ఠుడైన ఆ గురువు మధ్యా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం అతని అనుగ్రహంవల్లనే.

గురువంటే ఘనమైన వాడని చెప్పాం. ఒకనికి అంతరంగిక ఘనత వుంటుంది. కాని అతనికి బహిష్ప్రపంచమును పైన ఏ విధమైన కోరికా లేకపోవచ్చు. అతనికి అతని ఆత్మానుభూతిలోనే నిష్ఠ, అతడు గురువుగా చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. గు అంటే అంధకారం. రు అంటే తన్నిరోధకం. గురువు అంటే చీకట్లను పారద్రోలేవారు. అజ్ఞాన నివర్తకుడు. దేశశబ్దానికి ప్రకాశరూపియని అర్థం. ''తమసోమాజ్యోతిర్గమయ''. మనం అంధకారంలోంచి ప్రకాశంలోనికి రావాలి. తమస్‌ అంటే చీకటి. జ్యోతిస్‌ అంటే వెలుతురు. జ్ఞానం, అజ్ఞానం అంటే చీకటి. ఆ అజ్ఞానం ప్రకాశం వుంటే కానీ పోదు. ఒక విషయాన్ని గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్ధిచేత దానిని గ్రహిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో వున్న శిష్యునికి జ్ఞానబోధ చేయకలిగినది ప్రకాశరూపియైన గురువే.

ఒకమహాత్ముడుంటాడు. అతనికి శాస్త్ర విజ్ఞానంలేదు. అతని అనుష్ఠానమూ శాస్త్రీయంకాదు. శాస్త్రబోధిని అతనికి కానిపని. అయినప్పటికి ఎవరైనా అతనిని గురువుగా ఆశ్రయిస్తే, అతడు ఆశ్రితుని అంతర్ధ్వాంతాన్ని అనాయాసంగా పోగొట్టగలడు. అతని అనుగ్రహం చేత అనధీతమైన శాస్త్రాలన్నీ ఆశ్రితునికి అవగతాలౌతాయి.

గురువంటే చీకటిని పోగొట్టేవాడు. అతని ఆత్మశక్తి బహిర్ముఖంగా పనిచేస్తుంది. అతడు వాగ్రూపంగా వరదానం చేయటంలేదు. మార్గదర్శకంగా వుండాలన్న కోరికా అతనిని లేదు. అనుగ్రహం చేద్దామన్న ఇచ్చయూ లేదు. కానీ ఈశ్వరశక్తి, శిష్యుని గురుభక్తివలన మెఱపువలె వరప్రదానం చేస్తుంది. అతనిని అల్పమైన ప్రాపంచిక విషయాభిలాషగా నైనా వుండవచ్చును. లేదా అతడు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి అయినా వుండవచ్చును.

ఒక కర్తవ్యం జరగాలంటే శిష్యగురుసంబంధం వుండాలి. ఇంట్లో దీపం వెలిగించాలంటే, విద్యుచ్ఛక్తికీ దీపానికీ మధ్య లంకె వుండాలి. ఆ లంకె తంతి ద్వారా ఏర్పడుతుంది. జలాశయములనుంచి ఇంట్లో కొళాయి లోనికి నీళ్ళు రావాలంటే పెద్ద జలాశయంనుండి నగరానికి మద్యపైపులు వేయాలి. అపుడే కొళాయినుంచి నీళ్ళు రాగలవు. గురువు వాగ్రూనంగా ఉపదేశంచేస్తూంటే, గురుశిష్యుల మధ్య సంబంధం గురువు వాక్కులే. లేదా గురువు జీవితంలోని ఆచార వ్యవహారాలే శిష్యుడికి ఉపదేశప్రాయంగా ఉంటాయి. గురువు మౌనంగా వుంటూ ఒక సంకల్పంచేస్తే, అదే శిష్యునికి ఉపదేశమౌతుంది. గురువు ఉపన్యాసాల చేతనే ఉపదేశం చేయాలన్న నియమమేదీ లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద ఉపదేశం. ఉపదేశవిధానం స్థూలమే కాదు, సూక్ష్మము కూడ.

ఒక గురువు వాగ్రూపంగానూ, తన ఆచార అష్ఠాన పరిపాలన చేతనూ శిష్యునికి బోధిస్తే అతనిని ఆచార్యుడని అంటారు. ఒకడు ఉపదేశమూ చేయకపోవచ్చు. మార్గదర్శకంగా వుండకుండానూ పోవచ్చు. కానీ అతని అనుగ్రహమే గురుశిష్యుల మధ్య ఏర్పడిన అవ్యక్తసంబంధమని ఇదివఱకే చెప్పాను. ఆ అనుగ్రహమే అతడిచ్చే ఉపదేశం.

ఇట్లా వుండే గురువులలో కొందరు ఆచార్యులుగా వుండటమూ కద్దు. శిష్యులకు బోధిస్తూ శాస్త్రానుష్ఠానాలను స్వయంగా ఆచరిస్తూ, అంతరంగంలో సమాధ్యవస్థలలో వుండగల గురువులూ వున్నారు. శంకర భగవత్పాదులు ఇటువంటి గురువులు. ఇతర సాంప్రదాయములలోనూ, ఇట్లు ఒకే వ్యక్తి గురువుగా ఆచార్యులుగా వున్నవారున్నారు.

పూర్వకాలంలోని విద్యాగురువులు గొప్ప శీలమూ నిష్ఠా కలిగినవారు. ఆత్మానుభూతి గానీ, సమాధ్యవస్థ గానీ వారు ఎరుగకపోవచ్చును. కానీ ఆచార అనుష్ఠానాల బలంచేత వారు గురుకులములను నడుపుతూ శిష్యకోటికి విద్యాదానం చేసేవారు. మరికొందరు, స్వయంగానో, లేక శాస్త్ర సమ్మతమైన దానినో, ఆశ్రితులకు ఉపదేశం చేసేవారు వుండేవారు. అట్లు ఉపదేశం చేసిన వారి జీవితకాలంలో, వారి బోధనా విధానం శాస్త్ర విధానంగా పరిగణింపబడకపోయినా, వారి అనంతరం వారి విధానం వారి పేరిట వారి విధానం చెలామణియై వ్యాప్తి చెందేది. అట్టి గురువులు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకొన్నవారే. ఏ విధానానికే సంబంధించని గురువులూ ఎంతో మంది వున్నారు.

3. గురువూ - ప్రపంచము

ఒక గురువు క్రమపద్ధతిలో బోధచేయడానికి ఇష్టపడక పోవచ్చును. కాని శిష్యులను మాత్రం ఆశీర్వదించాలని కోరుకోవచ్చును. ఇంకో మహాత్ముడు ఆశ్రితుల విషయంలో ఈ ఆశీర్వాద బాధ్యత కూడ మనకెందుకని ఊరుకోవచ్చును. అలాంటపుడు ఆ ఆశ్రితులను ఈశ్వరుడే ఆశీర్వదిస్తాడు. వరప్రదానం చేస్తాడు. అనన్యంగా నమ్ముకొన్న ఆ ఆశ్రితులకు దేవుని చేయూత ఎప్పుడూ వుంటుంది.

అంధకారాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించే ఏ సంభవమైనా ఉపదేశ##మే.

సాధారణంగా ఒక గురువే శిష్యుని మంత్రోపదేశం ద్వారా అనుగ్రహించి అతనికి శక్తిపాతం కల్గిస్తాడు. కొందరు మహాత్ములు శాస్త్రోపన్యాసాలు ఇవ్వకపోయినా వారి శిష్యులకు మాత్రం మంత్రోపదేశం చేస్తారు. మనం ఎన్ని కథలు చదివివున్నాం. ఒక మహాత్ముని ముందు ఎంతోకాలం ఒకడు పడిగాపులు కాస్తూ వుంటాడు. ఒక్కరోజు హఠాత్తుగా ఆ మహాత్ముడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ క్షణం నుంచీ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. గురుమూలకంగా మంత్రోపదేశం పొందాలని తపస్సు చేసిన శిష్యులూ, యుక్తి చాతుర్యం ప్రకటన చేసిన శిష్యులూ వున్నారు.

ఇక్కడ కబీరు కథ చెప్పాలి. రామానందులనే మహాత్ముని వద్ద కబీరు రామ మన్త్రోపదేశం పొందాలని తపించేవాడు. కానీ అతడు ముస్లిము. అతడు హిందువే అనీ, ముస్లిములచేత పెంచబడ్డాడనీ కొందరు అంటారు. రామానందులు తనకు మంత్రోపదేశం యివ్వరేమో అని అతనికి సందేహం తోచింది. ఎట్లాగైనా మంత్రాన్ని ఆయన వద్ద పొందాలని ఒక ఎత్తువేశాడు. ఒకరోజు బ్రాహ్మీ ముహుర్తంలో రామానందులు గంగకు స్నానానికి వచ్చారు. కబీరు గంగానదీ స్నానఘట్టంలో మెట్లమీద పడుకొని వున్నాడు. చీకటిగా వున్నందున రామానందులు పడుకొని వున్న కబీరు మీద పాదాలు మోపారు. కబీరు దానినే పాదదీక్షగా గ్రహించాడు. (దీక్షగూర్చి తర్వాత చెప్తాను). ఎవరినో త్రొక్కినట్లు తోచగానే ఆయన 'రామరామ' అని పాదాఘాతానికి ప్రాయశ్చిత్తంగా గట్టిగా ఉచ్ఛరించారు. కబీరుకు అదే ఉపదేశ##మైంది. తారకమంత్రాన్ని ఏ విధంగానైనా రామానందులనుండి పొందాలనే కబీరు ఈ పన్నాగం పన్నినాడు.

ఇంతకూ ఈ కథ ఎందుకు చెప్పానంటే, రామానందుల వారు ఉద్దేశపూర్వకంగా కబీరుకు మంత్రోపదేశం చేయలేదు. కానీ ఆయన రామరామ అనగానే, శిష్యుని సంకల్పంవలన, వారి అనుద్దేశపూర్వకమైన ఉచ్ఛారణ వలనా, గురుశిష్య సంబంధం ఏర్పడినదని చెప్పుటకు ఈ ఉదాహరణ.

మంత్రోపదేశాన్ని చేసినవానిని గురువంటారు. ఈ మంత్రోపదేశం చేత గురుశిష్యులమద్య ఒక లంకె ఏర్పడుతుంది. ఆ మంత్రాన్ని వివరించవలసిన అవసరమూలేదు. అది ఆచార్యుని పని. అకస్మాత్తుగా, అనుద్దేశపూర్వకంగా ఒక మంత్రం ఉచ్ఛరించినా, గుర్వనుగ్రహం మంత్రం ద్వారా శిష్యుణ్ణి సంక్రమిస్తుంది. లేదా ఆ మంత్రశక్తి గురువు అనుగ్రహానికి మూలమని కూడా చెప్పవచ్చును.

గురువు ఒక సిద్ధ గురువైతే, శిష్యుడు పరిపక్వమున్నవాడైతే, వాగ్రూపక మంత్రోపదేశ##మే అక్కరలేదు. కానీ గురుశిష్యులమధ్య ఒక సంబంధం మాత్రం ఏర్పడాలి. అదెట్లా సాధ్యం? గురువు శిష్యుని వంక ఒక మారు చూస్తే చాలు. అదే కటాక్షదీక్ష ఔతుంది. వలసిన సంబంధం ఆ కటాక్షమే కల్గిస్తుంది. కటాక్షమాత్రాన శిష్యునికి జ్ఞానోపలబ్ధి ఏర్పడుతున్నది. గురువు శిష్యుని శిరస్సును స్పృశించుటం కూడా దీక్షయే. దీనిని హస్తమస్తకదీక్ష అని అంటారు. కొన్ని సమయాలలో ఇవి ఏవీ అక్కరలేదు. ఇవన్నీ స్థూలక్రియలు. గురువు సంకల్పమాత్రాన - 'ఈ బిడ్డకు ఆరోగ్యం కలగాలి' అని అనుకొన్న మాత్రంలో, అది ఉపదేశతుల్యమై గురుశిష్యసంబంధాన్ని వెంటనే సృష్టిస్తుంది.

4. దీక్ష

ఉపదేశమూలకంగా గురు శిష్య సంబంధం ఏర్పడు తున్నదనే విషయం గూర్చి ఇంతవఱకు చెప్పాను. శాస్త్రపరిభాషలో దీనినే 'దీక్ష' అని అంటారు. తమిళంలో దీనిని 'దీక్కై' అని చెబుతారు. ఉపదేశమూలకంగా గురువునుంచి ఒక చైతన్యం శిష్యునిలో ప్రవేశించి, తీవ్రసంవేగాన్ని కల్పించి, ఆధ్యాత్మమార్గంలో ఒక అన్వేషణకు పురిగొల్పేదే దీక్ష. ఈ చైతన్యం దీక్ష అయిపోయినంతనే అంతరించిపోవటంలేదు. ఈ చైతన్యం శిష్యునిలో ప్రవిష్ఠమై అతనిని ఆధ్యాత్మ్యంలో ఉన్నత లక్ష్యాలకు తీసుకువెళ్ళి మంత్రసిద్ధి కలుగ చేస్తున్నది.

గురువు ఒక్క మారైనాసరే, మంత్రోపదేశం చేసియో, కటాక్షమూలకంగానో, హస్తమస్తక స్పర్శ చేతనో అనుకంపనచేతనో గురుశిష్య సంబంధమైన దీక్ష నిచ్చినట్లైతే, ఆ అనుగ్రహం శిష్యుని మీద ఎల్లకాలమూవుంటుంది. స్విచ్చిని నొక్కి ఉంచినంతసేపూ బల్బు వెలిగేట్లు ఈ అనుగ్రహం పనిచేస్తుంది. ఆచార్యుడు శిష్యుని సమక్షంలో వుంచుకొని, దీర్ఘకాలం అతనికి విద్యను, అనుష్ఠాన విధానాలను బోధించవలసి వుంటుంది. గురుని విషయం అట్లకాదు. అతనికి శిష్యునితో స్థూలసంబంధం అక్కరలేదు. అతనికి ఒక్కక్షణంవుంటే చాలు. కొన్ని సమయాలలో అదికూడ అక్కరలేదు. అతని అనుగ్రహం దీక్షామూలకంగా ప్రసరించి శిష్యుని సంసారాన్ని క్షణంలో భస్మంచేస్తుంది. శిష్యునికి సిద్ధిప్రాప్తించేవఱకు గుర్వనుగ్రహం అన్ని కాలాలోనూ అతనితో వుంటుంది.

దీక్షఇచ్చినవాడు గురువు. భారత రామాయణాదులలో, పురాణాల్లో, తండ్రియే గురువని చెప్పబడింది. తండ్రి ఘనుడైనాసరే కాకపోయినాసరే, మహాత్ముడైనాసరే కాకపోయినా సరే, తనయునికి అతడు దైవసమానుడే. వేదాలు 'పితృదేవోభవ' అని కూడా చెప్పినవి. తండ్రిని గురువుగా భావించడానికి మరో కారణం కూడా వున్నది. పుత్రునికి బ్రహ్మూపదేశ సమయంలో తండ్రియే కదా గాయత్రీమంత్ర దీక్ష ఇస్తున్నది? తండ్రిని గురువుగా భావించటానికి ఈ ఆచారము కూడా కారణం.

ఇదేకాదు. అక్షరాభ్యాసకాలంతో తండ్రి కుమారునికి 'ఓం నమోనారాయణాయ' అని అష్టాక్షరియో, 'ఓం నమః శివాయ' అని పంచాక్షరియో ఉపదేశంచేసే ఆచారం మనలో వున్నది. ఈ కారణంగా కూడా తండ్రి కుమారునికి గరువు ఔతున్నాడు. గురువు వద్ద శరణుజొచ్చిన శిష్యుడు శరణాగతి కారణంగా జ్ఞాన లాభాన్ని పొందుతున్నాడు. ఈ జ్ఞానోపలబ్ధికి, గురువు యెక్క లాఘవం గానీ, అనుభూతి రాహిత్యం గానీ అడ్డురాదు. శరణాగతి యొక్క మహాత్మ్యము అలాంటిది.

ఇలాంటి గురుభక్తి గూర్చి చెబుతున్నపుడు నాకు కంచిమఠంలో జరిగిన ఒక ఉదంతం జ్ఞప్తికొస్తున్నది. మఠ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు కుఱ్ఱవాళ్ళను చూచి, మీ అధ్యాపకులు వచ్చారా అని నేను అడిగాను. ఒక బాలుడు 'ఇంకా రాలేదు' అని బదులిచ్చాడు. రెండవ కుఱ్ఱవాడు, 'ఆ! వచ్చారు' అని బదులు చెప్పాడు. నిజానికి అధ్యాపకుడు రాలేదు. రెండవ అబ్బాయితో ఎందుకు నీవు ఈ విషయంలో అబద్ధంచెప్పావు అని నేను అడుగగా, అతడు, 'గురువు రానిదేమో నిజమే. ఆయన రాలేదంటే ఆయన లోపం చూపినట్లు ఔతుంది. అందుచేత నిజం చెప్పి గురువుయందు దోషం చూపేదానికన్న, అబద్ధంచెప్పి దోషాన్ని చూపకుండుట మంచిదని తోచి అట్లాచెప్పాను' అని అన్నాడు.

గురువు యోగ్యత ఎలాంటిదైనాసరే, శిష్యునికి గురువుయందు అఖండమైన అనన్య భక్తి వుంటే, అతనిని ఈశ్వరానుగ్రహం వెన్నంటియే వుంటుంది.

మనం ఏ విషయాన్నైనా స్వయంగా నేర్చుకొంటే అది అహంకారానికి దారి తీస్తుంది. ఏ విద్యకైనా ఒక గురువు అవసరం. మంత్రములు కూడా స్వయంగా గ్రహించినవి కాక, గురూపదేశములై వుండవలె, గురువులేకుండా తీసుకొన్నమంత్రమో, చదివిన విద్యయో, భార్యకు ఆమె ప్రియుడి చేత కల్గిన సంతానము వంటిది! అతనిని కుమారుడని పిలుచుకోవచ్చును. కాని వైదిక కర్మలు చేయడానికి అతనికి అర్హత లేదు.

అందుచేత దీక్షకు గురువు అనివార్యము. వాగ్రూపకదీక్ష మంత్రోపదేశము కటాక్షంతో అనుగ్రహించే దీక్ష నయనదీక్ష. శిష్యుని స్పర్శతో అనుగ్రహించేది స్పర్శదీక్ష. భగవత్పాదులు. అంటే భగవంతుని పాదములను శిరసాగ్రహించి, ఆ పాదములే తాను అయినవాడని అర్ధం. అనగా మనం శంకర భగవత్పాదులవారిని శిరస్సున ధరించాలి. గురువు ప్రత్యక్షోపదేశం ఇవ్వవలసిన అవసరంలేదు. ఎక్కడో దూరాన గురువు కూర్చుని శిష్యుని స్మరించినంత మాత్రాన శిష్యునికి స్మరణ దీక్ష లభ్యమౌతున్నది.

5. అంబికానుగ్రహమే దీక్ష

సచ్చిదానందమని మనం చెబుతుంటాము. చిత్‌ అనే పదానికి జ్ఞానం అని అర్ధం. అంబికయే జ్ఞానస్వరూపిణి. లలితానామసహస్రంలో చిదేకరసరూపిణి అని ఒక నామమున్నది. ఏకరసము చిత్తే. శ్రీ కాళహస్తిలో అమ్మవారిని జ్ఞాన ప్రసూనాంబ అనే అంటారు.

గురురూపంలో వచ్చి మనలను అనుగ్రహించేది అంబికయే. కాళిదాసు 'దేశిక రూపేణ దర్శితభ్యుదయాం' అని అమ్మవారిని కీర్తిస్తున్నాడు. దేశికుడంటే గురువే. వైష్ణవ సంప్రదాయ ఆచార్యులలో వేదాంతదేశికులొకరు. ఆలన 'వడగల' శాఖీయుడు. భగవత్పాదుల వారి శిష్యుడు తోటకాచార్యులు తన తోటకాష్టకంలో 'శంకర దేశికమే శరణం' అని ప్రార్ధించారు. దేశికుడంటే అన్ని ప్రదేశాలను ఎరిగిన వాడు, శాస్త్రనిష్ణాత. దేశికుని రూపంలో అంబ అవతరించి శిష్యుణ్ణి, స్పర్శ, నయన, స్మరణ దీక్షరూపంలో అనుగ్రహిస్తున్నది.

స్పర్శదీక్షను కుక్కుటదీక్ష అనీ, నయనదీక్షను మత్స్యదీక్ష అనీ, స్మరణదీక్షను కమఠదీక్ష అనీ అంటారు.

గురువు అనుగ్రహించిన దీక్ష ప్రతిభావంతమై ఉంటే శిష్యుడు తన అర్ధరహితమైన జీవితానికి స్వస్తి చెప్పి పరమార్ధిక పధగాముడై పోతాడు. నిజానికి అది అతనికి ఒక పునర్జన్మ అనే అనాలి. అందులకే గాయత్రీ మంత్రోపదేశంచేత ఒకడు ద్విజుడౌతున్నాడు. ద్విజ అంటే రెండో పుట్టుక.

అంటే దీక్షకు ముందు ఒక జన్మ వుండినదనీ, దీక్ష పిదప మరల అతడు జన్మిస్తున్నాడనీ కాదు దీని అర్ధం. దీక్షకు ముందుకూడా అతడు అంతరంగములో బ్రహ్మభేదముగా వుండినప్పటికి, అతనికి ఆ ఎరుక లేకపోవడంచేత అజ్ఞానిగా వుండినాడు. దీక్షామూలకంగా ఆ అజ్ఞానమనే పొర అతనిని వీడిపోయింది. ఒకకోడి గుడ్లు పెట్టిదానిపై కూర్చుని పొదిగినపుడు, గుడ్డును పగలకొట్టుకొని పొరనుండి బయటపడే కోడి పిల్ల వలె శిష్యుడూ, గురువను గ్రహించిన కుక్కుట దీక్షామూలకంగా (కుక్కుటం అంటే కోడి) అజ్ఞానమనే అండాన్ని ఛేదించుకొని జ్ఞాని ప్రపంచంలో పడుతున్నాడు. తన నిజతత్త్వమేమో తెలుసుకొంటున్నాడు.

నీళ్ళలో చేపలు గ్రుడ్లు పెడతాయి. ఆ గ్రుడ్లు నీళ్ళలో తేలుతుంటాయి. చేపలు కోళ్ళవలె ఆ గుడ్లపై కూర్చుని పొదగటంలేదు. తేలుతూవున్న ఆ గుడ్లను అవి చూచినంత మాత్రాన అవి చేపపిల్ల లౌతాయని మన శాస్త్ర సంప్రదాయం. కవి సంప్రదాయం ఈ విషయంలో ఈ కాలపు జూవాలజీ ఏమంటుందో? అందులకే గురువు యొక్క వీక్షాదీక్షను నయన దీక్ష అనీ, మత్య్సదీక్ష అనీ అంటారు.

ఇక కమఠ దీక్ష సంగతి. కమఠం అంటే తాబేలు. తాబేలు గ్రుడ్లను ఇసుకలో పెట్టి మళ్ళా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఆ గుడ్ల సమక్షంలో లేకపోయినా, తాబేలుకు అదే ధ్యాస. ఆ పిల్లలు సుఖంగా గుడ్లనుంచీ బయట పడతాయా లేదా అని విచారిస్తూనే వుంటుంది. దాని స్మరణబలంచేతనే గుడ్లు పొదగబడి తాబేలు పిల్లలు బయటకు వస్తవి. అందులకే గురువు యొక్క స్మరణదీక్షను కమఠదీక్షను అని కూడా అంటారు.

అంబిక ఏ విధంగా దేశికరూపంలో ఈ మూడు విధములైన దీక్షలను మనకు అనుగ్రహిస్తున్నది?

అంబిక అక్షత్రయమని, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అని మూడు రూపములలో ఆవిర్భవించి వున్నది. కంచిలో కామాక్షి వున్నది. ఆమె అనుగ్రహించేది స్పర్శ దీక్ష. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో--

శృతీనాం మూర్ధానో దధతి తన¸° శేఖరతయా

మమాస్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌః

'అమ్మా! నీ పాదాలను శృతి శిరస్సులనబడే ఆ ఉపనిషత్తులే తలదాల్చి వున్నవి. అట్టి నీ చరణములను నా శిరస్సుపై వుంచి నన్ను అనుగ్రహించు అని వేడుకొంటున్నారు. ఉపనిత్తులు వేదాంతమును బోధిస్తవి. శంకరుల జ్ఞాన మార్గము వేదాంత సంప్రదాయమే. జ్ఞానస్వరూపిణియే కామాక్షి. ఆమెను భగవత్పాదుల వారు స్పర్శదీక్షకై ప్రార్ధిస్తున్నారు.

మధురలో మీనాక్షి వున్నది. ఆమె మీననేత్ర. ఆమె మనకు అనుగ్రహించే దీక్ష నయన దీక్ష. ఆమె కటాక్షములే మనకు జ్ఞానదీక్ష ఇస్తున్నది. ఇకపోతే కాశిలో విశాలాక్షి వున్నది. ఆమె సర్వకాలములలోనూ మనలనే స్మరిస్తూ స్మరణ దీక్షాప్రదానం చేస్తున్నది. ఆమె అనుగ్రహించేదే కమఠ దీక్ష. ఈ విధంగా అంబిక మూడు రూపాలలో మూడు విధములైన దీక్షలను అందరికీ అనుగ్రహిస్తూ పరతత్త్వజ్ఞాన దానంచేస్తున్నది.

6. పూర్ణత్వమునకు ఎన్నోమార్గములు

దీక్షలు పలు విధములు. దీక్షా మార్గములెన్నోవున్నా గమ్యము ఒక్కటే. ఒకే గురువు తన శిష్యులలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క మార్గము నిర్దేశించవచ్చును. కాని ఆచార్యుడు మాత్రం శిష్యులకు ఒకే సంప్రదాయమును ఉపదేశిస్తాడు.

గురువులు శిష్యులను మంత్ర, తంత్ర, యోగ, ద్వైతాద్వైత మార్గములలో దేనిలోనైనా ప్రవేశ##పెట్టవచ్చును. తిరుమంత్రమనే గ్రంధంలో తిరుమూలర్‌ అనే సిద్ధుడు వివిధ మార్గములను విశదీకరించి యోగ జ్ఞానములతో ముగింపు చేశాడు. తిరుమూలర్‌తో ఒక గురుపరంపర ఆరంభ##మైనది. ఈ పరంపరలో సారమామునివర్‌ ఒకరు. ఆయన తిరుచినాపల్లిలో ఒక మఠాన్ని స్థాపించాడు. ఈ మఠానికి ఒక సమయంలో మౌనగురువు అనే ఆయన అధిపతిగా వుండినాడు. తాయుమానివర్‌కు ఈయనే గురువు. తాయుమానవర్‌ క్రీ.శ.17వ శతాబ్దమునకు చెందినవాడు. మౌన గురువే అనంతరం ఈ మఠం ధర్మపుర అధీనం క్రిందకు వచ్చింది.

దక్షిణామూర్తి సనకాది మునులకు మౌనవ్యాఖ్యా రూపంగా జ్ఞానబోధ చేస్తున్నాడు. తాయుమానవర్‌ కూడా అన్ని మార్గాలూ చిట్టచివర మౌనంలోనే లయిస్తాయని చెబుతున్నాడు.

మన నిజతత్త్వం మౌనమే. ఆ మౌనాన్ని మరచి లేనిపోని సంసారంలో పడుతున్నాం. సంసారమంటే మాయ. అమ్మవారే మహామాయ. ఆ మహామాయయే జ్ఞానాంబికగా అవతరించి మన అజ్ఞానాన్ని పోగొడుతూవుంది. ఈ జ్ఞానబోధకే ఆమె గురుస్వరూపిణి ఔతున్నది. ఆ జగన్మాత మనకు జ్ఞాన మనే క్షీరాన్ని ఇస్తున్నది. ఈ లోకంలో చెట్టు చేమలూ, పక్షులూ, పండ్లూ, వివిధ వస్తుజాలమూ అంతా ఆమె సృష్టియే. ఎన్నో రంగులూ, ఎన్నో వాసనలు, ఎన్నో రూపాలు, మనుష్యులలో ఎన్నో మనోభావాలు. అంతా ఆ మహామాయ విలాసమే. ఆమెయే లిపి రూపంగానూ భాషారూపంగానూ, శాస్త్ర రూపంగానూ వున్నది. అన్నిటికి ఆవలది మౌనం. మహామౌనం. మౌనగురువుగా ఆమె అవతరించి శిష్యునికి జ్ఞానబోధ చేస్తుంది. 'ఏకంసత్‌' అని.

7. గురువూ ఆచార్యుడూ ఒక్కరే

మొత్తం మీద నేను చెప్పేది ఇది. మనకు జ్ఞాన దానం చేసేవారిని గురువు, ఆచార్యుడు అని పిలుస్తున్నాం. మహత్త్వమున్నందున గురువని పేర్కొంటున్నాము. శ్రోత్రియుడూ, అనుష్ఠాన పరుడూ సంప్రదాయజ్ఞుడూ అయిన వానిని ఆచార్యుడని అంటున్నాం. ఆచార్యుడు సంప్రదాయ మర్మములను మనకు తెలిపి మనలను అనుష్ఠాన పరులుగా చేస్తున్నాడు. గురువు తన మహత్వం చేతా అనుగ్రహంచేతా మనకు జ్ఞాన దానం చేస్తున్నాడు. ఆచార్యుడు శాస్త్ర సంప్రదాయాల మూలకంగా మనకు ఆచార అనుష్ఠానాలను తెలిపి జ్ఞానలాభానికి తోడ్పడుతున్నాడు.

ఈ విధంగా ఆచార్యునికి గురువుకూ కించిత్‌ భేదమున్నప్పటికీ, పాత్రత వున్న ఆచార్యుడు గురువు కూడా కాగలడు. ఆచార్యుడు ఒక సంప్రదాయానికి చెంది తదనుసారులైన ఆచార అనుష్ఠానాలను గూర్చి బోధిస్తున్నా, తన వఱకూ ఒక విధానానికి కట్టుబడక ఈశ్వరానుభవమూ, ఆత్మానుభవమూ పొందివుండినట్లైతే, ఆతడు గురువై అనుగ్రహదానం చేయగలడు. మన ఆచార్య పురుషులందరూ ఈ కోవకు చెందిన వారే.

ఆధ్యాత్మిక జీవనారంభంలో కొన్ని కట్టుబాట్లు వుండవలసినదే. అపుడే మనస్సుకు ఒక నిలకడ ఏర్పడగలదు. అందులకు మన పెద్దలు యమనియమాలు చెప్పారు. ఈ కట్టుబాట్లు వున్నంత వఱకు మన మందరమూ శిష్యులమే. నిర్బంధంగా అనుసరించే ఈ నియమాలు కొంతకాలానికి సహజమై పోతాయి. అతనికి నియమపాలనం చేస్తున్నానని కూడా అనిపించదు. అపుడు అతడు ఇతరులను కూడా ఆ మార్గంలో ప్రవేశ##పెట్టగలడు. అట్టివాడు చేసే ఉపదేశాలు ఇతరులను గాఢంగా ప్రభావితులను చేయగలవు.

ఆచార్యుల స్థానంలో వచ్చిన ఈ కాలపు గురువులకు, విద్వత్తు వుంటేచాలు. ఆచార అనుష్ఠానాలు వారికి అక్కరలేదు. పూర్వకాలంలో విద్యుత్తు, ఆచార అనుష్ఠానములున్న వానినే ఆచార్యుడని పిలిచేవారు. అనుష్ఠానము అంగమేకానీ లక్ష్యంకాదు. అనుష్ఠానం అనుభూతిలో ముగియవలె. అట్టి అనుభూతిపరునకు, ఆచారం స్వాభావికమైపోతుంది.

అనుష్ఠానమున్నపుడే విద్యకు పూర్ణత. అనుష్ఠానానికి పూర్ణత్వం అనుభూతియే. అనుభూతి కలవాడే గురువనీ, అనుష్ఠానపరుడు మాత్రమే ఆచార్యుడనీ చెబితే అదీ సరికాదు. నిజమైన ఆచార్యుని అనుష్ఠానమూ, అనుభూతీ రెండూ వుంటవా. ఆచార్యుని బహిరంగా జీవనం అనుష్ఠానబద్ధంగా వుంటూ, ఆంతరంగికంగా అతడు ఏ కట్టుబాటూ లేక కైవల్యంలో వుంటాడు. అట్టివాడే మార్గదర్శకంగా వుండగలడు. అతడు ఆంతరంగ మౌనం భజిస్తూ బయట ఉపదేశ ఉపన్యాసకార్యావళిలో మగ్నుడై వుంటాడు.

గురువూ ఆచార్యుడూ ఇద్దరూ ఒక్కటే. ఆదికాలం నుంచీ వీనిని పర్యాయపదాలుగానే వాడుతున్నారు. ఉపనిషత్తులు వేద శిఖరములు. వానిలో పూర్తిగా ఆచార్యపద ప్రయోగమే చేయబడింది. ఆచార్యదేవోభవ అనీ, ఆచార్యునికి అతడు కోరిన దక్షిణ ఇవ్వవలెననీ, ఆచార్యవాన్‌ పురుషోవేదా - ఆచార్యుడున్న వాడే జ్ఞాని కాగలడు అనీ ఉపనిషత్తులు చెబుతున్నవి. అయినప్పటికీ ఆచార్యునితో సహవాసం చేస్తూ విద్యాభ్యాసం చేసే విధానాన్ని గురుకులవాసమని అన్నారు కానీ ఆచార్యవాసమని చెప్పలేదు. ఆచార్యుని కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే దినమును గురుపౌర్ణమి అనే అంటున్నాము. వ్యాసాచార్యులు, శుకాచార్యులు, గౌడపాదాచార్యులు, గోవిందాభగవత్పాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు వీరి నందరినీ చేర్చి గురుపరంపర అని వ్యవహరిస్తున్నాం. వారిని ఆచార్య పరంపర అని అనటం లేదు. ఇదే విధంగా రామానుజ, వల్లభాచార్య మధ్వాచార్య సాంప్రదాయములలో కూడ గురువందనమనే అంటారు.

శైవ సిద్ధాంతాన్ని పాటించే గరువులను కూడా ఆచార్యులనే వ్యవహరిస్తారు. మైకండాచార్య, సంతనాచార్య మొదలైనవారు శైవసిద్ధాంతానికి చెందినవారు. గురువులు సిధ్ధిపొందిన దినం తమ గురుస్మారకంగా ఆరాధన చేస్తారు. ఆ ఆరాధనను గురుపూజ అనే అంటారు.

8. ఆచార్యుడే ఈశ్వరుడు

ఆచార్యపురుషులకు బంధములేదు. వారు స్వతంత్రులు నిత్యముక్తులు. మనకు నియమబద్ధజీవనాన్ని చూపుటకే వారు ఆచార్యులుగా విహరిస్తున్నారు. అట్టి వారి సేవ శీఘ్రఫలదం. ఈశ్వరుడే ఆచార్యరూపంలో మనకు జ్ఞాన దానం చేస్తున్నాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అని అన్నారు. సర్వమూ ఈశ్వరుడే. అపుడు ఈశ్వరుడు గురువులోనూ ఆచార్యునిలోనూ వున్నాడంటే అభ్యంతరమేమి?

అట్లైతే మనం ఎవరం? మనమూ ఈశ్వరులమేకదా? మరొకనిని ఆచార్యుడనీ, ఈశ్వరుడనీ మనమెందులకు ఆరాధించవలె?

అన్నీ అతడే. కానీ మన ఈశ్వరత్వాన్ని మనం స్వయంగా గుర్తించలేకుండా వున్నాం. కించిత్తైనా మన ఈశ్వరత్వం మనం గుర్తించకలిగితే, ఈ కామక్రోధాలూ, ఆశాపాశాలూ, దుఃఖం, కష్టం, పాపం ఉంటవా? మనం ఈశ్వరులమన్న జ్ఞానం లేక అలమటిస్తున్నాం. కానీ ఆచార్యునికి తన ఈశ్వరత్వం తెలుసు. ఆయనకు మనకున్న సుఖదుఃఖాలు లేవు. అతడు ద్వంద్వాలకు అతీతుడు. మనలో చూడలేని ఈశ్వరత్వాన్ని అతనిలో మనం చూడకలుగుతున్నాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని, ఆచార్యసేవ చేశామంటే, ఆయన మన అజ్ఞానమనే తెరను తొలగించి మనలో సత్యప్రతిష్ఠ చేయగలడు.

అందుచేత పరమార్థ ప్రయోజనం కోసం ఆచార్యుని ఇప్పుడే ఇక్కడే ఈశ్వరుని భావించి విధేయులమై ఆయన అనుగ్రహం చేసిన ఉపదేశానుసారం జీవితాలను నడపుకోవాలి.

9. స్వధర్మాన్ని పాటించండి

మన పూర్వకర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నవి. ఈశ్వరుడు మనలను ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సంప్రదాయంలో పుట్టించాడో తదనుసారం జీవితం గడుపుతూ కర్మక్షాళనం చేసుకొని పురుషార్థాన్ని సాధించాలి. మనజాతికో, శాఖకో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరించితే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణములైననూ ఫరవాలేదు.

కర్మశేషముండటంవల్ల జీవునికి పూర్ణత్వం అవగతమవటంలేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతాచారం అసంపూర్ణమైనా పూర్ణ కర్మ క్షయానికి అది సహాయపడుతుంది. ఎవనికి అనన్య భక్తియున్నదో, తన్ను పూర్తిగా భగవంతునికి అర్పణచేసుకొంటున్నాడో, వానికి ఈశ్వరుడు ఎన్నడూ ప్రణష్ఠుడుకాడు. ఈశ్వరానుగ్రహం అతనికి అన్ని కాలములలోనూ వుంటుంది. ''ఈ జీవితాన్ని నాకు నీవు ప్రసాదించావు. నేను నా సంప్రదాయాచార్యుని పాదములను నమ్ముకొన్నాను''. అని ఎవడైతే తన కులధర్మాన్ని అస్ఖలిత శ్రద్ధతో పాటిస్తున్నాడో, వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు.

మన ఆచార్యుడే ఈశ్వరుడన్న విశ్వాసం మనకుండవలె. గురువుకు స్వాత్మార్పణ చేసుకొంటే అది ఈశ్వరార్పణ. గురువు వద్ద చేసే ప్రపత్తి ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పారాయణ చేసేటపుడు చెప్పే శాంతిపాఠంలో వున్నది.

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం

యోవై వేదాంశ్చ ప్రహిణోతి తసై#్మ

తంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం

ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే

''ఎవడు బ్రహ్మను పూర్వము సృష్టించాడో, వేదములతనికి అనుగ్రహించాడో, ఆ ప్రకాశరూపుని, బుద్ధిప్రేరకుని, మోక్షార్ధం శరణుచెందుతున్నాను'',

ఒక సంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్దిపై ఆధారపడేవానికి అనర్థమే కల్గుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసేహానికంటే అధికం. ఒక సంప్రదాయాన్ని అనుసరించనివాడు మూర్ఖుడని భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంతమాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయంలేదు.

10. దేవతలే శిష్యులుగా ఉండటం

మనమందరమూ సంప్రదాయాన్ని వదలరాదు. సంప్రదాయ ఆచార్యులయందు భక్తిని వుంచాలి. గురువుల అడుగుజాడలలో మనం నడవాలి. మన ఆచార్యులందరూ పరమ గురుభక్తులే.

మనకు మొదటి గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమేశ్వరుడే. ఆయనకూడా ఒక గురువును వరించి ఉపదేశం పొందవలసి వచ్చింది. ఆయన తన పుత్రునివద్ద వినయవిధేయతలతో ప్రణవోపదేశం పొందాడు.

జ్ఞానస్వరూపమే అంబిక. ఆమెకూడ తనభర్త ఈశ్వరుని వద్ద శిష్యరికం చేసింది. ఆమెకు ఈశ్వరుడు ఆగమములను, తంత్రములనూ ఉపదేశించాడు. అంతేకాదు. ఆమెకు క్రింది తారకమంత్రాన్ని కూడా ఉపదేశించాడు.

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే

సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే.

మూడు మారులు రామనామం చేస్తే అది వేయి విష్ణనామాలు చెప్పినంత పుణ్యం.

ఈశ్వరుడు అంబికకు ఉపదేశించాడన్న విషయం ఎన్నో స్థలపురాణాలలోనూ వున్నది. మహావిష్ణువు రామకృష్ణాద్యవతారములలో గురుకులవాసం చేశారు. రాముడు వశిష్టునివద్ద, కృష్ణుడు సాందీపమహర్షివద్ద గురుకులవాసం చేశారు. కృష్ణుడు తన సహూధ్యాయుడైన సుదామునితో వానలో, తుఫానులో వంట చెఱకుకోసం వెళ్ళాడు. చిత్రకూటంలో భరతునితోబాటు వశిష్టుడు వచ్చి రాముని అయోధ్యకు తిరిగి రమ్మని కోరినపుడు ఆయన గురువు యొక్క సమ్మతితో, అయోధ్యకు మరలివచ్చుటకు నిరాకరించాడు. ఈ నిరాకరణ కూడా వినయపూర్వకంగానే చేశాడు.

గురుపరంపరలో దత్తాత్రేయునికి ఒక విశిష్ఠ స్థానమున్నది. భాగవతంలో ఆయన తనకు 24 గురువులు ఉన్నట్లు చెప్పాడు. భూమి, నీళ్ళు, కొండచిలువ, కందిరీగ, వేశ్య, వేటగాడు, శిశువు - వీళ్ళంతా తనకు గురువులని ఆయన అన్నాడు. ఒక్కొక్కరివద్ద ఒక్కొక్కపాఠం తాను నేర్చుకొన్నట్లు ఆయన వినయంగా చెప్పుకొన్నాడు.

11. ఆదిశంకరుల గురుభక్తి

ఆచార్య అనే పదం చెవిలోపడితేచాలు, మనకు జ్ఞాపకానికి వచ్చేది శంకరాచార్యులే. ఆయన తన గురువు గోవింద భగవత్పాదులను, వారి గురువైన గౌడపాదులను దక్షిణామూర్తి స్వరూపంలో చూచి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నమస్కారక్రియగా వ్రాసారు. శంకరులవారే స్వయముగా దక్షిణామూర్తి అవతారము. కానీ వారు వ్రాసిన దక్షిణామూర్తి స్తోత్రంలో, ప్రతిశ్లోకంలోనూ, 'తసై#్మ శ్రీ గురుమూర్తయేనమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే' అన్న వాక్యం నాలుగవ పాదంలో జోడించి నమస్కరిస్తున్నాను.

తమ గురుభక్తిని ఒక శ్లోకంలో శంకరులు ఈ విధంగా వ్యక్తం చేశారు.

''ఈమూడు లోకాలలోనూ జ్ఞానదాతయైన సద్గురువుతో పోల్చదగిన వస్తువులేదు. వరుసవేది అయఃపిండాన్ని బంగారుగా మార్చగలదు. ఒక రాతిని బంగారుగా మార్చగలదు. కానీ రాతిని మరొక వరుసవేదిగా అది రూపొందింప లేదు. గురువన్ననో, తన్ను ఆశ్రయించిన వానిని తన అంతటి వానినిగా చేయగలడు. అందుచేత గురువుకు సాటి వేరే ఎవరూ లేరు''.

కాశిలో పరమేశ్వరుడే ఛండాలరూపంలో శంకరుని ముందు నిలచినపుడు, 'ఛండాలోస్తు సతుద్విజోస్తు గురురాత్యేషామనీషామఘ' ఆత్మజ్ఞానిఛండాలుడైనా సరే, నాకు గురువే - అని ఉద్ఘాటించారు. తానే జగదాచార్యులు. అయినప్పటికి అందరిసమక్షంలో వారు ఈ విధంగా వినయంగా చెప్పుకొన్నారు.

12. రామానుజాచార్యులవారి గురుభక్తి

రామానుజులు తన గురువుయొక్క ఆదేశమునకు విరుద్ధంగా తనకు ఉపదేశించిన మంత్రాన్ని అందరకూ ఉపదేశించారు. (ఆయన గురువు తిరుకోటియూర్‌ నంబి.) కానీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆ గురువుగారికి రామానుజులు వినమ్రుడై వుండినారు. ఆయన గురువు ఉపదేశము ఇవ్వడానికి పూర్వము, రామానుజులను 18 మారులు శ్రీ రంగంనుండి తిరుకొట్టియూరుకు వచ్చి పొమ్మన్నారు. కాని రామానుజులు ఏ విధమైన అనిచ్ఛగానీ, అసౌకర్యంగానీ గురువుకు వ్యక్తం చేయలేదు.

గురువుకు స్మార్తుల నాలుగుమారులు సాష్ఠాంగ నమస్కారము చేస్తారు. వైష్ణవులు 'గురువు చాలు' అని చెప్పేంతవరకు నమస్కారాలు చేస్తూనే వుంటారు. ఒకమారు తిరుకోటినంబి నదిలో స్నానం చేస్తున్నారు. నదీతీరంలోని ఇసుక సూర్యరశ్మికి వేడిగా ఉంది. ఉష్ణం అసహనంగా వున్నా రామానుజులు లెక్కచేయక మండే ఇసుకలో తిరుకోటినంబికి అవిరామంగా నమస్కారాలు చేస్తూనే వున్నారట. శిష్యుని కష్టంచూచి గురువు ఇక చాలు అని నమస్కారాలను నిలిపారట.

13. శంకరుని శిష్యులు

భగవత్పాదుల శిష్యులు స్వయముగా మహాత్ములు. కాని వారి గురుభక్తి అసమానము. శంకరులు శిష్యులలో తోటకాచార్యులు - భవ ఏవభవాన్‌ - నీవు స్వయముగా భవుడనే (శివుడనే) నీవు వృషభధ్వజుడివి అని తోటకాష్టకంలో శంకరులను స్తుతి చేశారు.

ఒకపుడు వ్యాసులవారు శంకరులను పరీక్షింపదలచి వృద్ధవేషంలో బ్రహ్మసూత్రభాష్యంపై వాదానికి వచ్చారు. అపుడు వారిసమక్షంలో పద్మపాదాచార్యుల వారున్నారు. వారి వాదం అతి తీవ్రస్థితిలో వున్నపుడు - 'శంకరః శంకర స్సాక్షాత్‌ వ్యాసో నారాయణ స్వయం' - అని పద్మపాదులు తమ గురువును హెచ్చరించారు.

పిదప పద్మపాదులు శంకరభాష్యంపై ఒక విసృతిని రచించారు. దానిని పంచపాదిక అని అంటారు. అందులో శంకరులను వారు 'అపూర్వ శంకరులు' అని పిలిచి తమ గురుభక్తిని వెల్లడిచేశారు.

పద్మపాదుల అసలుపేరు సనందనుడు. ఆయనది చోళ##దేశం. వారు కాశిలో ఆదిశంకరులకు 16 ఏళ్ళు నిండకముందే శిష్యులయ్యారు. భాష్యములన్నీ అప్పటికే శంకరులు పూర్తిచేసి జీవితాన్ని చాలించాలని అనుకొన్నారు. ఆ సమయంలోనే వ్యాసులవారు శంకరులతో భాష్యవాదంచేసి, మెచ్చుకొని వారికి మరొక 16 ఏళ్ళు ఆయుర్దానం చేసి, 'భాష్యాలువ్రాసినంత మాత్రాన ప్రయోజనం లేదు. పండితులతో చర్చచేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థిరీకరణ చేయడానికి, దేశమంతటా సిద్ధాంతం వ్యాపింపచేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. ఆ కథ అట్లుండనీయండి.

శంకరులు కాశిలో వున్నపుడు గంగలో స్నానం చేస్తున్నారు. గంగకు అవలి తీరంలో పద్మపాదులు ధౌతవస్త్రాలను ఎండపెడుతున్నారు. పద్మపాదుల గురుభక్తిని లోకానికి చాటుటకు శంకరులు ఎండిన మడి బట్టలను తెమ్మన్నారు. మధ్యలో నది వున్నదన్న సంగతికూడా సనందనుడు మరచిపోయాడు.

నీళ్ళలో నడుస్తూంటే గంగాదేవి ఆయన మునగకుండా పాదముల క్రింద తామర పుష్పములను ప్రభవింపచేసింది. తాను నడుస్తుంటే తన పాదములక్రింద పద్మములు విచిత్రంగా వస్తున్నవన్న గమనమూలేదు ఆయనకు. శంకరులు నీవు గంగను ఎట్లా దాటావు? అని అడిగేంతవఱకు ఆయనకు దేహస్ఫురణ లేదు.

'మీ స్మరణ మాత్రాన ఈ సంసారార్ణవం జానుధగ్నమౌతుంది. (మోకాలిలోతు) గంగను తరించటం ఒక లెక్కయా? అని సనందనుడు బదులు చెప్పారట. అప్పటినుంచీ వారికి పద్మపాదులన్న పేరు స్థిరమయింది. ఈశ్వరావతారమైన భగవత్పాదులవారి శిష్యుడు పద్మపాదులవటం సమంజసంగానే వుంది.

14. రామానుజ సంప్రదాయంలో

రామానుజ సాంప్రదాయంలో పరస్పరం మర్యాద చేసుకోవటంలో చాల శ్రద్ధ వహిస్తారు. మనం నీవు-మీరు-అని వ్యవహారంలో చెప్పుకొంటే-వారు దేవరీర్‌ (తమిళం) అన్నపదం వాడుతారు. తమను 'దాసులు' అని చెప్పుకొంటారు. ఇతర సాంప్రదాయస్థులను 'స్వామి' అని పిలుస్తారు. వైష్ణవులలో వృద్ధులను 'పెరుమాళ్‌' అని వ్యవహరిస్తారు. వారి మర్యాద ఒక్కొక్కపుడు విపరీత ప్రమాణంలో వుంటుంది.

ఈ విషయంలో చెప్పుకొనే కథ తమాషాగా వుంటుంది. ఒక మఠాధిపతి క్రింద శిష్యుడొకడు వుండేవాడు. గురువు స్థానంలో తాను రావాలని అతనికి ఆశ. గురువు కోసం అతడొక గోతిని త్రవ్వినాడు. గురువు దగ్గరకు వెళ్లి ''దేవతలైన తాము (దేవరీర్‌) స్వయంగా గోతిలో దూకుతారా? లేక ఈ దాసుణ్ణి ఆ కైంకర్యం చేయమంటారా? అని మర్యాదతో అడిగాడట!

వైష్ణవాలయాలలో ఆళ్వారుల సన్నిధులుంటవి. అందులో ఆండాళ్‌ సన్నిధి విశేషమైనది. తెంగలశాఖకు చెందిన ఆలయాలలో మనవాళముని. పిళ్ళైలోకాచార్యుల సన్నిధులు వుంటవి. వడగలైశాఖకు చెందిన ఆలయాలలో వేదాంత దేశికుల సన్నిధి వుంటుంది. రామానుజులు శ్రీ పెరంబదూరులో జన్మించారు. ఆ క్షేత్రంలో రామానుజులకే ప్రాధాన్యం. పెరుమాళ్ళకు రెండవ స్థానమే. అచట రామానుజులకు పదిరోజుల ఉత్సవం చేస్తారు. రోజూ ఆరాధన, ఆయన సన్నిధిమీద బంగారు విమానం కట్టారు.

శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళుకు ప్రముఖస్థానం. ఆమెను గోదాదేవి అని అంటారు. మధురలో మీనాక్షికే ప్రాధాన్యం. సుందరేశ్వరునికి ద్వితీయస్థానం. నమ్మాళ్వారు జన్మస్థలం కురుకూరు. ఆయన గౌరవార్ధం దానిని ఇపుడు 'ఆళ్వార్‌ తిరునగరి' అని పిలుస్తున్నారు. ఆయనకూ విశేష ఉత్సవాలు చేస్తుంటారు. వైష్ణవ సాంప్రదాయాచార్యులలో నాదముని, ఆళవిందార్‌, మనక్కాల్‌ నంబి, తిరుక్కాచ్చినంబి, కూరత్తాళ్వార్‌, భట్టర్‌, నాచ్చియార్‌ ముఖ్యులు. ఆలయాలలో వీరి సన్నిధులలో పూజలు, ఉత్సవములు జరుగుతూ ఉంటాయి. శివాలయాలలో నాయన్మారులకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదు.

ఇంతకూ చెప్పవచ్చినదేమంటే వైష్ణవ సాంప్రదాయంలో ఆచార్యభక్తి అధికమని, రామానుజుల శిష్యులు వారికి అతివేలంగా భక్తిని నెరపేవారు. ఆయనకోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనుదీసేవారు కాదు. అట్టివారిలో కూరత్తాళ్వార్‌ ఒకరు. వారి గ్రామం కంచికి సమీపంలో వున్న 'కూరం'.

రామానుజుల కాలంలో వున్న చోళరాజు పరమశైవుడు. రామానుజులు విష్ణ్వాధిక్యమును బోధించే ఆచార్యులు చోళుల రాజధాని గంగైకొండచోళపురం. రామానుజులు శ్రీరంగంలో వున్నారు. రాజు రామానుజులను తమ సిద్ధాంతాన్ని గూర్చి చర్చ చేయడానికి ఆహ్వానించారు. కూరత్తాళ్వారుకు పరమశైవుడైన చోళరాజు తన గురువుకు ఏమి అపకారం చేస్తాడో అని భయం వేసింది. అందులో ఆ కాలపు రాజులు నిరంకుశులు.

కూరత్తాళ్వార్‌ రామానుజుల వేషంలో రాజువద్దకు వెళ్ళాలని నిశ్చయించారు. రామానుజులు ధరించే కాషాయాలను శిష్యుడు ధరించాడు. రామానుజులు శ్వేత వస్త్రధారియై కర్ణాటక దేశంలోని తిరునాయణపురం వెళ్ళారు. ఈ సంభవాన్ని స్మరిస్తూ ఇప్పటికీ, 'వెళ్ళైచ్చాత్తుపడి' (తెల్లని వస్త్రములు ధరించుట) అనే ఉత్సవం చేస్తారు.

చోళరాజు సమక్షంలో కూరత్తాళ్వార్‌ శివాధిక్యాన్ని ఒప్పుకోలేదు. రాజు ఉగ్రుడై కూరత్తాళ్వార్‌ కండ్లను పీకించాడు. కూరత్తాళ్వార్‌ సంతోషంగా శిక్షను అనుభవించాడు. చోళరాజు మరణానంతరం రామానుజులు తమిళ##దేశానికి మరలివచ్చారు. శిష్యుని దురవస్థకు ఎంతో చింతించారు. రామానుజులు మొదట కంచిలో వరదరాజస్వామిని సేవించేవారు. శ్రీరంగంలో వున్నపుడు రంగనాథస్వామిని సేవించారు. కానీ వరదరాజులంటే వారికి విశాషానురాగం. 'నీవు నీదృష్టికోసం వరదరాజును ప్రార్థించు' అని కూరత్తాళ్వర్తో చెప్పారు. కూరత్తాళ్వార్‌'' భగవద్దర్శనం కావాలంటే ఇంద్రియాలు నిగ్రహించాలి. రాజు పుణ్యమా అని కండ్లుపోయి, పంచేంద్రియాలలో ఒక ఇంద్రియ నిగ్రహం స్వతఃసిద్ధమైనది. దృష్టి మరల వస్తే ఈ ప్రపంచంలో చూడటానికి ఏముంది? కానీ మీ ఆజ్ఞను జవదాటరాదు. అందుచేత మీరు చెప్పినట్లుచేస్తాను. వరదరాజు నాకు మళ్లా కళ్లు ఇవ్వనీ. కానీ నాగురువులైన మిమ్ములనూ, వరదుణ్ణి మాత్రం చూడగలిగితే చాలు. ఆ కండ్లకు ఇతర విషయాలు గోచరం కారాదు'' అని అన్నాడట. ఆయన కోరినట్లే వరదరాజు వరదానం చేసాడు.

రామానుజులకు పూర్వమున్నవారు ఆళవందార్‌. వారికి కర్మశేషమున్నందువలన పరమపదప్రాప్తికి ఆలస్యమైంది. ఆకర్మ శేషాన్ని తాను అనుభవిస్తానని ఒక శిష్యుడు ప్రార్ధించాడు. ఆళవందారు తరపున అతడు రాచపుండుతో బాధపడి గురువు యొక్క కర్మ శేషాన్ని తొలగించాడు.

ఈ గురు పరంపర కథలలో ఒకటి - కొంచెం హాస్యంగానే వుంటుంది.

రామానుజులకు వడుకనంబి అనే శిష్యుడొకడు వుండేవాడు. ఇంట్లో అతడు గురువు కోసం పాలను వేడి చేస్తూ వున్నాడు. వీధిలో రంగనాథస్వామి ఉత్సవమూర్తి కోలాహలంగా వెడుతూ వుంది. 'స్వామిని దర్శించు' అని రామానుజులు శిష్యుని కేకవేశారు. శిష్యుడు వినిపించుకేలేదు. రామానుజులు శిష్యుణ్ణి దర్శనం ఎందుకు చేయలేదని మందలించారు. శిష్యుడన్నాడట; ''మీ పెరుమాళ్ళుకు చేస్తున్న ఈ క్షీరసేవ మధ్యలో వదలి వెళ్ళడం భావ్యమా?''

గురుభక్తి వుండే శిష్యుడు గురుసేవలో సంతోషంగా, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు. పరశురాముడు క్షత్రియులకు విరోధి. కర్ణుడు అతని వద్దకు ధనుర్వేదం నేర్చుకోవాలని బ్రాహ్మణ వేషంలో వస్తాడు. పరశురాముడు ఒకరోజు కర్ణుని తొడపై తల పెట్టుకొని నిద్ర పోతూ వుండగా ఒక కీటకం కర్ణుని తొడకింద చేరి తొలచనారంభించింది. గురువుకు నిద్రభంగ మౌతుందని కర్ణుడు కదలక మెదలక కూర్చున్నాడు. అమితంగా రక్తస్రావమైనది. పరశురాముడు నిద్రనుండి లేచి, కర్ణుడు బ్రాహ్మణవేషధారికానీ, బ్రాహ్మణుడు కాదని తెలుసుకొంటాడు. మిగతా కథ మీకు తెలుసు. ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బొటనవ్రేలిని సంతోషంగా ఇచ్చి తాను నేర్చుకొన్న ధనుర్విద్య అంతా వ్యర్ధం చేసుకొంటాడు.

ఆళ్వారులలో మధుర కవి ఒకడు. ఆయన 11 పాశురములు వ్రాశాడు. వానిని నాలాయిర ప్రబంధంలో చేర్చారు. (నాలుగువేల స్తోత్రములు కల గ్రంథము). పాశురములు విష్ణుపరంగా వున్ననూ, మధురకవి వ్రాసిన పాశురములు నమ్మాళ్వారు గూర్చి చేసిన స్తోత్రములు, నమ్మాళ్వారుకు 'ప్రపన్న జనకూటస్థుడు' అన్న బిరుదు వుండేది.

మధురకవి బ్రాహ్మణుడు. నమ్మాళ్వారు బ్రాహ్మణతరుడు. మధురకవి ఉత్తరదేశంలో పర్యటిస్తున్నపుడు, దక్షిణభాగం నుంచి ప్రసరిస్తున్న ఒక కాంతికిరణాన్ని చూచాడు. ఆ వెలుగును అనుసంధానంచేస్తూ వేయిమైళ్ళు ఆయన దక్షిణదిశకు మళ్ళీ ప్రయాణం చేశాడు. తిరుక్కరుకురై (ఆళ్వార్‌ తిరునగరి) చేరి అక్కడ ఒక్కగుహలో నుంచి కిరణం వెలువడుతున్నదని కనిపెట్టాడు. మధురకవి వెళ్ళిచూడగా ఆ గుహలో నమ్మాళ్వారు ధ్యాననిష్ఠలో వున్నారు.

ధ్యానానంతరము, మధురకవి సంజ్ఞల మూలంగా నమ్మాళ్వారును ఆత్మతత్త్వ విషయములను గూర్చి అడిగాడు. నమ్మాళ్వారు కూడా సైగలతోనే సమాధానమిచ్చారు. అదే మధురకవికి మంత్రోపదేశ##మైనట్లు అయినది. ''నమ్మాళ్వార్‌ పెరుమాళ్ళను గూర్చి స్తోత్రం చేస్తా''నని పదకొండు పాశురాలు వ్రాశారు. ఈ గురుభక్తి చాటే మధురకవి పాశురములను, పెరుమాళ్ళ స్తోత్ర గ్రంథమయిన ''నాలాయిరము''లో చేర్చినారు. రామానుజులను తప్పించి వేరే దేవుడు తనకు లేరని వేదాంత దేశికులూ తమ గురుభక్తిని వ్యక్తం చేశారు.

15. శిక్కులలో గురుభక్తి

ఆచార్యుడు ఉన్నచో దైవం వేరే అక్కరలేదు. దేవుడుకూడ గురునికి సమానుడు కాదు అని దాదాపు అన్ని సంప్రదాయములూ చెబుతాయి. శిక్కులు, గురువు ఉంటే శిష్యుడు ఉండాలనీ, శిష్యుడున్నప్పుడు శిక్ష వుండాలనీ అభిప్రాయపడుతారు.

గురుగోవిందసింగ్‌ ఖాల్సాను స్థాపించినపుడు నరబలినీయడానికి సభ్యులలో ఒకరిని ముందుకు రమ్మని అర్ధించారు. శిష్యుడొకడు ముందుకు వచ్చాడు. వానిని లోనికి తీసుకుపోయి, కొంతసేపటికి, రక్తసిక్తమైన కత్తితో బయటకు వచ్చి మరొకనిని రమ్మన్నారు. ఈ విధంగా ఐదుగురుని లోనికి తీసుకొని వెళ్ళి ఐదుమార్లు రక్తసిక్తమైన హస్తాలతో గురుగోవిందుడు బయటకు వచ్చాడు. పిదప ఆ ఐదుగురునీ బయటపెట్టి, మీ భక్తిని పరీక్షించడానికే ఈ పన్నాగం అని వివరించారు. నిజంగా ఆ ఐదుగురుని ఆయన చంపలేదు. ఆ రక్తం ఏదో గొఱ్ఱ రక్తం. ప్రాణత్యాగానికి సమ్మతించిన ఆ ఐదుగురినీ ఖాల్సాలో ముఖ్యసభ్యులుగా ఎన్నుకొన్నాడు.

గురుభక్తి సంపూర్ణంగా వున్న శిష్యుని గురుని లక్షణములు స్వయంగా వరిస్తాయి. శిష్యులు మహాత్ములై స్వయముగా గురువులైన తర్వాత కూడా శిష్యరికం భజిస్తూ వారి గురువులను ఆరాధించడం మన సంప్రదాయం.

16. గురువు, ఆచార్యుడు

గురువు, ఆచార్యుడు అనేవి ఒక ఉత్తమ స్థితిలో ఉన్నవారిని ఉద్దేశించి చెప్పే పదములు. యజ్ఞ హూమాదులు చేసేవారినీ, మంత్ర దీక్షనిచ్చే వారినీ ఆచార్యులని అంటాం. గానకళ, నృత్యకళల్లాంటి కళలు చెప్పేవారిని గురువులని వ్యవహరించగమూ కద్దు. తమిళ##దేశంలో వాద్యార్‌ అనే పదమొకటి వాడుతారు. సాధారణంగా బళ్ళలో చదువుచెప్పేవారినీ, ఇండ్లలో పూజలు, శ్రాద్ధాదికములు చేసిపెట్టేవారిని ఈ పేరుతో పిలుస్తారు. ఈ వాద్యార్‌ అనేపదం, సంస్కృతంలోని ఉపాధ్యాయ అనేపదంనుండి పుట్టినది. తమిళంలో 'ఆశిరియర్‌' అన్న పదం ఒకటి వున్నది. అది ఆచార్య పదోద్భవం, కథాశిరియర్‌ అని వాడుకలో వున్నది.

అధ్యాయం అన్నపదం, ఒక పుప్తకంలోని విభాగాన్ని సూచించేది. ప్రథమాధ్యాయం, ద్వితియాధ్యాయ-అనిగ్రంథ విభాగాలను సూచిస్తారు. ఇవన్నీ ఈ మధ్య వచ్చినవి. అధ్యయనం, అధ్యాయం, అధ్యాయం అనే పదాలు వేదాధ్యయనాన్ని సూచించే పదాలు. జీవితంలో అన్ని ముఖ్య విషయాలూ వేదసంబంధమైనవి. ఒక పుస్తకాన్ని చిన్న భాగాలుగా విభాగించినపుడు వానిని కాండము, ఖండము, సర్గము, పటలము, పర్వము, పరిచ్ఛేదము, ఉచ్ఛ్వాసము, ఉల్లాసము, అంగము, ప్రకరణము, స్కందము అని ఎన్నో పేళ్ళతో పిలుస్తారు.

మనం పాఠం అనే పదాన్ని వాడుతూంటాం. పాఠాలు చెప్పేచోటు పాఠశాల. ఈ పాఠమనేదీ వైదికమే. కానీ వేదాలన్నీ అబద్ధాలని చెప్పే బడి కూడా నేడు పాఠశాలయే. నాస్తిక్యమునకు ఒక బడి స్థాపిస్తే అదీ పాఠశాలయే. బ్రహ్మయజ్ఞమే పాఠం. వేదములను అధ్యయనం చేయడమే పాఠం.

వేదములు వల్లించేవాడు పాఠి. వేదాలను పఠించే ఒక మార్గాన్ని ఘనం అని అంటారు. ఆ ఘనాన్ని వల్లెవేసేవాడు ఘనాపాఠి. వేదములు కలసి చదువుకొనేవాడు సహపాఠి. ఈ పదాలన్నీ వేద సంప్రదాయంనుంచి పుట్టినవే.

17. ఉపాధ్యాయుడు, ఆచార్యుడు

అధ్యాయాన్ని చెప్పేవాడు అధ్యాపకుడు. వేదములను బోధించడం అధ్యాపనం, నేర్చుకొనేది అధ్యయనం. ఉపాధ్యాయుడు అధ్యాపకునికి సహకారి-అసిస్టెంట్‌. అతనిని తక్కువ స్థానం. స్మృతుల ప్రకారం రెండు రకాలైన వేదబోధకులున్నారు. ఒకడు ఆచార్యుడు. ఒకడు ఉపాధ్యాయుడు. ఈ భేదాన్ని మనుస్మృతి చెబుతున్నది.

జీవనోపాధికోసం ఆచార్యుడు వేదాధ్యాపనం చేయటంలేదు. తాను నేర్చుకొన్న విద్య నలుగురికి చెప్పి వేదాధ్యయనం అవిచ్చిన్నంగా జరగాలని అతడు గురుకులం స్థాసిస్తున్నాడు. శిష్యుడు అధ్యయనం పూర్తి అయిన పిదప దక్షిణ విషయం ఎత్తితే అప్పుడు గురువు ఏదైనా అడగవచ్చును. సాధారణంగా అధ్యయనానికి పండ్రెండు ఏళ్ళు పట్టుతుంది. సత్పాత్రులకు విద్యా దానం చేయటమే అతని వ్రతం. గురుకుల వాసంలో వున్నంతవఱకు శిష్యుని శీలమునకు నియమ జీవనమునకూ గురువు బాధ్యత వహించేవాడు.

ఒకప్పుడు మనదేశంలో ఇలాంటి గురుకుల వాసములుండినవన్న విషయమే గర్వకారణంగా వున్నది. ఆచార్యులమని పేరు పెట్టుకొన్న మేము ఈ విషయం గురించి చెప్పటం, ఇలాంటి గురుకుల వాస విధానం పూర్తిగా నశించరాదనియే.

18. జీవనోపాధికోసం వేదాధ్యాపనం

జీవనోపాధికోసం వేదాధ్యాసనం చేసే వానిని ఉపాధ్యాయుడని మనుస్మృతి పేర్కొంటున్నది. డబ్బు తీసుకొని వేదవిద్య చెప్పేవాడు భృతక అధ్యాపకుడు. వేదభాగాన్ని ఒకటి చెప్పి ప్రతిఫలంగా అతడు వేతనం తీసుకొంటున్నాడు.

ఏకదేశం తు వేదస్య వేదాంగాన్యసి వా పునః

యోధ్యాపయతి వృత్త్యర్థం ఉపాధ్యాయస్స ఉచ్యతే

పూర్వకాలంలో వేతనాన్ని ఉద్దేశించి అధ్యాపన చేసేవారు చాల తక్కువ. గురుకుల వాసములు డబ్బు ప్రసక్తి లేకుండా ఉత్తమ ఆచార్యులచే నడపబడేది. ఐతే కూలికి చెప్పే అధ్యాపనం గూర్చి కూడా ధర్మశాస్త్రములు చెప్పటం చూస్తున్నాం.

గురువు, ఆచార్యుడు, ఉపాద్యాయుడు-ఈ పదములను ధర్మశాస్త్రములు నిర్వచించినవి.

బ్రహ్మోపదేశం మొదలు వేదాంతపర్యంతము చదువుచెప్పేవాడు గురువు. ఆచార్యుడు బ్రహ్మోపదేశం చేయక, శాస్త్రములను మాత్రం నేర్పేవాడు. ఒక ఉదాహరణ. గర్గాచార్యులు కృష్ణునికి ఉపనయనం చేసారు. ఆయన విద్యభ్యాసం సాందీపునివద్ద జరిగింది. ధర్మశాస్త్రములు, ఏ భాషలోనైనా ఉపదేశమిచ్చేవాడు గురువనీ, శాస్త్రములు నేర్పేవాడు ఆచార్యుడనీ చెప్పుతున్నవి.

ఒక సాంప్రదాయానికీ, పద్దతికీ చెందినవాడు ఆచార్యుడు. అతడొక సిద్ధాంతాన్ని సమగ్రంగా బోధిస్తున్నాడు. ఉదాహరణ-శంకర భగవత్పాదులు. ఏ సంప్రదాయానికీ చెందనివారు గురువు. ఉదాహరణ - దత్తాత్రేయుడు. అందుకే ఆయనను దత్తగురువని అంటారు. దత్తాచార్యుడని అనటంలేదు. ఒక సిద్ధాంతాన్ని బోధిస్తూ గురువువలె అనుగ్రహశక్తి వున్న భగవత్పాదులను-శంకరాచార్యులు, శంకర గురువు-అని వ్యవహరిస్తారు. మనుస్మృతిలో ఆచార్య లక్షణములు గురువుకు కూడా చెప్పబడినవి.

ఉపనీయతు య: శిష్యం వేదం అధ్యాపయేత్‌ ద్విజ:

సకల్పం సరహస్యం చ తం ఆచార్యం ప్రచక్షతే

పరబ్రహ్మకు రూపంలేదు. గుణంలేదు. రూపం గుణం వుంటేకానీ మనస్సు ధ్యానించలేదు. అందుచే పరబ్రహ్మ గురుమూర్తి రూపంలో నయన గోచరమై మనలను అనుగ్రహిస్తున్నాడు. గు అంటే గుణములు. రు అంటే రూపం. గురువంటే గుణరూపములతో మనలను అనుగ్రహించే పరబ్రహ్మము.

పూర్వం, బ్రహ్మోపదేశము మొదలు శాస్త్రపర్యంతం పుత్రునికి తండ్రియే ఉపదేశిపస్తున్నందువల్ల అతనిని గురువనేవారు. రామాణంలో, కావ్యములలో తండ్రిని గురువు అనే వ్యవహరించినారు. కొన్ని విద్యలు కొన్ని కుటుంబములకే పరిమితమై ఉండేవి. తండ్రికి తెలియని విద్యలు నేర్చుకోడానికి ఇతరులను ఆశ్రయించేవారు. ఆ కారణంగా తండ్రికాక గురువు బ్రహ్మూపదేశ చేయడం విద్యాభ్యాసం గురుకులాలలో జరగడం ఏర్పడింది.

తండ్రికి అన్ని శాస్త్రములు తెలిసినా, కుమారుడు ఇంట్లో వుంటే సరిగా చదువుకోడేమో అనీ, గురుకులవాసంలో ఒక నియమజీవనమూ శాస్త్రాభ్యాసమూ వీలౌతుందనీ గురుకులవాసమునకు పంపేవారు. విద్యార్ధి అన్న భిక్షకై వెళ్ళి సాధారణ జీవితం గడిపేవాడు. అలాంటపుడు గురువే బ్రహ్మోపదేశమూ చేసేవాడు.

ఈ కాలంలో తల్లి తండ్రులకు పిల్లల చదువుగూర్చికానీ శీలం గూర్చి కానీ చింతలేదు. వారికి డబ్బే ప్రధానం. ఏ చదువు చదివినా, ఏ దేశంపోయినా అభ్యంతరం లేదు. కుమారుడు పుష్కలంగా ధనార్జన చేయాలి. వారి లక్ష్యమంతా అదే. తండ్రులు పిల్లలను చదువుకోసం విదేశాలకు పంపకపోతే పిల్లలు స్వయంగా తామే పోతారు. విదేశాలకు పోయి ధనార్జన చేసేటపుడు ఈ తలితండ్రులకు ఒక్క పైసాకూడా ఆ కుమారుడు పంపకపోవచ్చును. ఇది ఈనాటి విద్య విధానం.

19. తల్లితండ్రుల గొప్పతనం

ఒక ఆచార్యుడు పదిమంది ఉపాధ్యాయులకంటే గొప్ప. నూరుగురు ఆచార్యులకంటే తండ్రి గొప్ప అని మనుస్మృతి చెప్పుతున్నది. తల్లికి ఇంకా విశిష్టస్థానము. తల్లి వేయిమంది తండ్రుల కన్నా గొప్ప!

యాజ్ఞవల్క్యమహర్షి కాలంలో ఉపనయనం, తండ్రియైనా, సోదరుడైనా చేసేవారు. వీరిద్దరూ లేకపోతే ఇతరులు. లేకపోతే అంటే తండ్రీ, సోదరుడూ మృతులై నారని కాదు అర్థం. వీరికి తగిన యోగ్యత లేకపోతే ఉపనయనం ఇతరులు చేసేవారు. తండ్రిగానీ సోదరుడుగానీ వేదములలో ఒక శాఖనైనా అధ్యయనం చేసి ఉండాలి. అధ్యాపనము చేసి ఉండాలి. బ్రాహ్మణునికి అనుచితములైన వృత్తులలో వాళ్ళు ఉండరాదు. ఈ ప్రమాణాన్ని బట్టి ఈ కాలంలో ఏ తండ్రికీ తన పుత్రునికి ఉపనయనం చేసే యోగ్యతలేదు.

కొన్ని స్మృతులలో పెద్దలకూ,పూజ్యులకూ, గురువనే అభిదానమున్నట్లు చెప్పబడినది. తండ్రి, తాత, సోదరుడు, తండ్రి, తల్లియొక్క సోదరులు, చెల్లెండ్రమామగారు, రాజు, విద్యావంతులు శీలపరులు ఐన బ్రాహ్మణులు-తల్లి, ఆచార్యపత్ని, మేనత్తలు, పిన్నమ్మలు, జ్యేష్ఠసోదరి-అందరూ గురువులే. ఇంతమందీ గురువులైనా ఆచార్యునికొక విశిష్ఠస్థానము, విద్యాదానము చేయుటచేత అతడు పితృసమానుడు. అతనికి గౌరవమధికము. గురువుకు సంబంధించినదే గౌరవము.

ధర్మ శాస్త్రములూ, ఆత్మ విద్యచేప్పేవాడేకాదు గురువు. ఏ విద్యచెప్పినా అతడు గురువే అని మనువు అంటున్నాడు. ఇక సద్విద్య బోధించే గురువుయొక్క మహత్త్వమెట్లు చెప్పుట అని ఆయన ఆశ్చర్య చకితుడౌతున్నాడు.

20. వృద్దాః శిష్యాః గురుర్యువా

ఆచార్యుడు వయస్సులో చిన్నవాడైనా అతనిని పెద్దవానిగా చూడాలని ధర్మశాస్త్రముల నిర్దేశము. అందుచే అతడు గురువు. మనకంటే వయస్సులో చిన్నవారి వద్ద మనం శాస్త్ర పఠనం చేయడంలో నిషేధమేమీలేదు. జ్ఞానానికి ఆత్మోపలబ్ధికి వయస్సు అడ్డురారాదు. ఇందులకు ఉపష్టంభకముగా మనువు ఒక కథ చెబుతున్నాడు.

అంగీరస మహర్షి పుత్రుడు తన చిన్నాయనలకు ఆచార్యుడుగా ఉండేవాడు. విద్యాభ్యాసకాలంలో ఆయన వారిని 'వత్సలారా' అని సంబోధించాడట. పినతండ్రులు కోపగించుకొని దేవతలతో ఫిర్యాదు చేశారు.

దేవతలన్నారట; ''మీరు ఫిర్యాదు చేయటం సరికాదు. మీకు విద్య అంటే ఏమో తెలియదు. మీ అన్న కుమారుని వద్ద మీరు విద్యోపదేశం పొందుతున్నారంటే, మీరు పసివారు; అతడు వృద్ధుడు అని అర్ధం. వయస్సు ముదిరి వెంట్రుకలు తెల్లనైనందున ఒకడు వృద్ధుడు కాడు. వేద విజ్ఞానంకల వాడే వృద్ధుడు''.

చిక్కిశల్యావస్థలో ఉన్న వయోవృద్ధులు, యోగులు దక్షిణామూర్తి వద్ద ఆయన మౌన వ్యాఖ్య చేస్తుంటే తమ సంశచయములను పోగొట్టుకొంటున్నారట.

చిత్రం వటుతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా

గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్న స్శయాః

డబ్బున్న వానికి మనం గౌరవం ఇస్తాం. అత్తలు, మామలు, వదినలు మనకంటే చిన్న వారైనా వారికి వృద్ధులకిచ్చే గౌరవం ఇస్తాం. వయోవృద్ధులను గౌరవిస్తాం. వయస్సుతో నిమిత్తం లేక యజ్ఞయాగాదులు చేసిన వారిని పెద్దలని గౌరవిస్తాం. కట్టకడపట విద్వాంసుడు, వయోవృద్ధుడు కాకపోయినా, జ్ఞాన వృద్ధుడైనందున మనం గౌరవిస్తాం. ఈ కడపట చెప్పిన వానికి అతిశయ గౌరవం ఇవ్వాలని ధర్మశాస్త్రములు చెబుతున్నవి.

21. తల్లి, తండ్రి, ఆచార్యుడు

ఈ ముగ్గురూ ఈశ్వరాంశములగా మనం గౌరవించాలి. కొన్ని ధర్మశాస్త్రములు తలితండ్రులకంటే ఆచార్యునికి ఒక విశిష్ఠస్థానం ఏర్పరచినవి. మాతృభక్తి చేత ఇహలోకమునూ, పితృభక్తిచేత అంతరిక్షమునూ, ఆచార్యభక్తిచేత బ్రహ్మలోకమునూ పొందగలరని మనువు అంటున్నాడు. వీరియందు నెరిపే భక్తి ఎంత శ్రేష్ఠమో వీరియందు చేసే అగౌరవము అంత పాపకరము.

22. అధ్యాపకుడు

ఒక శిష్యుణ్ణి ఆచార్యుడు మూడు విధములుగా దిద్దగలడు. ఒకటి బోధ. రెండవది అనుగ్రహము. మూడవది మంత్రోపదేశము, వేద సంస్కారములు, అనుగ్రహం గూర్చి శాస్త్రములు ఏవీ చెప్పలేదు. మిగతా రెంటి విషయములలో రెండు అభిప్రాయములున్నవి. ఒకటి గురువు మంత్రోపదేశము చేసియు, వైదిక సంస్కారముల మూలముగనూ, శిష్యుని శుద్ధి చేసి, పూర్ణవిద్యలనిచ్చుట. రెండవది సంస్కారముల ప్రసక్తి లేక విద్యను మాత్రము బోధించుట.

ఆచార్యుడే సంస్కారములను చేసి విద్యాబోధనచేసి వేదాంతతత్పరునిగా చేయుటకూడా కద్దు. వీరిరువురూ అధ్యాపకులే. వేతనమును గ్రహించువానిని ఉపాధ్యాయుడని అంటారు.

23. ఉపాధ్యాయుడు

జీవనోపాధికై కాక విద్యాబోధనే లక్ష్యంగా ఉంచుకొన్న ఆచార్యుల సంఖ్య తగ్గుతూ రాగా ఉపాధ్యాయులు ఏర్పడ్డారు. ఉత్తర భారతంలో వేదాధ్యాపనం చేసేవారు, తమ్ము ఉపాధ్యాయులని పిలుచుకోవడం ప్రారంభించారు. అందులో న్యూనత ఉందని వారనుకోలేదు.

బెంగాలులో చటర్జీ, బెనర్జీ, ముఖర్జీలు ఉన్నారు. వారిలో కొందరు తమ్ము ముఖోపాధ్యాయులు, చతురోపాధ్యాయులు, వంద్యోపాధ్యాయులు (బంధోపాధ్యాయులు) అని వివరముగా వ్యవహరించుకుంటున్నారు. ముఖమంటే వేదం. వేదాలు ముఖంలోనుంచే వస్తవి. ముఖోపాధ్యాయ ముఖర్జీ అయినది. చతురోపాధ్యాయుడు చతుర్వేదములకు అధ్యాపకుడు. అతడు ఛటర్జీఐనాడు. రామకృష్ణపరమహంస ఛటోపాధ్యాయ వంశములో పుట్టినవారు. అతని భార్య శారదాదేవి ముఖోపాధ్యాయ వంశమునకు చెందిన వారు. వంద్యోపాధ్యాయుడు అంటే వందనీయుడైన ఉపాధ్యాయుడు. వంద్య బంద్యగా మారి బెనర్జీ ఐనది. ఈ నదాలకన్నిటికీ గౌరవార్థకమైన - జీ - తగిలింపబడినది.

ఉపాధ్యాయులు గౌరవనీయులు. బ్రిటిష్‌ ప్రభుత్వంలో గొప్ప పండితులకు 'మహామహోపాధ్యాయ' అనే బిరుదు ఉండేవి. వీరికి ఆచార్యులకుండవలసిన లక్షణములు, గుణములూ ఉండేవి. వారు గురుకులములను నడిపేవారు. కొందరు తమ స్వార్జితాన్నికూడా ఖర్చు చేసి ఈ గురుకులాలను నడిపినారు.

24. విద్యాదానమే ఈశ్వరార్చన

ప్రజలు జీవికకై ఎన్నో వృత్తులను అవలంబించుచున్నారు, ఆ వృత్తులు తప్పు అనియో తక్కువ అనియో వాళ్ళు అనుకోవడంలేదు. కానీ పూర్వం డబ్బు కోసం ఈశ్వరుని పూజా, కూలికి విద్యచెప్పడం చాల హీనంగా పరిగణించేవారు. దీనికి కారణం, ఆత్మతృప్తికి, అనందానికీ చేయవలసిన పనిని ఉదరపోషణార్ధం చేయటం సముచితం కాదనియే, అంటే వాళ్ళు విద్యాదానం భగవదారాధనక్రింద లెక్కకట్టేవారన్నమాట.

శాస్త్రములు ప్రతిఒక్కరూ తమ కులధర్మాన్ని పాటిస్తూ జాతికి విధించిన వృత్తితో ధనార్జన చేయాలని విధించినవి. బ్రాహ్మణుడు చేయవలసిన వృత్తి ఏది? తమిళంలో బ్రాహ్మణుని, 'ఆరుతొళిలర్‌' అని అంటారు. అతడు ఆరువిధాలైన వృత్తులు అవలంబించవచ్చునని అర్థం. బ్రాహ్మణుడు షట్కర్మ నిరతుడు. అవి ఏవి? ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం, ఇవికాక ఇతరవృత్తులలో అతడు కుశలత సంపాదించి వానిని ఇతరులకు నేర్పాలి.

అంటే బ్రాహ్మణుడు అన్ని వృత్తులను తెలిసికొని ఉండవలెనని కాదు. తన అధ్యాపక వృత్తికి భంగం లేకుండా, అనుష్ఠానాలకు నిరోధంకాక నాలుగైదు వృత్తులలో కౌశల్యం సంపాదించి ఇతరులకు వానిని నేర్పాలని భావం. బ్రాహ్మణులు, ఈ విధంగా ఉండిరని ఇతిహాసాలూ పురాణాలూ చెప్పుతున్నవి. బ్రాహ్మణులు, ఆయుర్వేదము, అర్ధశాస్త్రము, నాట్యశాస్త్రము, ధనుర్వేదము మొదలైనవానిని నేర్చి ఇతరులకు బోధించేవాళ్ళు.

ఆయా జాతులకు తగిన వృత్తిని నేర్పాలేకానీ ఆ వృత్తులను అతడు అవలంబించరాదు. ఆ విద్యను ధనార్జనకుకానీ, జీవనోపాయమునకు గానీ అతడు వినియోగించరాదు. శిష్యులిచ్చే దక్షిణతో అతడు తృప్తిపడాలి. అతని ధ్యేయం అధ్యాపకమేగాని ఆర్జన కాదు. అతని కులమునకు ఉచితమైన వృత్తి ఇతరులకు విద్యను బోధించుటే. అధీతిబోధాచరణలు, ఈశ్వరప్రణిధానము బ్రాహ్మణునకు విధించిన కర్మ.

కొందరు దీనిని తెలుసుకోకుండా బ్రాహ్మణులను నిందిస్తారు. ఆత్మార్థం, లోకసంగ్రహం కోసం బ్రాహ్మణునికి ఎన్నో విధులు అనుష్టానాలు అననుకూలాలూ ఉన్నాయి. కష్టాలూ, క్లేశాలు, లెక్కచేయక బ్రాహ్మణుడు లోక క్షేమార్థమే తన కాలాన్ని వినియోగించాలి.

25. ప్రతిగ్రహం

బ్రాహ్మణుడు ఆరువృత్తులు అవలంబించవచ్చునని చెప్పాం. రెంటిని అధ్యయనం అధ్యాపనం గూర్చి మనం చర్చించినాం. మిగతా నాలుగు యజ్ఞం, యాజనం, దానం ప్రతిగ్రహం. యజ్ఞం ఆత్మార్థం చేసుకొనేది. యాజనం ఇతరులకోసం చేసేవి. యజ్ఞం, దానంలో రాబడిలేదు. ఖర్చే, యాజనముల ప్రతిగ్రహనలో(తీసుకొనుట) రాబడి ఉన్నది. కానీ ఒక ముఖ్యవిషయం ఏమిటంటే యాజక ప్రతిగ్రహాల్లో, దాతయొక్క పాపాలు గ్రహీత అనుభవించవలసి వస్తుంది.

దానాలు తీసుకొనే పక్షంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికొక పెద్ద లిస్టు ఉన్నది. ఒక్కొక్కదానానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం ఉంది. బ్రాహ్మణులకు భీతి కలిగించేటందుకు కాదు ఈ విధిని ఏర్పరచినది. ఈ శాస్త్రములను వ్రాసినదీ బ్రాహ్మణులే. యాజనం కంటే యజ్ఞమే శ్రేష్ఠం. అది ఆత్మార్ధం చేసేది. దక్షిణకోసం కాదు. కానీ యాజనకూడా అతని విధియే. అందుమూలంగా వచ్చిన దక్షిణను అతడు పుణ్యకార్యాలకై వెచ్చించాలి.

కాబట్టి బ్రాహ్మణునికి ఆరు వృత్తులున్నా అందులో ఆదాయానికి ఆస్పదంలేదు. యాజన ప్రతిగ్రహాల్లో వచ్చే ధనం ధర్మకార్యాలకై వినియోగం చేయాలి. అధ్యాపనలో రాబడి ఉన్నా విద్యను దానం చేయాలే కానీ దాని మూలంగా ఆర్జన చేయరాదు. అట్లు చేస్తేనే అది ఈశ్వరార్చన ఔతుంది. ఆచార్యుడు అట్లా దక్షిణ తీసుకొన్నా శిష్యుడు తాను చెప్పిన విద్య పూర్తిగా గ్రహించినాడన్న నమ్మకము కలిగిన మీదటే దక్షిణ తీసుకొనేవారు.

జనకుడు యాఙవల్క్యునికి శిష్యుడు. ఒక్కొక్క ఉపదేశము పూర్తికాగానే జనకుడు గురువుకు దక్షిణలు ఇస్తున్నాడు. దక్షిణ ఇచ్చినపుడంతా, యాఙవల్క్యుడు దక్షిణను తిరిగి జనకునికే ఇచ్చేసేవాడు. ''నాతండ్రి అభిప్రాయం ఏమంటే ఉపదేశం పూర్తిగా ఇచ్చినపిదపే దక్షిణను గ్రహించాలి'', అని యాజ్ఞవల్క్యు డు జనకునితో చెప్పాడు. ఈ విషయం బృహదారణ్యక ఉపనిషత్తు-నాలుగవ అధ్యాయం మొదటి బ్రాహ్మణంలో చెప్పబడి యున్నది.

26. ఇతర దేశాలలో లేని వ్యవస్థ

ఇతరదేశాలలోనూ బోధకులు (టీచర్‌) ఉండవచ్చును. కాని మన గురు, ఆచార్య సంప్రదాయాలకూ వానికీ అజగజాంతరము. ఇతర దేశాలలో గురువును ఈశ్వరభావంలో చూచే పద్ధతిలేదు. అతడు ఈశ్వరుని ప్రతినిధి అన్న భావంలేదు. సర్వసంగపరిత్యాగం చేసి అతనివద్దకు వెళ్ళాలన్న నియమమూనేదు. 'అతడు చక్కగా బోధ చేస్తాడు. అతనికి అనేక విషయములు తెలుసు. ఆ విషయములను ఇతరులకు అందంగా చెప్పగలరు. అ దేశాలలో విదార్థికి దీనికి మించిన భావంలేదు. అ బోధకులూ తమ్ము ఆ విధంగానే భావించుకొంటూ తదనుసారం వుంటే చాలని నిలచిపోతారు.

మనదేశంలో అట్లాకాదు. గురు లక్షణములు ఉన్నతంగా ఉండాలి. అతనికి యోగ్యత ఆత్మానుభవం ఉండాలి. అతడి కుశాగ్రబుద్ధిగను, శాస్త్రసంపన్నుడుగానూ, విశేషజ్ఞుడుగాను ఉండవలసి ఉంటుంది. అంతేకాదు. తనకు తెలిసినదానిని ఇతరులకు తెలుపకలిగిన బోధనశక్తి, శీలసంపదా ఆచార అనుష్టానములూ కలిగి యుండవలెను.

అనగా ఆచార్యునికి మూడు లక్షణములుండవలెను. ఒకటి శాస్త్ర సిద్ధాంతములను అతడు చక్కగా తెలుసుకొని ఉండవలెను. 'అచినోతిహి శాస్త్రార్థం'. రెండు, తెలుసుకొని స్వయముగా ఆచరించవలెను. 'స్వయం ఆచరేత్‌', మూడవది, తాను తెలుసుకొని ఆచరిస్తున్న ఆచారములను ఇతరులచే అనుష్ఠింప చేయవలెను. 'ఆచారేస్థానయత్యసి'. ఒక శాస్త్రం చక్కగా తెలుసుకొన్నవాడు విద్వాంసుడు మాత్రమే. వానికి ఆచార్యస్థానం లేదు. జీవితం శాస్త్ర బద్ధంగా నడుపుకొన్నవాడే అనుష్ఠాత. మరొక్క మెట్టు దాటినాడంటే, అతడు అనుభవి ఔతాడు. అప్పటికీ అతడు ఆచార్యుడు కాలేడు. అతడు తాను నేర్పిన శాస్త్రములను ప్రచారంచేసి ఇతరులను అనుష్ఠంపచేస్తేనే ఆచార్యుడౌతాడు. అందుచేత ఆచార్యునికి అనుష్ఠానమూ, అనుభవమూ, ప్రచారకత్వమూ, మూడూ ఉండాలి.

మనం నేర్చుకొనే విద్య నిర్దుష్టంగా ఉండవలెను. మన జీవితమూ కూడా ఆ విద్యను అనుసరిస్తూ నిరవద్యముగా ఉండవలెను. అందుచే ఆచార్యుడు తాను నేర్చుకొన్న దానిని ఆచరించి ఇతరులచే ఆచరింపచేయవలెను. ఈ విధమైన ఆచార్యులు మన దేశంలో పూర్వం ఎంతోమంది ఉండేవారు.

''అర్ధసంపద లేని వానికి ఈ లోకం లేదు'' అని మహాత్ముడైన తిరువళ్ళువరే చెప్పారు. కానీ మనపూర్వాచార్యులు అర్ధాన్ని అర్ధించకుండా విద్యాదానం చేసేవారు. విద్యాభివృద్ధియే వారి ధ్యేయం; జీవిత లక్ష్యం. వారు స్వార్థత్యాగులు నిష్కాములుగా ఉండేవారు. ఇట్టి త్యాగమున్నందునే వారికి అసమానమైన ఆధ్యాత్మిక పంపత్తి ఉండేది. తైత్తిరీయం 'త్యాగినైకే అమృతత్వమానశుః'-అని అంటున్నది.

ఈ దేశంలో ఆచార్యునికి ఎనలేని గౌరవముండేది. అర్ధసంపత్తి లేకపోయినా చిత్తశుద్ధికల ఆచార్యుని ఎవరు గౌరవించరు? అతడు ఒక పర్ణశాలలో అవిరళవిద్యాదనం చేస్తూ తన జీవితాన్ని భవ్యంగా గడిపేవాడు. ''సర్వసంగపరిత్యాగం చేసి ఆచార్యుని అనుసరించు'' అని అంటే, అతనికి ఎంత విశిష్టత ఉండవలె? ఆచరణలేని శాస్త్ర కౌశల్యం మాత్రం ఉంటే చాలునా? అతని జీవితం అనవద్యంగానూ, ఆదర్శంగానూ ఉంటేగానీ, శిష్యునికి అతనిలో ఈశ్వరభావం రాదు. అట్టి ఆచార్యుడే - ఆచార్యదేవోభవ - దేవుడౌతాడు.

27. లౌకిక విద్యలలోనూ ఉత్తమ ఆచార్యులు

పై చెప్పబడిన ఆచార్య లక్షణాలు ఒక వైదిక ఆచార్యులకేకాక లౌకిక విద్యలను నేర్పే ఆచార్యుల జీవితంలోనూ ఉండేవి. విశేష శాస్త్రఙత, అత్యుత్తమ శీలసంపదా ఆ లౌకికాచార్యులకు ఉండేవి. వారికి ఆత్మానుభవం లేకపోవచ్చును. ఉత్తమ మానవులకుండవలసిన గుణసంపత్తి విస్తారంగా వారిలో ఉండేది. కొందరికి కోప స్వభావమూ, కొంచెము పక్షపాతమూ ఉన్నా, శిష్యులు వారిని విద్యా ప్రాప్తికొఱకు వెన్నంటేవారు. లేకుంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యులవద్దకు ఎందుకు వచ్చాడు? కర్ణుడెందుకు విలువిద్యకై పరశురాముణ్ణి ఆశ్రయించాడు.

నాట్యాన్ని నేర్పేవారిని నాట్యాచార్యులని పిలిచేవారు. వారికి విద్వత్తేకాక సౌశీల్యమూ ఉండేది. సంగీతంలో సింహంలాంటివాడు- ఉస్తాద్‌ తాన్‌ సెన్‌ - అక్బరు ఆస్థానంలో గాయకుడు. అతని గురువు హరిదాసస్వామి ఋషితుల్యుడు.

దక్షిణదేశంలో తిరువై యారులో ఒక గొప్ప సంగీతవిద్వాసుడుండేవాడు. ఆయనపేరు మహావైద్యనాధశివన్‌. ఆయన గొప్ప నైష్ఠికుడు. సంధ్య, శివపూజ ఒక్కరోజు వదలలేదు. ప్రయాణం చేసేటపుడు అతని దేవతార్చన పెట్టె సకాలంలో రాకపోతే ఉపవాసముండేవాడు. కచ్చేరీలు సాయంత్రం 3 నుంచీ 6 వఱకు చేసేవాడు. సాయం సంధ్యకొఱకు కచ్చేరీల సమయం నియమించుకున్నాడు. లేదా 6-30 గంటలకు పైగా కచ్చేరీ ప్రారంభించేవాడు.

అతని సోదరుడు రామస్వామి, వైద్యనాధన్‌ యొక్క ఆర్ధిక విషయములూ, కోర్టు విషయాలూ చూచుకొనేవాడు. ఆయన విద్వాంసుడు. అరువదిమూడు శైవనాయన్మారులపై - పెరియపురాణకీర్తనలను వ్రాశాడు. తన కుటుంబ విషయాలన్నీ రామస్వామికి అప్పగించి వైద్యనాధశివన్‌, కచ్చేరీలు, శివపూజ, గాయత్రీపురశ్చరణలో కాలం గడిపేవాడు. అతడు ఒక శిష్యపరంపర కావాలని కోరుకోకపోయినా, ఎప్పుడు ఇరవైమంది ఆయనను పరివేష్టించి ఉండేవారు. వారికి స్రత్యేకంగా ఈయన పాఠాలు చెప్పలేదు. ఆత్మార్ధం ఆయన పాడుకొనే పాటలు విని శిష్యులు ఘన విద్వాంసులయ్యారు. వీరంతా ఆయన ఇంట్లోనే ఉండేవారు. ఆయన వీరివద్ద గురుదక్షిణ ఏదీ తీసుకొన్నది లేదు.

నాట్యశాస్త్రం, గానకళ, ధనుర్వేదం ఇలాంటి శాస్త్రాలు చెప్పేవారినీ ఆచార్యులనే పిలిచేవారు. ఇక వేదవేదాంతాలను బోధించేవారిని ఏమనాలి? వారిని ఈశ్వరునికి ప్రతినిధులుగా శిష్యులు భావించారంటే ఆశ్చర్యమేమి?

28. సంఘగతంకాదు వ్యక్తిగతమే

మనదేశంలో విద్య ఒక మహూన్నతస్థితిలో ఉండినదంటే విద్య వ్యాపారం కాకపోవటం వలనే. విద్య వ్యక్తిగతంగా ఉండేది. వానికి సంఘాలూ, స్థాపనలూ లేవు. ఈ విధానం రెండు మూడు శతాబ్దముల క్రిందకూడా ఉండేది. ఈ కాలంలో కూడా గురుకు వాసంలాంటి విధానాన్ని ఒకరిద్దరూ అవలంబిస్తున్నారు.

బుద్ధునికాలంనుంచీ-నలంద, తక్షశిలా-విద్యాస్థానాలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడినవి. అంతకుముందు ఒక్క చోటులో అనేక శాస్త్రములు నేర్పబడుట అనేది ఎరుగని విషయం. గురుకులవాసాలు వ్యక్తిగతంగా ఉండేవి. వారికి సాహాయ్యకంగా ఒకరిద్దరు ఉప అధ్యాపకులు బహుశా ఉండేవారు.

29. కులపతి

కొన్ని గురుకులాలలో 64 కళలు నేర్పేవారు. ఆ కళలలో పరిశోధనలు చేసేవారు. ఆ పరిశోధనలలో ఇతర ఆచార్యుల సహాయం అర్థించేవారు. ఈ గురుకుల వాసములలో పెద్దశిష్యులు చిన్నవారిని గమనించేవారేమో, గురువును కులపతి అనేవారు.

కులపతి మున్షీ బొంబాయిలో ఉండేవారు. మద్రాసులో బాలకృష్ణజోషీ-ఈ ఇరువురినీ కులపతి అని పిలిచారు. కానీ పూర్వకాలం ఏ అర్థంలో కులపతి అని వ్యవహరిస్తుండినారో ఆ అర్థం వీరికి పొసగదు. కాలక్రమేణ విద్యావిషయంగా విశేషపరిశ్రమ చేసినవారిని కులపతి అని పిలిచే అలవాటు ఏర్నడింది. భారతీయ కళలు సంప్రదాయములను ప్రచారం చేయడానికి భారతీయ విద్యాభవన్‌ పాటుపడుతున్నది. బాలకృష్ణజోషి అధ్యాపకుడుగా థియసోఫికల్‌ బళ్ళో ఉండేవారు. ఆయన ప్రసిద్ధికెక్కిన ఉపాధ్యాయుడు. అందుచేత వీరిని కులపతి అని పిలుస్తున్నారు.

వశిష్టుని లాంటి గురువు ఒకరుఉంటే, విదార్థులై చాలమంది ఆయన వద్దకు వస్తారు. ఆయన వద్ద ఏ కొంచెం చదువుకున్నా నేను వశిష్ఠులవారి శిష్యుడిని అని చెప్పుకోవచ్చును. పూర్వం ఈలాగే విద్యాస్థానాలు ఏర్పడి ఉంటవి. శిష్యులు ఎక్కువయ్యేసరికి ఉపాధ్యాయులను నియమించవలసి వచ్చేది. ఆరంభములో ఒకటి రెండు పాఠాలు తామే చెప్పుతూ, పిదప శిష్యులు advance stage కు వచ్చేసరికి విస్తారంగా చెప్పేవారు.

పందొమ్మిదవ శతాబ్దంలో మన్నార్గుడి రాజుశాస్త్రి అనే ఆయన ఉండేవారు. వారు విద్యాపారంగతులు. ఆయనకు చాలమంది శిష్యులు. అంతమందీ ఆయన వద్ద విద్యాభ్యాసం చేయకపోయి ఉండవచ్చును. ప్రాథమిక తరగతులలో ఇతర ఉపాధ్యాయులు పాఠం చెప్పగా, పై తరగతులకు వచ్చేసరికి రాజు శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేసి ఉండవలెను.

రఘువంశం ప్రథమ సర్గంలో వశిష్ఠులవారిని కులపతి అని కాళిదాసు వర్ణించినాడు. శాకుంతలంలో కణ్వమహర్షిని కులపతిగా చెప్పాడు. తరువాత కాలంలో నాటకాలలో కులపతి అనే పదప్రయోగాలున్నాయి. పదివేల విద్యార్థులున్న గురుకులంలోని ఆచార్యుణ్ణి కులపతి అని అన్నారు. పదివేలు అంటే కొంచెం అధికమనిపిస్తుందేమో, కనీసం నూర్లకొది విద్యార్థులు ఈ గురుకులాలలో విద్యాభ్యాసం చేసి ఉండాలి. ఇంతమంది విద్యార్థులనూ దక్షిణ అపేక్షించకుండా తన గురుకులవాసంలో ఉంచుకొని ఆ కులపతులు విద్యాదానం చేసి సంరక్షించేవారు. కులపతికి నిర్వచనము - యో అన్నదానాది పోషణాత్‌ అధ్యాపయతి-అన్నదాన, పోషణలతో అధ్యాపకత్వం చేసేవాడు కులపతి. ఈ స్వార్థరహితమైన సత్కార్యాన్ని చూచి రాజులు వారికి విరాళాలు ఇచ్చేవారు. జీవనోపాధికోసం కులపతి విద్యాదానం చేసి ఎరుగరు.

మొత్తం మీద చాలమంది కులపతులు గురుకులవాసాలు నడిపినది లేదు. వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆచార్యుడూ గురుకులములనూ నడుపుతూ విద్యాదానం చేయడమే వాడుకలో ఎక్కువగా ఉండేది.

30. పూర్వకాల బోధనా విధాన అభివృద్ధి

వేదకాలమనే ఆదికాలంలో మనదేశంలో - మనదేశ##మే కాదు ప్రపంచములోనే మొట్టమొదట విద్యాభ్యాసం ఏ విధంగా ఆరంభించబడినది?

ఒక్కొక్క ఋషియూ తన సంతతికీ, తన స్నేహితుల సంతతికీ ఈశ్వరుడు తనకు అనుగ్రహించిన మంత్రములను విద్యలను ఉపదేశించేవాడు. విద్య అంటే ఈ కాలంలో మనం వ్యవహరించే ఆర్ట్సు సైన్సుకాదు. ఆరోజులలో ఒక్కొక్క ఉపాసనా మార్గమునూ వారు విద్య అనే చెప్పేవారు.

ఋషులు ధ్యాననిమగ్నులైనపుడు, వారి అంతఃకరణములు పరమాత్మలో లయించినపుడు, వారికి మంత్రములూ, తత్సంబంధములైన ఉపాసనలూ స్ఫురించేవి. యమధర్మరాజు నచికేతునికి ఉపదేశించాడు. సనత్కుమారుడు నారదునికి ఉపదేశం చేశాడు. ఒక మహాత్ముడు సత్పాత్రుడైన ఋషికో, విద్యార్థికో ఉపదేశం చేయడం మామూలు. స్వర్గలోక సంబంధమైన అగ్ని విద్యలను యముడు నచికేతునికి బోధించాడు. ఆ విద్య నచికేతుని పేర ప్రసిద్ధి పొందుతుందని కూడా యముడు నచికేతుణ్ణి అనుగ్రహించాడు.

ఇదేవిధంగా, ఏ శిష్యునికి ఒక విద్య బోధింపబడ్డతో అతని పేరిట కొన్ని విద్యలు ప్రసిద్ధి వహించినవి. ఉపనిషత్తులలో-సత్యకామవిద్య అని, ఉపకోసలవిద్య అనీ, మైత్రేయీ విద్య అనీ కొన్ని విద్యలు చెప్పబడినవి. ఇవన్నీ ఆ శిష్యుల పేర్లపై చెప్పబడినవిద్యలు. ఈ విద్యల పేళ్ళు, ఉపదేశించిన గురువునో, ఉపాసనామూర్తినో, తత్త్వమునో సూచించుటలేదు. ఒక విద్యను ఎంత శ్రద్ధాభక్తులతో గురువు వద్ద శిష్యుడు అధ్యయించినాడో ఈ విద్యలపేళ్ళే చెబుతున్నవి. శిష్యునికిస్తున్న విశిష్ఠస్థానమున్నూ సూచిస్తున్నవి.

అన్ని విద్యలూ బ్రహ్మవిద్యలో అంతమౌతున్నవి. బ్రహ్మవిద్మ అంటే ఉపనిషత్తులే. వేదాంతమే బ్రహ్మ తత్త్వాన్ని తెలిపేది. ఉపనిషత్తులలో పంచాగ్ని విద్య, మధువిద్య, వైశ్వానర విద్య, సంవర్గ విద్య, దహర విద్య, అంతర్యామి విద్య - అని ఎన్నో విద్యలు వివరింపబడినవి. కొన్ని విద్యలు కర్మపరములు. కొన్ని ధ్యానమార్గములు.

వేదములు అపౌరుషేయములు. అవి ఋషులకు మంత్రరూపముగనూ, సూక్తముల రూపముననూ స్ఫురించినవి. వీనిని ఆ ఋషులు తమ సంతతికీ, ఇతరులకూ ఉపదేశం చేశారు. ఆ ఋషుల వానస్థానములైన వర్ణకుటీరములను ఆశ్రమములని పిలిచేవారు. ఈ ఆశ్రమములే ఋషికులములు. ఈ ఋషికులములే మొట్టమొదటి విద్యాస్థానములు.

ఇట్లు ఆదికాలంలో విద్యాశాలలు కుటుంబపరములుగా ఉంటూ ఉండేవి. పిదప ఋషికులములకు మధ్యా సంబంధమేర్పడి విద్యాస్థానములు వ్యాపించసాగినవి. ఒక ఋషికులంలోని విద్యార్ధులు ఆ ఋషి చెప్పిన మంత్రములు సూక్తములను తెలుసుకోవటమేకాక ఇతర ఋషికులముల నుండి విద్యాగ్రహణ చేస్తూ విద్యాభివృద్ధిని చేసుకొనేవారు.

31. భాష శబ్దనియమానికే

ఒక విషయం ఇతరులకు చెప్పుటకు బాష ముఖ్యమైన ఉపకరణం. ఋగ్వేదం మనకు ఆది గ్రంధం. అందులో భాషారూపములు నిర్ణయించే వ్యాకరణము ఎంత చక్కగా నిర్ధారింపబడినదో చూచి పాశ్చాత్యులు ఆశ్చర్య చకితులౌతున్నారు. వ్యాకరణ విధులు మాత్రమేకాక మంత్ర స్వరూపములను కూడా విద్యార్థులు నేర్చుకునేవారు. ఒక్కొక్క అక్షరమున్నూ ఎట్లు ఉదాత్త అనుదాత్తస్వరములలో పలుకవలెనో చెప్పించేవారు. మంత్రములు ఋషులకు ఏ విధముగా అనుగ్రమింపబడినవో అదే విధముగా స్వరశుద్ధముగా శిష్యులకు నేర్పించేవారు. ఎన్నో యుగముల తర్వాత కూడా ఆ స్వరశుద్ధి నేటికీ ఉంటూ, అదేవిధంగా వేదాధ్యయనము ఈ రోజువఱకూ ఈ దేశంలో చేయబడుట అత్యంతముదావహం.

32. లిపి లేని బోధ

వ్రాత లేకుండా చదువు. ఈ కాలపు బళ్ళలో ఉండే బ్లాక్‌ బోర్డులూ, చాక్‌ పీసులూ, పలకలూ, బలపాలు, పెన్సిల్‌, పెన్‌, నోటుబుక్కులు ఆ కాలంలో లేవు. విద్యరంభ సమయంలో అక్షరాభ్యాసం చేస్తున్నాము. రెండువేల ఏళ్ళక్రితమున్న అవ్వైయార్‌, వళ్ళువరూ, వ్రాత చదువులో ముఖ్యాంగమనీ, సంఖ్యలు, అక్షరములూ విద్యకు రెండుకళ్ళు అనీ చెప్పారు. వేదకాలంలోనూ, తర్వాత కొన్ని శతాబ్దముల కాలమూ, చదువు వాఙ్మూనకంగానే జరిగేది. విద్యార్థి చెవులతో విషయాన్ని విని నోటితో చెప్పేవాడు. వేదమంత్రములు శృతులు. అవి విని నేర్చుకొనేవి. వానిని వ్రాయరాదు. ఆ దివ్యనాదం లోకంలో ప్రతిశబ్దించి లోకక్షేమాన్ని ప్రసాదించాలి.

ఈ వేద రక్షణకు ఒక వర్గం నిర్దేశింపబడింది. వారు ఏ వృత్తులనూ అవలంబించరాదు. వాళ్ళ వృత్తి వేదాధ్యయనమూ, వేదాధ్యాపనమూ. లిపిలో స్వరములను సరిగా చూపనలేము. ఉదాత్త అనుదాత్తములకు చిహ్నమును ముద్రించినా, అందులో ఏవైనా తప్పులుంటే మంత్రభంగం ఏర్పడుతుంది. అట్టి అవకాశ##మే ఏర్పడితే అది అనర్ధమే.

వేదములను అలిఖతములుగా ఉంచడానికి మరోకారణం ఉన్నది. మంత్రములను అప్పుడప్పుడూ చదివితే మంత్రములు మనస్సులో పూర్తిగా వ్యాపించక, పైపైన ఉంటూ పూర్ణ ప్రయోజనము ఇవ్వలేకపోతాయి. మంత్రోచ్ఛారణ చేసేటపుడు ఆ శబ్దం ప్రాణశక్తితో మేళవిస్తేనే మంత్రం ఫలవంతమౌతుంది. పుస్తకాలలో వేదాలుంటే ఎప్పుడు కావలసివస్తే అప్పుడు చూచుకోవచ్చును అనే అజాగ్రత్తా, అవజ్ఞా ఏర్పడుతుంది. మంత్రములు ఆంతరంగిక సత్యములనటానికి వీలులేకపోతుంది. ఈ కారణంచేతనే పూర్వం వేదాలు పుస్తకాలకెక్కలేదు. వినికిడితోనే వాళ్ళు వేదాలు నేర్చుకొన్నారు.

విద్యార్ధికి ఉండవలసినది ఒక్క తెలివేకాదు. శీలసంపదకూడ. అపుడే అతడు మంత్రచైతన్నాన్ని అనుభవంలోనికి తీసుకొని పోగలడు. జీవితం శుద్దంగా ఉంటేగానీ జ్ఞానానుభవం కలుగదు. అందులకే విద్యార్థులకు బ్రహ్మచర్యం వ్రతంగా ఉన్నది. విద్యాభ్యాపమే ఒక వ్రతం. అది దీక్షతో ఆరంభమౌతుంది.

పుట్టేటపుడు బ్రాహ్మణడూ శూద్రుడే. ఉపనయనకాలంలో ద్విజుడౌతున్నాడు. విద్యాభ్యాసంతో విప్రుడౌతున్నాడు. ఈ మూటితో అతడు శ్రోత్రియుడౌతున్నాడు అని శాస్త్రం చెబుతున్నది.

జన్మనాయతే శూద్రః సంస్కారాద్ద్విజ ఉచ్యతే

విద్యయా యాతి విప్రత్వం త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే

బ్రహ్మమనే వేదములలో మగ్నుడై, బ్రహ్మపదనాచ్యుడైన పరమాత్మజ్ఞానంలో నిష్ఠుడైతే బ్రాహ్మణుడౌతాడు. మనదేశంలోని చదువులు వట్టి జీవనోపాధికి మాత్రం నిర్దేశించినవి కావు. చదువు ఆత్మజ్ఞానానికీ, జననమరణ రూప సంసారతారణకూ ఏర్పడినది. గురువు మంత్రాన్ని ఒక మారు చెప్పి శిష్యులను ఐదుమార్లు చెప్పమనేవాడు. గురువు ఒక్కమారు చెప్పగా శిష్యుడు దానిని మరల చెప్పగలిగితే అతడు ఏకసంథాగ్రాహి.

33. కులము, శాఖ, ఛాత్రుడు, చరణము

మనం సాధారణంగా ''వాని కులగోత్రములు విచారించాలి'' అని అంటాము. (ఈ కాలపు వారికి కులగోత్రములలో నమ్మకం లేదు). ఒక ఋషి వంశమునుంచీ వచ్చిన వాళ్ళు ఆ ఋషి గోత్రమునకు చెందిన వారవుతారు. ఇట్లు ఒక గోత్రంలో పుట్టి పరస్పర సంబంధమున్నవారు కులము. ఇట్టి కులముల నుంచే పూర్వం విద్యాశాలలు ఏర్పడినవి. ఆ రోజులలో వానిని గురుకులములని కాక ఋషికులములని వ్యవహరించేవారు. గురుకులమని చెప్పినపుడు, గురుశిష్యుల మధ్య రక్త సంబంధము లేదు. పురాతన విద్యాశాలలలో గురుశిష్యులమధ్య బాంధవ్యముండేది. సాధారణంగా తండ్రియే గురువుగా ఉండేవాడు. ఋషికులములలో తమ పితరులలోని ఋషికి సంవేద్యమైన విద్యను ప్రచారం చేసేవారు.

తరువాత కాలములలో ఋషికులములు, పరస్పరము మంత్రములను విద్యలనూ ఒకరికొకరూ మార్చుకొనేవారు. ఇట్లు అనేక ఋషులు అనుగ్రహించిన మంత్ర సముదాయములను ఏక సంఘముగా అధ్యయనం చేయడంవల్ల శాఖలు ఏర్పడినవి. చారిత్రకంగా ఋషికులముల పిదప విద్యాశాలలు వచ్చినవి. వానికి గురుకులములతో సంబంధముండేది. ఈ విద్యాశాలలు ఒక శాఖకు ఏర్పడినవి, విద్యను అధ్యయన అధ్యాపనలు చేసేవి. అందువల్ల విద్యార్థులు, పరస్పరము రక్తసంబంధములకు అతీతమైన శాఖాసంబంధము కలవారైనారు. తర్వాత గురుకులములు, విస్తరించి ఒక వేదమునకు సంబంధించిన వివిధ శాఖలే కాక అన్ని వేదములూ, వేదాంగములనూ చెప్పడానికి ప్రారంభించినవి.

పాణిని వ్యాకరణం, శిష్యుణ్ణి ఛాత్రుడని చెబుతున్నది. ఛత్రమంటే గొడుగు. ఎండవానలనుండి గొడుగు ఎట్లా కాపాడుతుందో, గురువు ఛాత్రుణ్ణి దుస్సాంగత్యమునుంచి కాపాడి రక్షిస్తున్నాడు. ఈ ఛాత్రపదం గురువు గొప్పదనాన్ని అతనికి శిష్యునియందుండే ప్రేమనూ తెలుపుతుంది. చదువులు ఒక జ్ఞానంకోసమే కాదు. శీలరక్షణకు కూడా.

పాణినిలో చరణమనే పదాన్ని చేస్తాం. చరణమంటే పదం. పాదం. పరమపదమంటే మహూన్నత స్థానము. పదము దేహరక్షణా జీవరక్షణా చేస్తున్నది. ఈ అర్థంలోనే గురుకులాన్ని చరణమని అన్నారు.

అధ్యాపకుడు వేదములను వల్లెవేసి శిష్యులకు ఘనాంతము బోధిస్తే శ్రోత్రియుడౌతాడు. వేదమంత్రము తెలుసుకొనుటతోబాటు వాని అర్థమూ, విశిష్టత గూర్చి ప్రవచనము చేయకలిగిన అధ్యాపకుడు ప్రవక్త. ఒకే గురుకులంలో చదువుకొనేవారు సతీర్థులూ, సబ్రహ్మచారులూ. ఈ కాలంలో ఇంగ్లీషులో Class mates అని అంటారు. ఉత్తర భారతంలో గురుభాయీలు అన్న పదప్రయోగం ఉన్నది.

34. గురుదక్షిణ

విద్యాభ్యాసానంతరం శిష్యుడు గురువుకివ్వవలసిన గురుదక్షిణగూర్చి మనువు చెప్పుతున్నాడు. గురుదక్షిణ శిష్యుని తాహతుకు తగినట్లు ఇవ్వవలెను. గోవులు, భూమి, స్వర్ణము, వస్త్రములు, ధాన్యము, కూరగాయలు, ఛత్రములు, పాదుకలు, ఇవి ఏవైననూ సరే, జీవనోపాధికోసం ఆర్జించు అధ్యాపకుడు శ్రాద్ధక్రియలకు అనర్హుడు. అతని శిష్యుడూ అనర్హుడే. జీవనోపాయాన్ని ఉద్దేశించి వేతనము గ్రహించి బోధనచేసేవాడు, ఉపాధ్యాయుడని మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది.

విద్యావ్యాప్తితో రక్తసంబంధమున్న కులములు అంతటితో ఆగక పెద్ద గురుకులములుగా మారినవి. ఈ గురుకులములు వేదవేదాంగములను అర్హులైన వారికి బోధించేవి. క్షత్రియులు, వైశ్యులు ఈ గురుకులములకు విద్యార్థులై వచ్చేవారు.

కాలక్రమేణ విద్య అనే పదం ఒక ఆధ్యాత్మిక విద్యకేకాక ఇతర విద్యలకూ (అనగా నేటి కళలు విజ్ఞానము) సూచకమై వానినీ గురుకులములలో బోధించిన దొడగిరి. ఛాందోగ్య ఉపనిషత్తలులో అట్టి కళలు, విజ్ఞానమునకు సుదీర్ఘమైన సూచిక ఇవ్వబడినది. ఆ సూచిక నిజంగా విస్మయజనకంగా ఉంటుంది. కొన్ని వేల ఏండ్లక్రితం వానిని గురుకులములలో నేర్పేవారు.

అట్టివిద్యలలో కుశలుడైనప్పటికీ, నారదుడు అభ్యాసములేని కారణమున ఆత్మజ్ఞానము లేకపోయెనే అని విషాదగ్రస్థడయ్యాడు. నారదుడు తాను నేర్చిన విద్యలను సనత్కుమారునికి ఈ విధంగా చెబుతున్నాడు. అవి నాలుగు వేదములు, ఇతిహాసము, పురాణములు. (వీనిని నారదుడు పంచమవేదమని చెబుతున్నాడు) పిత్ర్యం అనగా పైతృక కర్మలకు చెందిన కల్పము, రాశిలేక గణితము; దైవము (భావిని గూర్చి చెప్పటం) శకునశాస్త్రము, ఏకాయనం (రాజీనీతి) నిధి అనగా ఆర్ధిక శాస్త్రము, వాకో వాక్యము (లాజిక్‌-తర్కము), దేవ విద్య (నిరుక్తము) బ్రహ్మ విద్య అనగా మంత్రనాదములను గూర్చిన శిక్షాశాస్త్రము, భూతవిద్య, (బయాలజీ) క్షాత్రవిద్య (యుద్ధమునకు సంబంధించిన విద్య), నక్షత్ర విద్య (ఖగోళశాస్త్రము, జ్యోతిషశాస్త్రము) సర్వవిద్య (విషవైద్యము) దేవజనవిద్య (సంగీత, నాట్య, నాటక, శిల్ప, చిత్రలిఖనములు) దేవజనములనగా గంధర్వులు. దేవతలకు మనుష్యులకు మధ్య ఉన్న ఒక తెగ.

నారదుడు మహామేధావి. అందుచేతనే ఆయన ఇన్ని విద్యలను నేర్వగలిగినాడు. ఇంత చదివినప్పటికీ ఆత్మానంద స్థితిని అందుకో లేకపోయానని తెలుసుకొనే వివేక వినయములు కలిగినవాడు నారదుడు. అందుకొఱకే ఆయన సనత్కుమారుని ఆత్మ విద్యోపదేశము కొఱకై ఆశ్రయించాడు. విద్యయొక్క ప్రయోజనము ఈశ్వర తత్త్వము నెరుగుటయే అని దీనివలన తెలుస్తోంది.

ఇట్లు విద్యలధికమైనందున గురుకులములు వ్యాపించి ఉపాధ్యాయుల సహాయముతో వివిధ కళలను విద్యార్ధులకు బోధించేవారు. ఇట్టి గురుకులవాసములను ఆదర్శముగా నుంచుకొనియే రవీంద్రనాథటాగూరు తన శాంతినికేతనాన్ని స్థాపించారు.

నారదునికేర్పడిన కొరత ఆ నాటి విద్యార్థులకందరికి ఏర్పడి యుండదు. ఆనాటి విద్య ఈశ్వరసంబంధము, ఆత్మ సంబంధముగనై ఉన్ననూ ఒక సామాన్య విద్యార్థిని విద్యాభ్యాసకాలమున ఏకధాటిలో అతనికి ఆగమ్యమైన జ్ఞానమార్గమునకు ఆ కాలపు ఆచార్యులు బలవంతపరచియుండరు. విద్యార్థులకు బ్రహ్మ విద్య చెప్పబడినప్పటికీ వెంటనే వారికి అనుభూతి కలుగవలెనన్న నిర్బంధము లేకుండెడిది. విద్యాభ్యాసము పూర్తియైన వెంటనే పెళ్ళిచేసుకొని, సంతానప్రాప్తియు, వైదిక కర్మానుష్ఠానములచే చిత్తపరిపాకమునూ పొంది, సన్యాసము పుచ్చుకొని ఆత్మ విచారము చేయవలెననుటయే వేదవిహిత మార్గము.

35. ధర్మము బ్రహ్మము

ఈ లోకములో నియమజీవనం కొఱకు ఏర్పడ్డది ధర్మం. బ్రహ్మం పారలౌకికం. ధర్మ మార్గంలో ధార్మిక కర్మల మూలంగా ఒక సామాన్యజీవుడు బ్రహ్మవిచారం చేయగలడు. ధర్మమేమియని విచారించి, తెలుసుకొని, అనుష్ఠించుటకే పూర్వమీమాంసపరమైన కర్మమార్గ శాస్త్రమూ, బ్రహ్మమును గూర్చి విచారించి తెలుసుకొని అనుభవించుటకు ఉత్తరమీమాంసపరమైన వేదాంతమూ ఉన్నవి. ఆ కాలపు విద్యాస్థానములలో వేదాంతము ఎక్కువగా చెప్పినా, విద్యార్థులకు ఏదో ఒక దానిలో అభిరుచి కలిగించడం తప్ప, వారు వెంటనే వేదాంతలక్ష్యమునకు పాటుపడతారని కాదు. విద్యర్థి గృహస్థుడు కాగానే ధర్మశాస్త్రానుసారం గార్హస్త్య జీవితం గడిపేవాడు. ఇట్లా గృహజీవనం గడుపుతూ పక్వమయ్యేసరికి అతడు ఆత్మశాస్త్రాన్ని అభ్యసించేవాడు. నారదుడు అసామాన్యుడు. అందుచేతనే ఆయన విద్య పూర్తికాగానే, బ్రహ్మాన్వేషణ చేస్తూ ఆత్మజ్ఞానసిద్ధికి సనత్కుమారుని ఆశ్రయించాడు. ఆయన గృహస్థ జీవనం అవలంబించలేదు.

ఆనాటి విద్యావిధానం ప్రకారం సామాన్యజీవుడు ధార్మిక మార్గంలో కర్మ చేస్తూ, చిత్తశుద్ధి కలిగిన పిదప ఆత్మాన్వేషణా తత్పరుడయ్యేవాడు.

36. వైదికమే అన్ని విద్యలూ

ఒక ముఖ్య విషయం చెప్పవలెను. పూర్వకాలంలో అన్ని విద్యలూ వైదిక విద్యలే. కళగానీ, విజ్ఞానంగానీ అన్నీ వేద సంబంధములైనవే. ఒక్కొక్కటి, పదునాలుగువేదవిద్యలకు సంబంధించినవే. వాని ప్రయోజనం వైదిక మార్గపరమైన జీవనమే. కొందరు వేదవిభాగములను అన్నిటినీ అంగీకరించక పూర్వమీమాంసాతత్పరులుగనే ఉండేవారు. వేదములను పూర్తిగా నిషేధించిన చార్వాకులూ ఆకాలంలో ఉన్నారు. మరికొందరు, వేదములను నిషేధించనూలేదు, ఒప్పుకోనూలేదు. వారు సాంఖ్యము, యోగము పాటించేవారు. వీనినీ వేదములతోబాటు నేర్పేవారు. తర్వాత వచ్చినది బౌద్దము. అది అవైదికము. వేద ప్రమాణమును బుద్ధుడు ఒప్పుకోలేదు. బౌద్ధులు విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఆ విద్యాస్థానాలలో కూడ పదునాలుగు వేద విద్యలు నేర్పేవారు.

37. అన్ని వర్ణములవారికీ విద్య

వృత్తులకు ఏర్పడిన విద్యలు వచ్చేసరికి, వేదార్హులైన త్రైవర్ణికులు-అనగా బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులు, గురుకులములకు వచ్చి విద్యాభ్యాసం చేయదొడగినారు. నాలుగవ వర్ణమునకు చెందినవారూ మధ్యాహ్నం గురువుకులములకు వచ్చి వారి వృత్తి పరములైన శాస్త్రములు చదువుకొనేవారు. త్రైవర్ణికులు గురుకులంలో ఒకే విద్యను అభ్యసించలేదు. విద్యాకాలము అనగా ఒకే భాగము చదువుటకు వలసిన సంత్సరములు- వేరు వేరుగా ఉండేవి. మూడు వర్ణముల వారికి ఉపనయనము వేరువేరు వయస్సులలో చేసేవారు కనుక విద్యార్థులు ఒకే వయస్సులో గురుకులములకు పంపబడలేదు.

38. నిర్బంధ విద్య

మన ప్రాచీన విద్యా విధానం గూర్చి ఒక ముఖ్యమైన విషయం. నేను చెప్పగోరతాను. త్రైవర్ణికులు గురువు వద్ద బ్రహ్మూపదేశము పొందవలెననీ, విద్యాభ్యాసము చేయవలెననీ శాస్త్రనిర్దేశ##మే, శాస్త్రనియమమూ, అనగా విద్యాభ్యాసము నిర్బంధముగా (Compulsory) చేసి తీరవలసినదే. విద్యాభ్యాసము తల్లితండ్రుల ఇష్టముపై ఆధారపడలేదు. గురువు వద్దకు పిల్లలను పంపకపోతే తల్లి తండ్రులను శిక్షించేవారు. ఆ రోజులలో కఠినమైన శిక్ష-అవమానకరమైన శిక్ష-జాతినుండి వెలివేయడం-బహిష్కారము, శాస్త్రముల ప్రకారము బ్రహ్మక్షత్రియవైశ్యులు గురువు వద్దకు విద్యాభ్యాసమునకు పోకపోతే జాతినుంచి వెలివేసేవారు. వారి పిల్లలు వ్రాత్యులు ఆయ్యేవారు. మన ముత్తాతలు వేద విద్యకు, వేదాంగ విద్యలకు అంత ప్రాముఖ్యమిచ్చేవారు.

39. పాత్రత అనుసరించి

ధర్మశాస్త్రములు సత్పాత్రులకు విద్యాదానం చేయాలని విధించినవి. సత్‌ పాత్రులంటే బ్రహ్మచర్యము అవలంబించి, పూర్ణమైన మనస్సుతో ఒక విద్యాభాగమును పూర్తిగా ఆభ్యసించే విద్యార్థులు. విద్యార్థి శీలవంతుడుగా ఉంటూ గ్రహణశక్తి కలిగి ఉండవలెను. చదివిన దానిని మరువరాదు. గ్రహణ శక్తితోబాటు జ్ఞాపకశక్తి విద్యార్థికి ఉండవలెను. ఒక విషయాన్ని మరచిపోకుండా జ్ఞాపకముంచుకొనుట ధారణాశక్తి.

ఐతే మీరు అడుగవచ్చును. విద్య అందరికీ నిర్బంధమైతే దానిని ఎట్లా సత్పాత్రులకే పరిమితం చేయడం? గ్రహణ ధారణలేని విద్యార్థి గతిఏమి? దీనికి జవాబు. విద్యార్తి బ్రహ్మూపదేశ##మైన పిదపనే గురుకులానికి వస్తున్నాడు. అంటే అతనికి గాయత్రీ మంత్రోపదేశ##మైనదని అర్థం. విద్యార్థి గాయత్రిని శ్రద్ధాభక్తులతో జపిస్తే మంచి గ్రహణశక్తి, ధారణశక్తి కలుగుతుంది.

సక్రమంగా, గాయత్రీమంత్రం జపం చేయకుండా గ్రహణ ధారణ శక్తులు లేకపోతే అతడు అసత్తుఔతాడు. వానికి విద్యలేదు. వానిని కులములో ఒప్పుకోరు. ఊషరక్షేత్రంలో నాటిన బీజంవలె అసత్తుకు చెప్పే విద్య వ్యర్థం.

అపాత్రునికి విద్యాదానం చేయడంకంటే విద్వాంసునికి చావు మేలని చెప్పబడినది. పాత్రునికే విద్యాదానం చేయాలనడానికి ధర్మశాస్ద్రములలో ఒక కథ ఉన్నది. విద్యాదేవత ఒక బ్రాహ్మణునితో ఇట్లా చెప్పుతున్నది; ''నేను నీకొక నిధి వంటిదానిని. నిధిని ఎట్లా రక్షణ చేస్తారో ఆ విధంగా నన్ను రక్షణ చేయడం నీ విధి. అందుచేత నన్ను జాగ్రత్తగా వినియోగించు. నీవు సత్పాత్రులకే విద్యాదానం చేయి. ఇంద్రియ నిగ్రహమున్న వానికీ, శుచిగలవానికీ, మనోనైర్మల్యమున్నవానికీ, శ్రద్ధాళువుకూ, విద్యాదానం చేయవలెను. నీ వద్ద విద్య గ్రహించినవాడు కూడ బొక్కనమువలె నన్ను భావించి నా యోగ క్షేమాలు చూచేటట్లు నీవు జాగ్రత్త వహించాలి.

ఎవడైతే అవధానం లేకుండా ఉంటాడో, ఎవనికి శ్రద్ధలేదో, ఎవడు అధార్మికమైన విషయాలకు తన విద్యను వినియోగం చేస్తున్నాడో, వానికి విద్య చెప్పకూడదని మనుస్మృతి. ద్రవ్యాశతో, అపాత్రునికి విద్యాదానం చేస్తే నరకానికి పోతారని ధర్మశాస్త్రములు చెప్పుతున్నవి.

40. తరువాత కాలపు విద్యావిధానం

ఒక విద్యార్థికి జ్ఞానమూ, శీలమూ రెడూ ఉండేటట్లు ఉపకరించే విద్యావిధానమూ మన పూర్వీకులు అవలంబించారు. తరువాత కాలంలో పాఠశాలలు ఏర్పడగా విద్యార్థులు రౌడీలుగా లేకపోతే చాలని అనుకొనేవారు. కానీ దానిని మించి శీలమును గూర్చి విద్యాధికారులు ఏ విధమైన ప్రశ్నలూ వేసేవారు కాదు. పరీక్ష పాస్‌ ఔతాడన్న నమ్మకముంటేనే ఒకనిని పాఠశాలలో చేర్చుకునేవారు. ఇపుడు అదీలేదు. ఒకడు రౌడీగా ఉండే వానికి భయపడటం, వాడు అడిగిన మార్కులు ఇవ్వడం ఇదీ ఇప్పటి విధానం.

ఒకనికి తెలివి ఉందా, గుణము ఉందా అన్న ప్రసక్తి ఇపుడు అసలే లేదు. సంఘంలో ఆ జాతికి చెందిన వారికి ఎన్ని ఓట్లున్నాయి? అంతకంటే మించిన వేరే ప్రమాణం అక్కరలేదు. ఐతే దీనిని వాళ్ళు బాహాటంగా ఒప్పుకొంటారా? లేదు. ''నిమ్నజాతి వారిని ఉద్ధరించాలి. అదే మా ధ్యేయం. వారి ప్రగతికి తగిన సదుపాయాలు మేము చేస్తున్నాము'' అని తమ్ము సమర్థించుకొంటారు.

నిమ్నజాతులవారు పైకి రావలసినదే. ఏవిధంగా అని ప్రశ్న. ఆ ఉద్ధరణ క్రమంగా ఉండాలి. ఆ ఉద్ధరణ సంఘంలోని ఇతరుల యోగ క్షేమాలకు భంగకరంగా ఉండరాదు. నిమ్నజాత్యుద్దరణలో న్యాయంలోపించిందంటే అది సంఘానికే అపాయకరం.

ఒక జాతికి చెందిన తాతముత్తాతలు గొప్ప చదువులు చదివినారనీ, ఇతరులకు ఆ భాగ్యం కలుగలేదనీ, ఇపుడు - ''మీ తాత ముత్తాతలు బాగా చదివారు కదా? నీవెంత తెలివి కలిగిన వాడివైనా నీకు సీటులేదు. విద్యా విషయంలో నీకు ఇపుడు రెండవ తరగతే'', అని చెప్పక చెబుతున్నారు. ఎవరి తాతముత్తాతలు చదువులేక ఉండినారో వారి సంతతికే ఇపుడు అన్ని అవకాశములూ, వారికి తెలివి ఉన్నా లేకపోయినా, వారికి కొంత శాతము సీట్లు ప్రత్యేకిస్తున్నారు.

ఇది యుక్తికి విరుద్ధంగా ఉంది. అసమంజసముగానూ ఉంది. కానీ పై విధంగా వాదించేవారు తమ వాదన చాలయుక్తంగా ఉందని భావిస్తున్నారు. పూర్వకాలంలో వృత్తులను అనుసరించి విద్యలేర్పడినపుడు, ఆ విభాగాన్ని విద్యలు సమర్థించేటట్లు ఉండేవి. అందుచే ఆయా వృత్తులు అభివృద్ది చెందినవి. ఆ విద్యలు ఇపుడు జాతిపేరిట దోషనీయములైనవి. ఇప్పుడు సీట్లు కేటాయించేటపుడు ఒకనికి తెలివి ఉన్నదా లేదా అని కాదు ప్రశ్న. వాడు ఏ జాతికి చెందినవాడు అనేదే. ఇది జాతి పేర చేస్తున్న దోషమే. ఈ విధానాన్ని వారు ప్రగతి అనీ, సమనీతి అని, యుక్తియుక్తమనీ భావించడం ఆశ్చర్యకరంగా ఉంది.

నిమ్నజాతులు పైకిరావడానికి అభ్యంతరం ఎవరూ చెప్పటంలేదు. ముందుకు పోగల వారిని వెనకకు పెట్టుతున్నందుకే అభ్యంతరము. ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టు. అందుకోసం తింటూ ఉన్నవాని గిన్నెలాక్కోవద్దు.

ఈ కాలంలో సమత్వం అభేదం అన్న ధ్యేయాలు విపరీతార్థములతో మనకు దర్శనమిస్తున్నవి. జాతిని ఎవరు నిర్మూలనం చేయాలని చెప్పుతున్నారో వారు జాతిని చిరస్థాయిగా చేస్తున్నారు! వారి విద్యా విధానం ఉద్యోగాల కేటాయింపు పూర్తిగా జాతిపై ఆధారపడిఉంది.

41. జాతివ్యవస్థ

పూర్వకాలంలో విద్యావిధానంలో చదువు జాతి సంబంధముగా ఉండి ఉండలేదు. విద్యకు ప్రాధాన్యత. అందుకే ధర్మ శాస్త్రములు ఒక జాతికి చెందిన వారికి మరొక జాతి వృత్తికి ఏర్పడిన విద్యను చెప్పడానికి ఉదారంగా సమ్మతించినవి.

ఏ జాతివాడైన మరొక జాతికి చెందినవాని వద్ద ఒక విద్యనో, ఉత్తమలక్షణమునో, శీలవతియైన కన్యనో (వివాహార్థము) గ్రహించవచ్చునని మనువు చెప్పుతున్నాడు. తరువాతి ధర్మశాస్త్రములు వర్ణధర్మమును భంగపరచరాదనియూ, ఒక వర్ణమువారు మరొక వర్ణమునకు చెందిన కన్యను ప్రేమకారణంగా గ్రహింపరాదనీ నిర్దేశించినవి. బ్రాహ్మణుడు అబ్రాహ్మణుని వద్ద ధర్మమో, విద్యయో పరిగ్రహించవచ్చును.

ధర్మము, శాస్త్రనిర్దేశితము. శాస్త్రముల ప్రయోజనము ధర్మాభివృద్ధియే. అందుచే ధర్మమును, శాస్త్రమును వేరుచేయరాదు. ఒకచోట అకస్మాత్తుగా విరోధుల కారణముగా బ్రాహ్మణక్షయం వద్ద వైశ్యులవద్ద గ్రహించేవారు. ఒక విద్యయైనా, ఒక గొప్ప విషయమైనా ఎవరివద్దయైనా గ్రహింపవచ్చునని ధర్మశాస్త్రములంటవి. ఎవడు చెబుతున్నాడనేది ప్రధానంకాదు. అతడేమి చెప్పుతున్నాడు? అందులో ఏదైనా అర్థమూ, సారమూ ఉన్నదా? అనే మనం గమనించవలెను. మహాభారతంలో ఒక కథ ఉన్నది. ఒక ఋషి ఆగ్రహంతో ఒక కొంగను తన చూపుతో దగ్ధమైయేటట్లు చేస్తాడు. తర్వాత అతడు ఒక స్త్రీ వద్ద ధర్మం తెలుసుకోవలసి వచ్చింది. ఆమె చెప్పగా అతడు ఒక వ్యాధుని వద్ద - మాంసము నమ్మి జీవించే వాని వద్ద - ధర్మోపదేశం పొందాడు. జ్ఞానమూ, విజ్ఞానము నేర్చుకోడానికి ఎవరైనా ఫరవాలేదు.

42. విద్య, నాలుగవ వర్ణము

నాలుగవ వర్ణమునకు చెందిన శూద్రులలోనూ, బ్రాహ్మణులకు కూడ విద్య నేర్పగలిగిన విద్వత్తు వున్నవాళ్ళు కలరు. వాళ్ళ వద్ద విద్యాగ్రహణం చేయవచ్చునని ధర్మశాస్త్రములూ చెప్పినవి. మరొక్క విషయం విశదమౌతుంది. ఈ కాలంలో చెప్పేటట్లు బ్రాహ్మణులు ఇతరులకు విద్యాదానం చేయక వారిని అంధకారంలో త్రోశారనేది అబద్ధమని. వారిని వేరుగానూ ఉంచలేదు. వేదములు వారికి నేరుగా చెప్పబడనిది వాస్తవమే. కాని వారి వారి వృత్తులకు ఏర్పడిన విద్యాప్రదానంలో లోటు లేదు. అంతేకాక ధర్మోపదేశములు, జ్ఞానోపదేశములు జాతి నిమిత్తం లేకుండా ఇవ్వబడేవి. వీనికై పురాణములు ఏర్పడినవి. శూద్రులలోనూ, ధర్మములో ఆత్మవిద్యలో ప్రవీణులైన వారుండినారు. వారి మూలముగా బ్రాహ్మణులు నేర్చుకొనుటకు నిషేధమేదీలేదు.

వ్యాసభగవానుడు వేదములను తన బ్రాహ్మణ శిష్యులకు ఉపదేశం చేసి వ్యాపకం చేశాడు. పురాణములను అబ్రాహ్మణులకు ఆయన ఉపదేశించాడు. సూతుడైన రోమహర్షునికి పురాణములను ఉపదేశించి వానిని అందరికీ బోధించమన్నాడు. నైమిశారణ్యంలోని బ్రాహ్మణ ఋషులు సూతుడైన రోమహర్షుని గౌరవించి అతని వద్ద పురాణ శ్రవణం చేశారు.

43. విద్యాదాన విశిష్ఠత

సత్పాత్రునికి విద్యాదానం చేయడం కంటే గొప్ప దానంగానీ సమాజ ప్రయోజనంగానీ లేదని మనపెద్దలు భావించారు. విద్యాదానమునకు అంత విశిష్టత ఉండేది. విద్యాదానం అన్నపుడు విద్యను విత్తానికి అమ్మరాదనీ, ఉచితంగా విద్యను నేర్పాలనీ భావం.

మనుస్మృతిలో దానములలో అతిశ్రేష్ఠములైన వానిని అతి దానములంటారనీ, గోదాన, భూదాన, విద్యాదానములు అతి దానములనీ చెప్పబడింది. అన్నదానం కూడగొప్పే. కాని అన్నదానం చేత క్షుద్బాధ మాత్రం నివారణమౌతుంది. విద్యాదానం అన్నదానంకంటే చాలగొప్ప. అన్ని విద్యలలో అతి శ్రేష్ఠమైనది బ్రహ్మ విద్య. బ్రహ్మవిద్యను ఎవడైతే దానం చేస్తున్నాడో, అతడు స్వర్గానికిపోయి సంసారంనుంచీ ముక్తుడై పరమాత్మతో ఐక్యమౌతున్నాడు.

44. విద్యకు కాలపరిమితి

ఈ కాలపు వేద పాఠశాలలో వేదాధ్యయనమునకు 12 ఏళ్ళు కాలం పట్టుతుంది. భాష్యపాఠములకు ఎనిమిదేళ్ళు కాలం కావలసి ఉంది. పూర్వకాలంలో విద్యార్థి ఎంత చురుకుగా ఉండేవాడో, అతడు ఏఏ విషయములను చదువగోరుతున్నాడో దానినిబట్టి కాలం నిర్ణయింపబడేది. తక్కువ పక్షం తొమ్మిదేళ్ళు. సాధారణంగా పండ్రెండేళ్ళు అధ్యయనానికి నియమితమై ఉండేది. చదువుకొనే వేద విద్యలనుబట్టి 18 ఏళ్ళు, 36 ఏళ్ళు కూడా విద్యాధ్యయనం చేసేది కద్దు. మనుస్మృతిప్రకారం, కాలపరిమితిలేక, ఆ జన్మ విద్యాభ్యాసం చేసే వాడుకా ఉండేది. గృహస్థాశ్రమమనేదే లేక బ్రహ్మచారిగానే ఉంటూ వేదాధ్యయనం చేసే వారూ కలరు. గురువు శిష్యుని పరీక్షించి అతడు అసామాన్య కుశాగ్రబుద్ధి ఐతే అతనిని ఆశ్రమ నిబంధనలుంచి విముక్తుణ్ణి చేసేవాడు. అట్టి విద్యార్థి నైష్ఠిక బ్రహ్మచారి.

ఒక సంత్సరాన్ని విద్యావిషయంగా రెండు భాగాలుగా విభజించారు. మొదటిది ఉపాకర్మ. రెండవది ఉత్సర్జన. తమిళ##దేశంలో ఉపాకర్మను ఆవని ఆవిట్టం అంటారు. ఆరోజు జందెములను మార్చుకుంటారు. ఋగ్వేదీయులకు చాంద్రమాన శ్రావణమాసంలో శ్రవణ నక్షత్రం నాడు ఉపాకర్మ. యజుర్వేదీయులకు ఉపాకర్మ శ్రావణ పౌర్ణమినాడు. వారు తిథిని అనుసరిస్తారు. ఋగ్వీదీయులు ముందు చెప్పినట్లు శ్రవణ నక్షత్రంనాడు ఉపాకర్మ చేస్తారు.

చాలాకాలము ముందు శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం నాడే సంభవించేది. అందుకే శ్రావణ మాసం అనిపేరు. శ్రవణ నక్షత్రం, పౌర్ణమీ రెండూ ఉన్నరోజు ఋగ్వేదీయులూ యజుర్వేదీయులు ఉపాకర్మ చేసుకొనేవారు. తరువాతి కాలంలో గ్రహచారములో గందరగోళం ఏర్పడి శ్రావణమాసంలో పౌర్ణమినాడు శ్రవిష్ఠ (తమిళంలో ఆవిట్టం) వచ్చేసరికి యజుర్వేదీయులు ఆరోజు ఉపాకర్మ చేసేవారు. ధర్మశాస్త్రములు శ్రావణమాస పౌర్ణమినాడు ఉపాకర్మ చేయాలని నిర్దేశించినవి. అందుచే యజుర్వేదీయులు నక్షత్రానికి కంటే తిథికి ప్రాముఖ్యం ఇచ్చారు.

దీనిని తమిళంలో ఆవణి ఆవిట్టం అని మనం పిలుప్తాం.

ఋగ్వేదీయులు తిధికి ప్రాధాన్యం ఇవ్వక ఉపాకర్మను శ్రవణ నక్షత్రం నాడే చేస్తారు. అందుకే ఉపాకర్మను శ్రావణాలని పిలుస్తారు. ఋగ్వేద ఉపాకర్మకు శ్రవిష్ఠతో సంబంధంలేదు. కానీ దక్షిణ దేశంలో యజుర్వేదీయుల సంఖ్య ఎక్కువైనందువల్ల, ఋగ్వేదీయులూ తమ ఉపాకర్మను ఆవణి ఆవట్టం అని అంటారు.

కొన్ని సంవత్సరములలో తిథీ నక్షత్రం - (పౌర్ణమీ యుక్త శ్రవణ నక్షత్రం నాడు) - ఒకే రోజున వస్తే ఆరోజు ఋగ్వేదీయులూ యజుర్వేదీయులూ ఉపాకర్మ చేసుకొంటారు.

సామవేదీయులు ఒకనెల అనంతరం భాద్రపదమాసం, హస్తనక్షత్రం నాడు ఉపాకర్మ చేసుకుంటారు. ఆ దినమో, లేక ముందురోజో వెనకరోజో వినాయకచతుర్థి వస్తున్నది. హస్త, పంచమీ రెండూ ఒక రోజు సిద్ధిస్తే ఆరోజు చాల మంచిదని శాస్త్రాలు చెబుతవి. శ్రావణపౌర్ణమి నాటికి శ్రవణ నక్షత్రం వస్తే భాద్రపదంలో హస్తనక్షత్రం పంచమినాడు వృద్ధి చంద్రునితో కూడి ఉంటుంది.

చాలమందికి ఉపాకర్మ అంటే తెలియదు. కొందరికి తాము ఏ వేదానికి చెందినవారో కూడా తెలియదు. ఉపాకర్మ అనే పదం విన్నవారు కూడా, జీర్ణ యజ్ఞోపవీతం మార్చుకొని నూతన యజ్ఞోపవీతం ధరించేరోజు అని అనుకుంటారు. కానీ యజ్ఞోపవీతధారణ ఉపాకర్మ నాడు చేసుకొనడమనేది ఒక చిన్న అంశ##మే.

ఉపాకర్మ ఒక్కరోజకు సంబంధించిన విషయంకాదు. ఆరునెలల కాలం విద్యాభ్యాసం చేయడానికి ఏర్పడినమొదటి దినం అది. ఆ ఆరునెలల కాలంలో బ్రాహ్మణములూ, ఆరణ్యకములు, ఉపనిషత్తులూ అధ్యయనం చేయాలి. ఈ పాఠాలు పుష్యమాసం మొదలయ్యేంతవరకూ చదవాలి. పుష్యమాసాన్ని తమిళంలో తై అని అంటారు. తైషం అనే పదంనుంచి తై పుట్టంది. పుష్యమిని తైషం అని కూడా అంటారు. పుష్యముసంలో ఉత్సర్జనం, పాఠములను ముగించడం, పుష్యపౌర్ణమినాడో, రోహినీ నక్షత్రమునాడో చేస్తారు.

సామవేదీయుల వేదాధ్యయనం ఐదునెలలో, నాలుగున్నర నెలలో జరుగుతుంది. వారు ఉత్సర్జనం మాఘ పౌర్ణమి నాడు చేస్తారు. పుష్యమాస అమావాస్య పోయిన 25 రోజులకు మాఘపౌర్ణిమ వస్తుంది.

ఉత్సర్జన, విసర్జన రెండూ ఒకటే. ఆ పదాలకు వదలిపెట్టడం అని అర్థం. అధ్యయన అధ్యాపనలను వదలిపెట్టడం. ఏడునెలల పిదల మళ్ళా ఉపాకర్మనాడు వదిలిన వేదాభ్యాసము మళ్ళా మొదలుపెడతారు. ఉపాకర్మ అంటే ఉపక్రమణ-మళ్ళీ ప్రారంభించుట.

ఉత్సర్జన, ఉపాకర్మల మధ్యకాలంలోని ఏడు నెలలలో వేదషడంగములు-శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అధ్యయనం చేస్తారు. ఈ కాలంలో ఇతర శాస్త్రములూ నేర్చుకోవచ్చును. వీనిని ఉపాకర్మనాడు నిలిపి వేదవిద్యలను అధ్యయనం చేస్తారు. ఉత్తరదేశంలో ఆత్సర్జన దినమును సరస్వతీపూజ లేక వసంత పంచమి అని వ్యవహరిస్తారు.

ఈ రోజులలో ఉపాకర్మనాడు, వడలూ, పోళీలు-ఇవె ముఖ్యమైనవి. ఆరోజు పురోహితుడు వేద సూక్తములు వల్లిస్తే మిగతా జనులు తప్పులతడకగా వారిని అనుసరిస్తారు. ఉత్సర్జనా ఆ రోజే జరిగిపోతుంది! వేదాంగములలోని సూత్రాన్నేదైనా పురోహితుడు చదివితే దానినీ తప్పులతో ఇతరులు అనుసరిస్తారు. నిజానికి పురోహితుడు ఉత్సర్జనం చేస్తున్నాడన్న ఎరుక కూడ ఉండదు. ఒక్క సంతోషం, ఉపాకర్మకే ఉత్సర్జనం వాళ్ళు చేయలేదు! బహుశా వడలూ పోళీలు తప్పిపోతాయనేమో! ఇంతటి హాస్యాస్పదమైన స్థితికి ఉపాకర్మ ఉత్సర్జనలు వచ్చినవి.

ఈ విధంగా వేదవేదాంగములను 12 ఏళ్ళ కాలం, పూర్తి అధ్యయనం చేసేవారు. ఈ కాలం, కొందరి విషయంలో 18 లేక 36 సంవత్సరములు పొడిగింపబడేది. ఆ కాలంలో తమ శాఖకు సంబంధించిన వేదములే కాక ఇతర వేదములూ వాళ్ళు అధ్యయనం చేసేవారు. రెండువేదాలు చదివిన వాడు ద్వివేది. మూడు వేదాలు చదివినవాడు త్రివేది. నాలుగువేదాలు చదివినతడు చతుర్వేది. ఇవికాక వేదాంగములూ నేర్చుకొనేవారు.

45. ఉపాకర్మ గృహస్థులకెందుకు?

ఉపాకర్మ ఉత్సర్జనలు విద్యాసంబంధములైతే అవి బ్రహ్మచారులకే పరిమితముకాక, వానిని గృహస్థులెందుకు చేస్తున్నారు?

శాస్త్రములు అధ్యయనమయిన పిదప బ్రాహ్మణునికి అధ్యాపన విధించియున్నవి. బ్రాహ్మణుడు బ్రహ్మచారికి వేదాధ్యానపము చేసేటపుడు ఉపాకర్మ ఉత్సర్జనములు చేయవలసి వస్తున్నది. ఈ విధంగా తన్నూ విద్యార్థినీ అతడు శుద్ధి చేసుకొంటున్నాడు. అధ్యాపనం చేయకపోయినా చదివిన దానిని మరువకుండా ఉండుటకు అధ్యయనం చేయవలసి వస్తుంది. అందుకొరకు అతడు ఉపాకర్మ ఉత్సర్జనలు చేయవలసి వస్తున్నది.

అంతేకాక, ధర్మశాస్త్రములు ఉపాకర్మ ఉత్సర్జనలు, గృహస్థులకు సంబంధించిన విభాగములో చెప్పినవి. బ్రహ్మచారులకు సంబంధించిన భాగములోకాదు.

విద్యా వ్యాసంగమే ఒక తపస్సు. అదే ఈశ్వరార్చన. బ్రహ్మూపదేశముతో ప్రారంభ##మై, వివిధ వ్రతపరిపాలనలతో అంతమౌతుంది. విద్యాభ్యాసాన్ని పూర్తిచేయడాన్ని సంవర్తనమంటారు. ఉపాకర్మలు సంవర్తనం పూర్తి చేసినవారు ఎట్లు చేయవలెను. పూర్తి చేయనివారు ఎట్లు చేయవలెను అనేది స్మృతులు చెబుతున్నది. గృహస్థులు కూడా ధారణానిమిత్తం వేదాధ్యయనం చేయాలని స్మృతికర్తలైన ఋషులు చెబుతున్నారు.

46. సెలవు దినములు

ఐతే వేదాధ్యయనం చేసేవారికి సెలవు దినములు లేవా? మన పూర్వులు పిల్లలను సంవత్సరము మొత్తము అధ్యయనం చేయాలని కట్టడిచేయలేదు. ప్రతిమాసములోను ఆరుదినములు అనధ్యయనదినములు. ఆ రోజులలో అధ్యయనం చేయరాదు. పౌర్ణమి అమావాస్య, కృష్ణశుక్ల అష్టమి, చతుర్దశులు అనధ్యయన దినములు, దీనితోబాటు ఉపాకర్మ ఉత్సర్జన దినములకు ఆవలి మూడుదినములూ అనధ్యయనదినములు. ఇవికాక సంవత్సరములో చాతుర్మాశి అనే నాలుగు రోజులూ అధ్యయనం చేయరాదు.

ఇవి పంచాగం ప్రకారం ఏర్పడే నిత్య అనధ్యయన దినములు. ఇవికాక నైమిత్తిక అనధ్యయన దినములుంటవి. వానలు ఎక్కువగా కురిసినరోజులు, తుఫాను వచ్చినరోజులు, అగ్ని ప్రమాదము ఏర్పడినపుడు, గురుకులముపై దస్యులు దండెత్తినపుడూ అధ్యయనము నిలపబడుతుంది.

గ్రహణకాలములో అధ్యయనం చేయరాదు. కానీ మంత్ర జపము చేయవచ్చును. గ్రహణకాలంలో చేసే మంత్ర జపం బలవత్తరము.

47. విద్యార్థిని కొట్టవచ్చునా?

శిష్యులయందు గురువు ప్రేమను చూపినా, ఆ ప్రేమ విద్యార్ధిని చెడగొట్టేట్లు ఉండకూడదు. పిల్లవానికి క్రమశిక్షణ కలగవలెనని తల్లితండ్రులు పిల్లలను గురుకులములకు పంపుతున్నాడు. పిల్లవాడు ఆచార్యుని ఆజ్ఞనూ, ఇచ్ఛనూ పాటిస్తూ వినయవిధేయతలతో చదువుకోవాలి. గురువుకూడా పిల్లవానిని బెదరించడమో భయపెట్టడమో చేయకూడదు. మన పురాణములు, ఉపనిషత్తులు గురుశిష్యుల మధ్య ఎట్టి గౌరవ ప్రేమసంబంధముండెడివో తెలుపుతాయి.

హితభాషణలతో గురువు శిష్యుడికి విద్యాదానం చేస్తూ అతనిని వృద్ధిలోనికి తీసుకొని రావాలి. గురువు శిష్యుణ్ణి - సామ్య! అని వాత్సల్యంగా పిలిచేవారు. గౌతమస్మృతి ప్రకారం పిల్లలను ఆచార్యుడు కొట్టరాదు. అట్లా కొట్టవలసివస్తే చిన్న బెత్తముతోనో, త్రాటితోనో కొట్టవలెనేకానీ, చింతబెత్తముకానీ కొరడాగానీ వాడరాదు. వీపు మీద కొట్టవలెనేకానీ ఇతర అంగములపై కాదు. శిరస్సు నిషేధము. మనుస్మృతి ఇట్లు చెబుతున్నది. ఈ శిక్ష శిష్యుని చదువరిగనూ, శీలవంతుడుగనూ చేయుటకే ఉద్దేశింపడబినదని.

48. శిష్యుని లక్షణములు

విద్యాభ్యాసకాలములో విద్యార్ధి బ్రహ్మ చర్మమనుష్ఠించవలెను. మనువు దీనిని ఇంద్రియసంయమనమని చెప్పును. విద్యాభ్యాస లక్ష్యము వేదార్ధములను తెలుసుకోవటమేకాదు, ఆత్మోద్ధరణముకూడా. అందులకూ విద్యాభ్యాసము వ్రతమనీ, తపస్సనీ ఎన్నబడుచున్నది.

విద్యార్థియొక్క దినచర్య సంధ్యావందనము, సమిధాదానము, పూజకుపుష్ఫములు చేకూర్చుట మొదలైనవి. విద్యార్థి వినయముగా ప్రవచనము చేయవలసినదని గురువును కోరవలెను. ఇవన్నీ శిష్య ధర్మములు. స్వాధ్యాయ ప్రవచనముల విషయములలో ప్రమాదముండరాదని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తున్నది.

49. ఆరోగ్యాభివృద్ధి

విద్యాశీలములతో బాటు విద్యార్ధి ఆరోగ్యముగా వుండడానికి తగిన నియమములు ఏర్పడినవి. ప్రాతఃకాలమున నిద్ర మేల్కొనుట, చల్లనీళ్ళస్నానం, ప్రాణాయామము, సూర్యనమస్కారములు మొదలగునవి బుద్ధి చురుకుదనము, ఆరోగ్యము, హృదయనైర్మల్యమునకు తోడ్పడే అంశములు. గురువుకై శిష్యుడు సమిధలు సేకరించుటలో, దేహారోగ్యమేకాక వినయ విధేయతలు కూడ ఏర్పడుచున్నవి.

50. ఉపనిషత్తులలోని కధలు

గురుకులములను నడిపే ఆచార్యులు అందరూ మహూదారులై సతతము శిష్యహితార్ధము పాటుపడేవారు. తన్ను ఆశ్రయించిన శిష్యునికి తనకు తెలిసినదంతయూ చెప్పేవారు. వారికి ధనాశ##లేదు. ప్రతిఫలము కొరకు వారు ఎప్పుడూ ఎదురు చూడలేదు. ప్రవాహణుడు, ''భగవన్‌ గౌతమ! నీవుకోరిన వస్తువులను నేను ఇచ్చెదను ఏమికావలయునో కోరుకోవచ్చును'' అని చెప్పగా గౌతముడు, ''నాకు ఐహిక విషయములు ఏవీ అక్కరలేదు'' నాకు తెలియని విద్య నీకు తెలుసు దానిని నాకిస్తేచాలు'' అని బదులు చెప్పుతున్నాడు,. ప్రవహణుడు క్షత్రియుడు. రాజు గౌతముడు బ్రాహ్మణ ఋషి, బ్రాహ్మణుడైన గౌతముడు తక్కువ జాతికి చెందిన క్షత్రియుని వద్ద విద్య నర్ధించుతకు వెనుదీయలేదు. వారి వినయము అటువంటిది. ఆ కాలపు బ్రాహ్మణులకు విద్యావిషయములో దురభిమానములేదు. నిండిన కుండ తొణకదు.

గౌతముని కుమారుడు శ్వేత కేతువు కొంచెము గర్విష్ఠి. పుత్రుణ్ణి పరీక్ష చేయుటకు ఆయన కొన్ని ప్రశ్నలడుగుతాడు. శ్వేతకేతువు అహంకారం అణగిన పిదప అతనికి జీవబ్రహ్మ అభేదమును చెప్పే మహావాక్యోపదేశం చేసినాడు.

ఈ కధ తర్వాత వస్తుంది. దానికి మునుపు, శ్వేతకేతు ప్రవాహణుని వద్దకు వెళతాడు. రాజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక శ్వేత కేతువుకు కోపం వస్తుంది. తండ్రివద్దకు వెళ్ళి, ఈ రోజు ఒక రాజన్యబంధువు వేసిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేకపోయాను. నాకెందుకు మీరా విషయములను తెలుపలేదు' అని ప్రశ్నిస్తాడు. తండ్రి ''ఈ విషయములు నాకూ తెలియవు వానిని నేను ప్రవహణుని అభ్యర్ధించి నేర్చుకోవాలి''. అని ప్రవహణుని వద్దకు వెళ్ళినాడు. మరొకమారు కొందరు గౌతముని వద్దకు వచ్చి, 'వైశ్వానర ఆత్మను' గూర్చి మాకు విశదీకరించండి అని అడుగుతారు. ఆయన వినయంగా - నాకు తెలియదు. మీరు కేకయ రాజైన అశ్వపతివద్దకు వెళితే ఆయన మీకు తెలియ చెప్పగలడు - అని బదులిస్తాడు.

ఇదే విధంగా ప్రశ్నోపనిషత్తులో మరొక కధ వున్నది. ఐదుగురు పరబ్రహ్మాన్వేషకులు, బ్రహ్మపరులు, బ్రహ్మనిష్ఠులు, ఐనప్పటికీ సమిత్పాణులై పిప్పలాదుని వద్దకు వెళ్ళారు. మీరు తపస్సుతో, బ్రహ్మచర్యంతో ఒక సంవత్సరం శ్రద్ధగా గడిపి పిదప నావద్దకు రండి. మీరు కోరిన ప్రశ్నలు - యధాకామం - అడగవచ్చును. నేను బదులు చెప్తాను - అని వారితో అంటారు. పృచ్ఛకుల వినయమూ, ఓపికా పరీక్ష చేయడానికే ఒక్క సంవత్సర కాల నియమం. ఒక గురువును ఆశ్రయించిన పిదప, అతడేమి చెబితే అది మన మంచికే అని గ్రహించవలెను. దీనినే శ్రద్ధ అని అంటారు.

51. పరిప్రశ్న, శ్రద్ధ

గీత నాలుగవ అధ్యాయంలో భగవంతుడు

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా - నీవు జ్ఞానులను ఆశ్రయించి, వారికి ప్రణిపాతం చేసి పరిప్రశ్న చేసి జ్ఞానాన్ని తెలుపుకోవాలి అని అర్జునుని ఆదేశిస్తున్నాడు. అదే అధ్యాయంలో శ్రధ్ధావాన్‌ లభ##తేజ్ఞానం' శ్రధ్ధ కలవానికే జ్ఞానం లభిస్తుంది అనీ అంటున్నాడు. ప్రశ్నలువేసి తెలుసుకొంటేనే మనం విషయగ్రహణం చేయగలం. మరి పరిప్రశ్న ఏమిటి? పరిప్రశ్న అంటే లోతుగా క్షుణ్ణంగా ప్రశ్నలు వేసి తెలుసుకోవటం. ఈ పరిప్రశ్న ప్రయోజనం జ్ఞానార్జనగా వుండాలి. ఈ కాలంలో వలె గురువుకు ఈ విషయం తెలుసునా, తెలియదా అని అడిగి అతనిని అవమానం చేసేటట్లు వుండరాదు. పరిప్రశ్నతోబాటు కృష్ణపరమాత్మ అధికంగా రెండుపదాలు వాడి వున్నాడు. అది ప్రణిపాతము, సేవ ప్రణిపాతం అంటే గరువుకు సాష్టాంగ పడి నమస్కారం చేయటం. నమస్కారం వినయాన్ని గౌరవాన్ని తెలుపుతుంది. నమస్కారమేకాదు. గురుసేవ కూడా చేయాలి. ఇవన్నీ శిష్యునికి శ్రద్ధ కలిగించడానికే. అట్టి శ్రద్ధ ఏర్పడితే కానీ జ్ఞానం లభించదు.

అట్టి శ్రద్ధ గురుకులములలోని ఆచార్యులయందే వీలు ఔతుంది. గురువుతో ఉంటూ, అతని గుణగణములు, శీలసంపదా శిష్యుడు తనకు ఒరవడిగా పెట్టుకుంటాడు. ఈ కాలపు బళ్ళలో ఒక్కొక్క సబ్జెక్టుకూ ఒక్కొక్క టీచరు. వాళ్ళు కొన్ని నోట్సులను బట్టీపట్టి విషయం తెలిసినట్టు నటిస్తారు. ఉపనిషత్తుల కాలం నాటి గురువులు అట్లాకాదు. వాళ్ళు ఎపుడూ, ''నాకు తెలిసినంతవరకు నేను చెబుతాను'' అనేవారు. వినయమున్నవాడే శిష్యుడు. గురువు వినయమునకు ప్రతిరూపంగా వుంటేనే, శిష్యుడూ ఆయన అడుగు జాడలలో నడుస్తూ వినమ్రుడుగా వుండగలడు.

గురుశిష్యులు పూర్వకాలంలో ఒక్కకుటుంబానికి చెందిన వాళ్ళవలె మెలిగేవారు. ఒకరి మధ్య మరొకరికి రహస్యాలు లేవు. వారి బాంధవ్యం హార్దికం. తనకున్న విద్యా సంపద మొత్తం శిష్యునికి గురువు అందచేసేవాడు. ఈ రోజులలో శిష్యుడు తన్ను ఎక్కడ మించిపోతాడో అని గురువు భయపడుతున్నాడని వింటున్నాము. గురు కులాలలో వుండిన ప్రేమ, విశ్వాసం, ఈ కాలనూ విద్యాసంస్థలలో అరుదు.

52. గురుపత్ని

సత్యకామజాబాలుడు గురుకులమును నడుపుతున్నపుడు ఆయన వద్ద ఉపకోశలుడు అనే ఒక శిష్యుడండేవాడు. ఆయన పన్నెండేళ్ళు తన శిష్యులకు అధ్యాపన చేయించినా ఉపకోసలునికి మాత్రం శాస్త్రాలు చెప్పక, వేదాధ్యయనమూ చేయించక పండ్రెండేళ్ళ కాలం తన అగ్నులను సంరక్షంచవలసినదని ఆదేశించాడు. ఇతరులకు ఇది భేదదృష్టిగా కనపడినా, శిష్యుడు మాత్రం మారుపలకలేదు. గుర్వాజ్ఞ ప్రకారం ఏ విద్యాభ్యాసమూ లేక, అగ్ని రక్షణ మాత్రమే చేస్తూ నిశ్చింతగా ఉండిపోయాడు.

ఇతర శిష్యులు సంవర్తనం పూర్తి చేసుకొని తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. సంవర్తనం పూర్తికాగానే శిష్యుడు గృహస్థశ్రమ ధర్మం స్వీకరించవచ్చును. ఉపకోసలుడు మాత్రం గుర్వాశ్రమంలోనే వున్నాడు. అందరికీ ఈ శిష్యుని పట్ల గురువు అవజ్ఞ చేస్తున్నట్లు కనిపించేది.

జరుగుతున్నదాంతా చూస్తున్న గురుపత్నికి, తనభర్త చర్య అర్ధంకాలేదు. ఆమె ఓపిక నశించింది. ''ఈ ఆబ్బాయి బ్రహ్మచర్యం అనుష్ఠిస్తూ తీవ్ర తపశ్చర్యంలో ఇన్ని ఏండ్లకాలం అగ్నులను సంరక్షించాడు. కానీ మీరు ఇతనికి ఒక్క రోజు ఐనా ఒక్క అక్షరం చెప్పినది నేను చూడలేదు. మీకు ఈ అగ్నుల శాపనార్ధాలు అక్కర లేదనుకొంటే ఈ క్షణం నుంచైనా ఈ అబ్బాయికి కొంచెం విద్యాదానం చేయండి''. అని తన భర్తతో ఉపకోసలుని గూర్చి దెబ్బలాడింది.

ఈ పోట్లాట వల్ల గురువు కంటె గురుపత్నికి శిష్యుని పట్ల శ్రధ్ధావాత్సల్యాలు ఉన్నవని తెలుస్తున్నది. ఇల్లు విడచి దూరంగా వచ్చిన శిష్యులకు ఆమె ఒక మాతృస్థానంలో వుండేదన్నమాట.

'నీవు అగ్నిశాపానికి గురిఔతావు' అన్నమాట, ఊకదంపుడు మాటకాదు. ఋషి, వాటికంలో ప్రజ్వరిల్లే అగ్నులు, ధర్మానికి ప్రతీకములు. అవి ధర్మలోపం జరిగినా, ధర్మచ్యుతినైనా చూచి ఊరకుండవు. అందుచేత సత్యకాముని పత్ని తన పతియొక్క ధర్మభంగాన్ని చూచి భయపడ్డది. రెండవది సత్యకాముని ఆశ్రమంలో ఉన్న అగ్నిహూత్రం వట్టి అగ్నికాదు, సాక్షాత్తు అగ్ని దేవతలే అందున్నారు. ఈ విషయం కధలో తరువాత విశదమౌతుంది.

సత్యకాముడు భార్యమాట చెవిని వేసుకోలేదు. యధాప్రకారం తనదారినే ఆయన నడిచాడు. అతడు ఉపకోసలుని మరింత పరీక్ష చేయాలనుకొన్నాడు కాబోలు. శిష్యుడు తన గొడవను మరచి, ''అయ్యో, గురుపత్ని మాట గురువు వినలేదుకదా! ఇదంతా నా వలనేకదా''! అని మనసులో బాధపడ్డాడు. ఈ విచారంలో అతడు భోజనం మానేసినాడు. గురుపత్ని 'నాయనా నీవెందుకు ఆహారం తీసుకోవడంలేదు? అని అడిగింది. శిష్యుడు అన్నాడు; ''నాకు మనసు సరిగాలేదు. ఆహారం తినాలని అనిపించటం లేదు.

అప్పుడు అగ్నులు ఈ విధంగా అనుకొన్నారు. ''ఈ ఉపకోసలుడు ఇన్ని రోజులు మన పరిచర్య చేసి ఇపుడు ఆహారం కూడా తీసుకోవటం లేదు. ఇంక ఆలస్యం చేయరాదు. ఇతనికి మనమే ఉపదేశమివ్వాలి''. త్రేతాగ్నులు మువ్వురూ, మొదట ఉమ్మడిగానూ, పిదప ప్రత్యేకంగానూ ఉపకోసలునికి, అగ్ని విద్యా, ఆత్మ విద్యా బోధించారు.

అగ్నులు ఉపకోసలునికి పూర్తిగా ఉపదేశం చేయలేదు. అట్లు చేసి వుంటే అతనికి గురువు ఆవశ్యకత లేదని అర్ధం ఔతుంది. గురువే యొక్క ఆధిక్యతకు కొఱత కలుగరాదని వారు బోధించారు. అందుచేత వేదాంతపరమైన భాగం మాత్రం అతనికి బోధించి, ''నాయనా! దీనికి పిదప నీకు ఆత్మానుభూతికి కావలసిన విధానాన్ని, క్రియను నీ ఆచార్యుడే ఉపదేశిస్తాడు. అని అనుగ్రహించారు.

ఆచార్యుడు ఇంటికిరాగానే ''ఉపకోసలా'' అని పిలిచాడు. శిష్యుడు 'భగవన్‌' అని గురువు ముందు నిలుచున్నాడు. ఇంత తీవ్రంగా శిష్యుని పరీక్షిస్తున్నా గురువుకు శిష్యుని యందు వాత్సల్యంగానీ, శిష్యునికి గురువు యందు భక్తిగానీ సడలలేదు.

గురువు శిష్యుని ముఖం చూచినపుడు - అతడు మహాతేజస్విగా కనబడగా, ''నాయనా! నీకెవరు ఉపదేశించారు?'' అని శిష్యుణ్ణి అడిగాడు. ఉపకోసలుడు భయపడ్డాడు. గురువే లేనపుడు తాను ఇతరులనుంచీ ఉపదేశం గ్రహించిన విషయం చెప్పవచ్చునా కూడదా అనే సందిగ్ధంలో పడిపోయాడు. గురువువద్ద తాను జరిగినది దాచకూడదు. ఐననూ, జరిగినదంతా పూసగ్రుచ్చి చెప్పుటకూడా అతనికి సమంజసముగా కనబడలేదు. అందుచేత, అతడు వివేకంగా బదులిచ్చారు.

''ఈ అగ్నులు తప్ప నాకెవరు వేరే ఉపదేశం ఇవ్వగలరు? కానీ ఈ అగ్నులు అప్పుడు ఇప్పుడున్న రీతిలో లేరు. వేరే విధంగా కనబడ్డారు''

సత్యకాముడు విషయం తెలుసుకొన్నాడు. ఉపకోసలుడు చివర పరీక్షలోకూడా నెగ్గినాడు. తాను శిష్యున్ని అవజ్ఞ చేస్తూ చేస్తూ పోగా చివరకు అగ్నులే అతనికి ఉపదేశ మివ్వవలసిన స్థితి ఏర్పడినదని సత్యకాముడు గ్రహించాడు. సత్యకాముడూ తన గురువు వద్ద ఇంచుమించు ఇదే విధంగా పరీక్షింపబడ్డాడు. ఆ కధలో సత్యకామునికి హారిద్ర మహాఋషి ఉపనయనం చేసాడు. ఒకరోజు శిష్యుణ్ణి పిలిచి నాలుగ వందల గోవులనిచ్చి తోలుకొని పోయి మేపమన్నాడు. అవి బలంలేని కృశించిన గోవులు. వానిని తోలుకొని వెళ్ళుతూ సత్యకాముడు ఇవి వేయిగోవులు అయిన పిదప కానీ నేను మరలిరాను అని సంకల్పించుకొన్నాడు.

అవి వేయి గోవులవటానికి కొన్ని సంవత్సరాలయినవి. వానిని తోలుకొని గురుకులానికి మరలి వస్తున్నపుడు ఆ మందలో వున్న వృషభం ఒకటి సత్యకామునికి ఉపదేశం చేసింది. మరుసటి రోజు అగ్ని ఉపదేశించాడు. మూడోరోజు హంస, నాలుగోరోజు మద్గు అనే నీటి పక్షి ఉపదేశించినవి. ఈ ఉపదేశములు గ్రహించినంతనే సత్యకాముడు ఇప్పటి ఉపకోసలుని వలె తేజస్వి అయ్యాడు.

సత్యకాముణ్ణి హారిద్రుడు చూడగానే, బ్రహ్మవిదివవై సోమ్యభాసికోనుత్వానుశాసేతి - ''నీవు బ్రహ్మ వేత్తవలె ప్రకాశిస్తున్నావు. నీవు ఎవరివద్ద ఉపదేశంపొందావు'' అని అడిగాడు. ఉపకోసలుని వలెనే సత్యకాముడూ చాతుర్యంగా జవాబిచ్చాడు.'' నాకు మనుష్యులెవరూ ఉపదేశించలేదు''. సత్యకాముడు హారిద్రునే గురువుగా వరించాడు.

ఈ కధలన్నీ ఆచార్యుడెంత అవసరమో మనకు తెలుపుతున్నాయి. ఆచార్యుని ముఖతః వచ్చిన ఉపదేశ##మే ఫలవంతం కాగలదు. ఆ విషయం తాను గురువుకు చెప్పటం వాచాలత్వం. అందుచేత సత్యకాముడన్నాడు; ''నేను తమ వంటి గొప్ప వారి వద్ద విన్నదేమిటి అంటే, గురువు వద్ద ప్రత్యక్షంగా నేర్చుకొన్న విద్య ఒక్కటే ఫలవంతం ఔతుంది అని.''

ఇట్టి ఉదాత్తమైన గురుశిష్య సంబంధం ఉపనిషత్తులలో మనం చూస్తున్నా. శిష్యుడైన సత్యకాముని కధ నుంచి గురువైన సత్యకాముని కధకు వద్దాం.

సత్యకామునికి తెలుసు. తాను స్వయంగా ఉపదేశం ఇవ్వకపోయినా, ఉపకోసలునికి, ఏదేవతలో ఇస్తారని. అల్లా దేవతలు ఉపదేశిస్తే శిష్యుడు ఏవిధంగా నడచుకొంటాడో ఆయన తెలుసుకొనవలెనని కోరినాడు. ''ఉపదేశం లభించినందువల్ల శిష్యుడు గురువు యొక్క అవజ్ఞను సహించనక్కరలేదు. గురువు ఇవ్వకపోతే అనుగ్రహించడానికి దేవతలున్నారు. ఉపకోసలునికి అలాంటి గర్వం ఏదైనా సంకరమించినదా'' అని అతడు పరీక్షింపదలచినాడు.

'నీకు అగ్నులు ఏమి ఉపదేశమిచ్చారు? అని శిష్యుణ్ణి అడుగగా, ఉపకోసలుడు జరిగినదంతా విస్తరంగా చెప్పాడు. సత్యకాముడు శిష్యుణ్ణి హార్దికంగా దీవించి, అగ్నులిచ్చిన అసంపూర్ణమైన ఉపదేశాన్ని పూర్తిచేయగా శిష్యుడు తన జీవితం ధన్యమైనదని భావించాడు.

53. శిష్యుని స్వోపజ్ఞతకు చేయూత

ఆ కాలపు గురువులు శిష్యులకు ఎట్టి ఉపదేశం చేయాలో తెలిసినవారు. క్రమంగా ఒక్కొక్క మెట్టుగా వారు శిష్యుణ్ణి విద్యలో పైకి తీసుకొని వెళ్ళేవారు. భృగువు తండ్రియైన వరుణుని వద్ద ఉపదేశం పొందాడు. మొదట ఆయన అన్నమయకోశ##మే సత్యమని భావించాడు. తర్వాత వరుణుడు కుబేరుని తపస్సు చేయమన్నాడు. తపస్సు చేయగా అన్నమయకోశము, సత్యంకాదనీ ప్రాణమయకోశ##మే సత్యమని భావించాడు. మరికొంతకాలం తపస్సు చేయగా చేయగా, ప్రాణమయకోశం సత్యం కాదనీ, మనోమయకోశం సత్యమని అనుకొన్నాడు. దాని పిదప కొంతకాలానికి మనోమయకోశం వదలి విజ్ఞానమయకోశం సత్యమనీ, కట్టకడపట విజ్ఞానమయకోశమూ సత్యము కాదనీ ఆనందమయకోశ##మే అంతిమ సత్యమనీ అదే ఆత్మ అనీ తెలుసుకొన్నాడు.

యజ్ఞయాగాదులలో శిష్యులను నియోగించుటచేత వారు ఆ విషయములను స్వయంగా గ్రహించడానికి అవకాశములుండేవి. తల్లితండ్రులను చూచి వారి సంతతి వృత్తి విద్యను గ్రహించేవారు. స్వయంగా తమ బుద్ధిని ఉపయోగించి విషయ గ్రహణ చేయడానికి అవకాశముండేది. ఈ కాలంలో విద్యార్థులు పుస్తకాలను చదవి వల్లె వేయటం తప్పితే స్వయంగా ఆలోచన చేయడంలేదు. భృగువు కధ వలన అతడు స్వయంగా విషయగ్రహణ చేశాడని విశదమౌతున్నది. సత్యం అతనికి అనుభూతిలోనికి వచ్చింది. వరుణుడు భృగువుకు గరువేకాదు. తండ్రికూడా.

ఒక గురువు శిష్యునికి ఉపదేశించి, తపస్సు చేస్తూ, ఉపదేశింపబడిన విషయం గుర్చి ఆలోచించమని ఆదేశించి, అతడట్లు చేసి తిరిగి వచ్చినపుడు నీవు ఉపదేశాన్ని ఏ విధంగా అర్ధం చేసుకొన్నావని అడుగుతాడు.

ఇక్కడ ఛాందోగ్యంలో మరొక కధ వున్నది. విరోచనుడనే అసురుడొకడుండే వాడు. శరీరమును మించిన సత్యం లేదని అతని భావం. ప్రజాపతి అతనిని కూడా తత్వ విచారణ చేయమంటాడు. అతడు విచారించి దేహమే సత్యమన్న అసాధునిర్ణయానికి వచ్చినా, అతడు తత్త్వవిచారణ చేశాడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఏమీచేయని ఆలోచించని ఈనాటి సోమరులవలె కాక, విరోచనుడు తత్త్వవిచారణ చేశాడు. పూర్వకాలం గురువు ఎటువంటి శిష్యులైనా పరిత్యాగం చేసేవారు కాదు. వారున్న స్థితినుంచే వారిని క్రమంగా ఉద్ధరించేవారు. దీనికి ఉదాహరణ విరోచనుడే.

శిష్యుని స్వీకరించిన పిదప - అతడు నిష్ప్రయోజకుడైనా సరే - అతనిని ఏదో ఒక కార్యంలో నియోగించి అతనికి జీవితంలో నియమం ఎంత ముఖ్యమైనదో బోధించేవారు. అపసురుడైనా, విరోచనుడు ప్రజాపతి ఆజ్ఞానుసారం ముప్పదిరెండు ఏళ్ళు బ్రహ్మచర్య దీక్ష వహించి తత్త్వానుసంధానం చేసాడు.

విరోచనుని వలెనే దేవతలకు రాజు, ఇంద్రుడూ ప్రజాపతి శిష్యుడే. అతడూ సత్యమేమో తెలుసుకోవాలని కోరాడు. కాని విరోచనుని వలె దేహమే సత్యమన్న మెట్టులోనే ఇంద్రుడు నిలిచిపోలేదు. ఇంద్రియ సుఖాలలో అతనికి పూర్ణత లభించకపోగా మళ్ళా ప్రజాపతి వద్దకు వస్తాడు. ప్రజాపతి ఇంద్రుణ్ణి తన ఆశ్రమంలో వుండమనీ, ముప్పది రెండు ఏళ్ళు బ్రహ్మచర్యం అనుష్ఠించమనీ చెబుతాడు. ఇంద్రుడు దేవతలకు రాజు కావచ్చును. శిష్యుడు అయినప్పుడు అతనికీ నియమపాలనం తప్పదు. ఇంద్రుడు నూట ఒక్క సంవత్సరములు పూర్తి చేసిన పిదప అతనికి ప్రజాపతి ఆత్మ తత్త్వాన్ని ఉపదేశిస్తాడు. శిష్యుని ఇట్లు ప్రత్యేకమైన శిక్షణ లభించటం కష్టం. ఈ కాలపు విద్యార్ధులు అలాంటి కఠిననియమ పాలన చేయడమూ అసాధ్యమే. పూర్వకాలపు శిష్యులు గురువు ఎదురు తిరిగేవారు కాదు. వారు గరువులందు, భక్తిశ్రద్ధలు ఉంచి గురువు చెప్పినది తమ మంచికే అని భావించేవారు.

ఉత్తమ పురుషుడెవరు? అనవద్యమైన జీవితమూ, తపస్సూ వైరాగ్యం కలవాడైతే చాలునా? అట్టివారి ఎడ, మర్యాదా, భక్తి శిష్యులకు కలుగుతుందే కానీ అతని వద్దనే వుండాలన్న ఆకర్షణ కలుగకపోవచ్చు. అన్ని యోగ్యతలూ కల్గి వానితో బాటు ప్రేమ, దయ ఉంటేనే గురువని అనిపించుకొనగలడు. అనురాగమూ అనుగ్రహమూ, ఈ రెండే ఉత్తమపురుష లక్షణములలో ముఖ్యమైనవి. ప్రేమ పరిపూర్ణమైనపుడు ఒక మనిషికి విభూతులు సిద్ధిస్తాయి. ఆ విభూతులే అనుగ్రహశక్తిగా మారతాయి.

54. కృష్ణుడు - సాందీపుడు

మన పూర్వాచార్యులందరూ ప్రేమమయమూర్తులూ, అనుగ్రహప్రదాతలూ అని మన పురాణములు వ్రాస్తున్నవి. వారందరూ ఆదర్శ పురుషులు. గురుశిష్యుల మధ్య ప్రేమ బాంధవ్యముండేది. శాంతి పాఠంలో గురుశిష్యులిరువురూ మనం సహచరులముగనూ, సహభోక్తలముగనూ వుందుముకాక అని ప్రార్ధిస్తారు. అంతేకాదు 'మావిద్విషావహై' - మనము పరస్పరము ద్వేషించకుందుముగాక అని కూడ ప్రార్ధన చేస్తారు. కొన్ని సందర్భములలో గురువు కఠినంగా వుండటమూ శిష్యుని శ్రేయోభిలాష కారణంగానే. శిక్షించిన వెంటనే వారు అనుగ్రహమూ చేసేవారు. ఈ విషయం మనం భాగవతం చదివేటపుడు అవగతం ఔతుంది.

గురుకులంలో జరిగిన ఉదంతాన్ని కృష్ణ పరమాత్మ సుదామునికి జ్ఞాపకం చేస్తాడు. కంసవధ కాగానే కృష్ణునికి ఉపనయన విధి పూర్తి ఔతుంది. సాందీపుని ఆశ్రమానికి కృష్ణుడు బలరాముడూ విద్యాభ్యాసం కొఱకు వస్తారు. కృష్ణుడు సర్వజ్ఞుడు. కాని లోకానికి ఆదర్శంగా వుండాలని ఆయన సాందీపుని వద్ద శిష్యరికం చేస్తాడు. ఆయన అవతార పురుషుడు. అందుచే సాధారణంగా గురుకుల వాసంలో ఇతర శిష్యులు చదివేటట్లు ఆయన పండ్రెండు ఏండ్లు చదవలేదు. రోజుకు ఒక్కకళ చొప్పున 64 రోజులలో చతుష్షష్ఠకళలు ఆయనకు కరతలామలకములైనవి. బలరాముడూ అవతార పురుషుడే కనుక ఆయనా అరువదినాలుగు కళలు అన్ని రోజులలోనే ఔపాసన పట్టాడు.

సాందీపునికి ఈ కారణం చేత కృష్ణుని అవతార మర్మం తెలిసిపోయింది. విద్యభ్యాసం పూర్తి కాగానే కృష్ణుడు గురువు వద్ద ''మీకు నన్నేమి దక్షిణ ఇవ్వమంటారు? అని అడిగాడు. ఎన్నో ఏండ్లక్రితం సముద్రంలో కొట్టుకొని పోయి చనిపోయిన తన పుత్రుణ్ణి యమాలయం నుంచి తీసుకొని వచ్చి ఇవ్వమంటాడు. ఆయన అడిగిన గురుదక్షిణ ఇది.

సాందీపునికి కృష్ణుని అవతారమర్మము తెలిసినా, అతడు శిష్యునిగా తన వద్దకు వచ్చాడు. అతనిని శిష్యుడిగానే చూడాలి. ఆశ్రమంలో ఇతర శిష్యులవలె అతడూ పరిచరించాలి. ఆ వినయం రావడానికి కృష్ణుణ్ణి ఇతర శిష్యుల వలెనే సాందీపుడు చూడ సాగినాడు. కృష్ణుడు శిశువులలో శిశువు. వట్టి శిశువుకాదు. ప్రేమైకనిధానము. పండితులలో పండితుడు. ఆశ్రమంలో వున్నపుడు తక్కిన శిష్యులవలె ఇంధనముల కొఱకు అతడూ అడవులకు వెళ్ళేవాడు. ఈ ఉదంతమునే సుదామునికి కృష్ణుడు జ్ఞప్తి చేస్తాడు.

ఒకరోజు కృష్ణుడూ, కుచేలుడూ, అడవులకు వెళ్ళారు. చీకటి పడింది. జడివాన కురిసింది. ఎంతవాన అంటే మిట్ట పల్లములు తెలియలేదు. అంతా జలమయమయినది. త్రోవ తప్పారు. అవతారపురుషుడు త్రోవ తప్పటమేమిటి? అదీ ఒక లీలే! మధురాధిపతే రఖిలం మధురం. ''మనమెంత భయపడ్డామో నీకు జ్ఞాపకవుందా? మనం ఒకరిచేతులు ఒకరు పట్టుకొని, ఆ చీకట్లో చుట్టి చుట్టి తిరుగుతూ ఎంత వ్యసన పడ్డాము? నీకు ఆ సంగతి గుర్తు ఉన్నదా?

సాందీప మహర్షి మనం రాలేదని ఎంతో గాబరాపడిపోయారు. మనలను వెతుక్కుంటూ ఆయన అడవుల్లోకి వచ్చారు. సూర్యొదయానంతరమే మనం ఆయనకు కనబడ్డాం. మనలను చూడగానే ఆయనకు ఎంత జాలివేసింది? నాయనలారా! నాకోసం మీరెంత కష్టానికి గురి అయ్యారు?'' అని ఆయన వాపోయాడు. మనం కష్టపడ్డామని మనలను ఆయన ఎంతగా అనుగ్రహించారు?

తుష్టోహం వోద్విజశ్రేష్ఠాస్సత్యాస్సన్తు మనోరధాః ఛన్దాం స్యయాతయామాని భవన్త్విహ పరత్రచ - (భాగవతం)

మీ ఇరువురి ఎడ నేనెంతో సంతుష్టుణ్ణయ్యాను. మీ మనోరధాలన్నీ సిద్ధించుకాక. నావద్ద మీరు అధ్యయనం చేసిన వేదాలన్నీ ఫలించి మీకు ఐహికాముష్మికసిధ్ధి కలుగ చేయుగాక - అని మనలను దీవించారు'' - ఈ విధంగా కృష్ణుడు సుదామునితో ఆప్యాయంగా పాతసంగతులు స్మరించాడు.

గురువు విద్వాంసుడే కాదు. అతడు సచ్ఛీలవంతుడూ, అనుష్ఠానపరుడూ, తపస్వీ అయి ఆత్మసంపద కలగి వుండేవాడు. గురుకులంలో వున్నంత వఱకూ గురువూ శిష్యుడూ అనవాద్యమైన జీవితాలను గడపవలెనన్నమాట. ఆ ఉద్దేశంతోనే గురుకులాలు ఏర్పడ్డాయి.

శిష్యుల భక్తీ ప్రేమా గురువు చూరగొనవలెనంటే అతడు నిష్ఠపరుడు, శీలవంతుడు, తపస్విగా వుండవలె. అతనికి అసామాన్యమైన మేధా, విద్వత్తూ కూడా వుండాలి. అంతేకాదు, అతనికి అనుగ్రహశక్తి వుండాలి. అటువంటి గురువు వద్దకే శిష్యులు తండోపతండములుగా రాగలరు. అట్టి గురువు నిరంతర శాస్త్రమధనం చేస్తే కానీ శిష్యుల పరిప్రశ్నలకు ఉత్తరం చెప్పగల సామర్ధ్యం కలుగదు.

55. పరిప్రశ్న మూలకంగా జ్ఞానపార్జన

జ్ఞానార్జనకు పరిప్రశ్న అత్యవపరం. శిష్యులు పరిప్రశ్న పరంపరకు గురువులను పాత్రులను చేయడం ఉపనిషత్తులలో మనం చూడగలం. గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి ఎన్నో ప్రశ్నలడుగుతాడు. ప్రశ్న పరిప్రశ్న-శిష్యునికి విషయ గ్రహణంలో వున్న ఆసక్తీ శ్రధ్దా చూపుతుంది. పరిప్రశ్నల కాలంలో గురువు యెక్క ధారణ, శాస్త్ర విజ్ఞత అట్లే తెలసిపోతుంది.

పరిప్రశ్నలవల్ల ఒక విషయంలో గురుశిష్యులిద్దరూ మగ్నులై సునిశితంగా పరీక్షంచే అవకాశం ఏర్పడుతుంది. గురువు ఎట్లు శిష్యుణ్ణి, ప్రశ్నిస్తాడో, శిష్యుడూ గురువును ప్రశ్నించాలి. ఈ విధంగా క్రొత్తక్రొత్త కోణాలూ, ధృక్పధాలూ, విషయాలూ బయటకు వప్తాయి. జిడ్డు కృష్ణమూర్తిగారు ఉపన్యాసాలలో ఈ పరిప్రశ్న విధానం అవలంబిస్తారట. ఆ ప్రశ్నోత్తరాలు రసవంతంగా వుంటాయట. మేమూ బాష్యపాఠాలు చెప్పేటపుడూ, వాక్యార్ధాలు వివరించేటపుడూ, శ్రోతలు తెలివిగల ప్రశ్నలు అడిగినపుడు గోష్ఠి అర్ధవంతంగా వుంటుంది. ''ఆ విషయం మాకు తోచలేదు. ఇదేమిటో తెలుసుకోవాలి.'' అన్న ఔత్సుక్యం, శాస్త్రరుచీ కల్గుతుంది.

శంకర భగవత్పాదులూ ఇలాంటి మార్గాన్నే అనుసరిస్తారు. ప్రతిపక్షి చెప్పే విషయాలను పూర్వపక్షంగానూ తన మతాన్నీ నిర్ణయాన్నీ సిద్ధాంతంగానూ ఆయన అవలంబిస్తారు. బృహదారణ్యకు భాష్యంలో వారు తమ ఉపక్రమంలో ఈ విషయం గూర్చి ఇలా వ్రాస్తారు. ''పరిప్రశ్నల వలన శిష్యుడి అవధానం ఆకట్టబడుతుంది. తర్కశాస్త్రం వలె మనం చెప్పేది సూత్రప్రాయంగా వుంటే అర్ధపుష్టినష్టమై సూక్ష్మవిషయములు అనవగాహము లౌతాయి''.

కొందరికి శాస్త్రం చక్కగా తెలిసినా వక్తృత్వంలేని కారణంచేత, విషయాన్ని చెప్పలేకపోతారు. అటువంటివారి వద్ద పరిప్రశ్నల మూలంగా మనం విషయాలు లాగవచ్చును.

మలైకొండర్‌ సొమసుందర ఆచారి అనే ఒక శిల్పి-(వడ్రంగ)-వుండేవారు. ఆయనకు చదువూ, వ్రాత ఏవీ రావు. ఆయన వక్త కాదు. కానీ రధాలను నిర్మించడంలో నిపుణుడు. ఇరువది, ఇరువదైదు ఆలయాలకు ఆయన రధనిర్మాణం చేశాడు. కానీ తన కళగూర్చి ఆయన మాట్లాడలేడు. ఇలయాత్తన్‌ గుడిలో 1962లో జరిగిన ఆగమ శిల్పసదస్సులో, ఆయన మాట్లాడలేకపోతున్నాడే అని కార్యనిర్వాహకుడు గణశన్‌ వ్యధపడ్డాడు. నేను గణశన్‌తో ఇలా అన్నాను. ''నీకు రథాల గూర్చి కొంత సామాన్య జ్ఞానం వుంది. ఆజ్ఞానంతో స్థపతిని నీవు ప్రశ్నలు వేస్తూరా. ఆ స్థపతికి తెలిసిన విషయమంతా బయటపడుతుంది.'' గణశన్‌ ప్రశ్నలు అడుగుతూ వచ్చేసరికి స్థపతి సరియైన ఉత్తరాలను ఇస్తూ వచ్చాడు. రథ నిర్మాణం ఎలా చేస్తారో సదస్సులోని వారికి చక్కగా అర్ధమైంది. స్థపతికి ఒక బంగారు పతకమూ, 'రథచక్రవర్తి' అనే బిరుదూ ఇచ్చారు. పరిప్రశ్న అంటే ఎంత ఉపయుక్తమైన విషయమో చెప్పడానికే ఈ విషయం చెప్పుకొచ్చాను.

56. గురు లక్షణాలు

పరమాత్మ తత్త్వం గూర్చి చెప్పేటపుడు ముండకోపనిషత్తు గురునికుండవలసిన రెండు లక్షణాలను పేర్కొన్నది.

పరీక్ష్యలోకాన్‌ కర్మచాతాన్‌ బ్రాహ్మణో

నిర్వేద మాయాన్నాస్త్య కృతః కృతేన

తద్విజ్ఞానార్ధం సగురుయే నాబి గచ్ఛేత్‌

సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్‌

(ముండకోపనిషత్తు. 1-2-12)

కర్మ ప్రపంచాన్ని పరీక్షించి, నిర్వేదం రాగానే తత్త్వజ్ఞానార్ధం సమిత్పాణివై గురువును ఆశ్రయించు. ఆ గురువు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడూ అయివుండాలి. శ్రోత్రియుడంటే వేదవిదుడు. వేదములు అధ్యయనం చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. అతడు బ్రహ్మనిష్ఠుడై వుండాలి. అతని ఆత్మానుభూతి హృదయంగమముగా వుండవలెను. ప్రేమా, త్యాగం, పరోపకార పరీణత, సత్యశీలత వుంటే కానీ అట్టి ఆత్మానుభూతి ఒకరికి కలిగేది కష్టం. అంటే ఆ రోజులలో ఆచార్యుడు ఈ కాలపు ప్రోఫెసర్ల వలె కాక, ఎన్నో కల్యాణ గుణములు కల్గి శిష్యుని ఆత్మానుభవానికి దోహదంగా వుండే వ్యక్తిత్వం కలవాడని తెలుస్తుంది. వట్టి చదువువుంటే ప్రయోజనం లేదు. వానికి హృదయమూ వుండాలి. అట్టి ఆర్ద్రమైన హృదయంకల గురువే శిష్యుణ్ణి తీర్చిదీద్దగలడు. శిష్యుడూ వినమ్రుడై ఉత్తమ గుణములు కలవాడైతే, ఆ ప్రభావం గురువులో ప్రతిబింబించి అతనిని మరింత ప్రతిభావంతుణ్ణి చేస్తుంది.

57. గురు పీఠములు

నేను చెబుతున్నది విద్యాభ్యాసం చేయించే ఉపాధ్యాయులను గూర్చియేకాదు. ఒక గురుపీఠం అదిష్ఠించి నావలె ఒక గురుపరంపరకు చెందిన వారినీ మనస్సులో ఉంచుకొనే చెప్పుతున్నాను. సంసారారణ్యంలో చిక్కుకొని తపించే ప్రజలకు సక్రమమైన ఈశ్వరాభిముఖమైన దారిని చూపడానికే గురుపీఠాలు ఏర్పడినవి. శిష్యులు శాస్త్రానుష్ఠానాలను నిర్వర్తిస్తేనే, మేమూ ఆచార అనుష్ఠానాలను పరిపాలిస్తూ వారి మన్ననలనూ, మర్యాదనూ పొందగలం.

యతిగా వున్న గురువు మితాహారం తీసుకొంటూ అతి సాధారణమైన వానస్థానంలో వుంటూ, నిరాడంబరమైన వస్త్రధారణ చేస్తూ వుండాలి. చిన్న అశౌచం ఏర్పడినాసరే అతడు స్నానం చేసి ఉపవాపసం చేయాలి. ఆచార అనుష్ఠాన విషయాలలో అతడు ఏమాత్రం అజాగ్రత్తగా వుండరాదు. అట్లా వుంటేగానీ అతడు సిద్ధుడు కాలేడు. సంసారిక జీవితాలలో ఇతరులకు మార్గదర్శకునిగా ఉంటూ ఈశ్శరసాయుజ్యం కలిగించదడానికి అతనికి అప్పుడే సాధ్యమవుతుంది. యతిధర్మం పాటించే విషయంలో ఏవైనా లోపాలుంటే, వానిని మాకు ఇతరులు చూపాలి. యతిధర్మం చక్కగా అనుష్ఠించామంటే దాని కొఱకు మమ్ములను ఇతరులు ప్రశంసించనక్కరలేదు. మా విచారమంతా కఠినమైన యతిధర్మములను మేము సకృత్తుగా పాటిస్తేన్నామా అని. ''మీరు-ఆహా! మీరెంత నియమపాలనతో కష్టపడుతున్నారు? ఎంత త్యాగం చేస్తున్నారు? అని పొగడుతూవస్తే మాకు, ''ఓహూ మనం ఇంత గొప్పవాళ్ళమా?'' అన్న భావన ఏర్పడుతుంది. దానితో ఉన్నదీ ఊడిపోతుంది. ఇపుడు ఏదో అరకొరగా పాటిస్తున్న ఈ కాస్త నియమమూ సడలిపోతుంది. అంతటితో ఇంతకాలమూ దేశానికి ఈ మఠం చేస్తున్న ఉపకారమూ అంతమౌతుంది. మఠమూ మాసిపోతుంది.

శిష్యులూ శిష్ఠాచార పరులైతే గురువును అతని అనుష్ఠాన పరతకొఱకు పొగడవలసిన అవసరమే వుండదు. అటువంటి శిష్యవర్గముండ వలెననే ఆశ. నా వర్తనలో ఏదైనా లోపం వుంటే, ''స్వామీ-మీరు ఈ విధంగా చేయవచ్చునా?'' అని అడిగే శిష్యుడుంటే, గురువులూ గురుపీఠాలు వర్థిల్లడానికి ఎంతో అవకాశముంటుంది.

శిష్యుల గుణగణాలను బట్టి గురువు వుంటాడు అనే విషయం గురుపీఠములకూ వర్తిస్తుంది. ఒక సాధారణ సన్యాసికి తన సంప్రదాయానికి అనువర్తించే జ్ఞానం మాత్రం చాలును. ఐతే తన సంప్రదాయ అనుష్ఠానాలను అధిగమించి భక్తుడుగానో, జ్ఞానిగనో అతడు ఈశ్వర ప్రపత్తిని భజించాలి. కానీ గురుపీఠాలను అధిష్ఠించి వున్న సన్యాసుల విషయం వేరు. శిష్యులకు ఏర్పడే శాస్త్రవిషయక సందేహములకు అతడు జవాబివ్వాలి. విథ్యత్సభలను ఏర్పాటు చేయాలి. ఆ వ్యాసంగములలో అతడు పాల్గొనాలి. ఆచారము, వ్రతములు, అనుష్ఠానములు-వీనిని గూర్చి అతనికి చక్కని విజ్ఞానమూ, జటిలమైన విషయములలో తీర్పుచెప్పగల కౌశల్యమూ వుండాలి.

శాస్త్ర విషయంగా శిష్యులు ప్రశ్నించేకొద్దీ మఠాధిపతులూ శాస్త్రములను ఆలోచన చేసి శాస్త్ర నిష్ణాతులవడానికీ సందేహనివారణ చేయుటలో పాటుపడడానికీ అవకాశం ఏర్పడుతుంది. ప్రశ్నలడిగే శిష్యులుకూ శాస్త్ర పరిజ్ఞానం వుంటే గానీ అడగవలసి ప్రశ్నలు అడగరు. శాస్త్రజ్ఞానమే లేనివాడు ఏప్రశ్నలు అడగగలడు? సందేహము వుంటేనే కదా అతడు గురువునో, మఠాధిపతిలో సందేహ నివారణకు ఆశ్రయించగలడు? ఈ కాలంలో జనులకు శాస్త్రవాసనే లేకపోతున్నది. అందులో హిందువులలో ఈ కొరత మరింత జాస్తి. గురు పీఠముల విజ్ఞానమూ, శిష్యుల శాస్త్ర పరిజ్ఞానమును బట్టి వుంటుంది.

గురుపీఠములూ, శిష్యుల మట్టమునకు రావడము అతిశోచనీయమైన విషయం. ఈ తరం వారికీ, రాబోయే తరంవారికీ, శాస్త్ర రక్షణ చేయవలసిన గురుపీఠములకు, ఎంతటి దుర్గతి? మీరందరూ మీ సామర్ధ్యం కొద్దీ శాస్త్రావలోకనం చేయవలసినవిధి. మీ కోసమూ, మా కోసమూ, ఎంతైనా వున్నది. గురుపీఠములను అధిష్ఠించివున్న వారు శాస్త్ర రక్షణలో జాగరూకులుగా వుండేటట్లు చూడవలసిన విధీ, బాధ్యత మీకు వున్నది. ఈ లక్ష్యాన్ని వుద్దేశించి అయినా మీరు శాస్త్ర పరిశీలన చేయటం ఎంతైనా అవసరం.

మీరందరరూ వచ్చి నన్ను గొప్ప శాస్త్రజ్ఞుడిగ పొగడుతూ వుంటారు. ఒక వైద్యునికి వైద్యమూ, ఇంజనీరుకు, ఇంజనీరింగూ తెలియటం ఏమి గొప్ప? ఒక పీఠాధిపతిగా వుండి నాకు శాస్త్ర విజ్ఞతవుంటే గొప్ప కాదు. లేకుంటేనే అది కీడు.

ఒక శాస్త్ర విషయమేకాదు. నేను నా ప్రసంగాలలో ఇతర విషయములూ, చరిత్ర, శిల్పమూ, భాషా విషయములూ తడుముతుంటాను. నావద్దకు, ఎంతోమంది వస్తుంటారు. వారు వచ్చేది వాళ్ళ సమస్యలను గూర్చి ప్రశ్నించి ఎన్నో విషయాలు తెలుసుకొంటాను. వానినే ఏకరువు పెట్టుతుంటాను. అంతటితో మీరు నన్ను సర్వజ్ఞుడునని భావిస్తున్నారు. ఇదంతా చెప్పడం శిష్యుల విజ్ఞత బట్టి గురువు విజ్ఞత కూడా ఉంటుంది అని అనడానికే.

58. పురాతన కాలంలోని విశ్వవిద్యాలయాలు

తక్షశిల ప్రస్తుతం పాకిస్ఠాన్‌లో వున్నది. బౌద్ధుల కాలంలోనే కాక, ఉపనిషత్తులకాలంలోనూ ఈ ప్రదేశం ప్రసిధ్ధికెక్కినది. అపుడు ఆ ప్రదేశాన్ని గాంధార దేశమనేవారు. మహాభారతంలోని గాంధారి, గాంధార దేశం నుంచీ వచ్చిన రాజకుమారిక. పాండవుల మునిమనుమడు, జనమేజయుడు తక్షశిలలోనే సర్పయాగం చేసాడు. ఋషులకందరికీ మహాభారతము ప్రప్రథమముగా పరిచయము ఈ చోటనే చేయబడినది. తక్షశిలకూ రామాయణానికీ మరింత సంబంధమున్నది. భరతుని కుమారుడైన తక్షకునిపేర, ఈ చోటునకు తక్షశిల అనే పేరు ఏర్పడ్డది. తక్షశిల వేదకాలంనుంచీ వచ్చినది. క్రీ.శ. ఐదవ శతాబ్దంలో పాహియాన్‌ భారతదేశపర్యటనం చేసినపుడు, ఇచ్చట బౌద్ధ విహారములు, చైత్యములు లెక్కలేకుండా వుండెడివి. తర్వాత హూణులు దండెత్తి వచ్చి దీనిని నేలమట్టం చేశారు. రెండు వందల సంవత్పరముల పిదప హ్యూన్‌ సాంగ్‌ వచ్చినపుడు ఈ నగరం శిధిలావస్థలో ఉంది.

బౌద్ధులకు ఈ నగరం విద్యాస్థానంగా వున్నప్పటికీ, ఇచ్చట కేంద్రీయమైన విశ్వవిద్యాలయం ఉండెడిదికాదు. ఇచ్చట, చిన్న చిన్న పాఠశాలలు వేదముతో బాటు పదహారు శాస్త్రములు బోధిస్తూ వుండేవి. చాణక్యుడు విద్యాభ్యాసం చేసినదీ నగరంలోనే.

నలందానగరంలో ఈనాటి విశ్వవిద్యాలయాలవలె పెద్ద విశ్వవిద్యాలయం వుండేది. నలందాలోని శిధిలములనుండి అచ్చట ఉపన్యాసమందిరములు, విద్యార్ధుల వసతి గృహములున్నట్లు తెలియవస్తున్నాయి. నలంద, పూర్వపు మగధలోనూ, ఇప్పటి బీహారులోనూ వుంది. రాజగృహము (రాజగిర్‌)-బుద్దుని జీవితముతో పెనవేసుకొన్న నగరము. పాటలీపుత్రమునకు (పాట్నా) దాపున వుంది. నలంద పాటలీపుత్రమునకు అనతి దూరములో నున్నది. నాగార్జునుడు నలందా నగరమును తన విశ్వవిద్యాలయానికి ఎన్నుకొన్నాడు. నలందా ఐదవ శతాబ్దంలో నరసింహబాలాదిత్యపాలనములన అత్యున్నతస్థతిలో వుండేది. ఇచట బౌద్ధగ్రంథములతో బాటు వేదములను కూడ అభ్యసించేవారు. దాదాపు 10,000 మంది విద్యార్ధులిక్కడ చదివేవారు. వారిలో ఆసియా, యూరపునుండి వచ్చినవారూ ఉన్నారు.

తక్షశిలలో ఇంజనీరింగ్‌, టెక్నికల్‌ సబ్జెక్ట్స్‌ నేర్పబడేవి. కానీ నలందలో అవి లేవు. నలందా విశ్వవిద్యాలయం ఎక్కువ బౌద్ధభిక్షువుల వ్యాప్తికొఱకే ఏర్పడినది. అందుచేత సామాన్య జీవనములకు వలసిన ఇంజనీరింగ్‌, మొదలగు టెక్నికల్‌ విషయములు విద్యార్థులకు నలందలో చెప్పబడలేదు. కానీ నలందలో ఖగోళశాస్త్రములనకు ప్రాముఖ్యత వుండేది. అక్కడ ఒక పెద్ద అబ్సర్వేటరీ - తొమ్మిది అంతస్తుల గ్రంథాలయమూ వుండేవి.

మహమ్మదుగజినీ, మహమ్మదు ఘోరీ మనదేశముపై దండెత్తిన కారణంగా మన సంస్కృతి అల్లకల్లోలమైంది. పదమూడవ శతాబ్దంలో బానిస రాజుల పాలన ప్రారంభ##మైనది. దానితో విశ్వఖ్యాతి గల నలందా విశ్వవిద్యాలయం పూర్తిగా క్షీణించినది. ఎనిమిది శతాబ్దముల కాలము నలంద వర్ధిల్లినదన్న విషయం మనం గర్వపడతగ్గ విషయం.

క్రీ.శ.ఐదవ శతాబ్దంలో గంగాతీరంలో ఒక పర్వత శిఖరంలో పాలరాజులకు చెందిన ధర్మపాలుడు విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. దానికి అనుబంధంగా ఒక బౌద్ధ మఠాలయమూ నిర్మింపబడినది. ఈ నగరానికి టిబెట్‌ నుంచీ విద్యార్థులై బౌద్ధబిక్షువులు వచ్చేవారు. ఒక్కడ నుంచి బౌద్ధమత వ్యాప్తి కోసం టిబెట్‌కు బౌద్ధసన్యాసులు వెళ్ళారు. చాల వఱకు బౌద్ధ గ్రంథములు (తాంత్రిక గ్రంథములు) మనదేశములో అరుదై టిబెట్‌ నుంచీ ఈ కాలములో వానిని సంగ్రహించ వలసి వస్తున్నది. విక్రమశీల, నలందా విశ్వవిద్యాలయములు అభివృద్ధిలోవున్న కాలములో ఈ గ్రంథములు మన దేశంనుండే టిబెట్టుకు పోయినవని ఊహించవలసివస్తుంది.

పురాతనకాలంలో, ఉత్తరంలో కాశీలోనూ, దక్షిణభారతంలో కంచిలోనూ హిందుశాస్త్రాభ్యాసం విస్తారంగా చేసేవారు. గాంధీగారు పుట్టిన ఘార్జర దేశం కధియవార్‌లో వల్లభి ఒక గొప్ప విద్యాస్థానం. విక్రమార్కుని ఉజ్జయిని మరొక ప్రశస్తమైన విద్యాస్థానం. ఉత్తర, దక్షిణ, పడమర దిశలను పేర్కొన్నారు. తూర్పుదిశలో బెంగాలులో నవద్వీపంలోని విద్యాస్థానం ప్రశస్తమైనది. దానిని నాడియా అనేవారు. నాడియాలో హిందుదర్శనములను అభ్యసించేవారు. ముస్లిముల ఔద్ధత్యమునకు క్షీణించిన నలందా తక్షశిలలవలెనే, నాడియా కూడా దుర్గతి పాలైనది. క్రీ.శ.పదునైదవ శతాబ్దంలో నాడియా మళ్ళా తలెత్తింది. తర్కశాస్త్రానికి నాడియా ప్రసిద్ధికెక్కినది.

పైచెప్పిన ప్రదేశాలన్నిటిలోనూ, వైదిక విద్యకు గురుకులాలుండేవి. కానీ అవి ఏ విశ్వవిద్యాలయానికీ చెందినవి కావు. జైన బౌద్ధములకు పూర్వమూ పెద్ద గురుకులములుండేవి. శాస్త్ర చర్చ, నూతన శాస్త్రపర్యవేక్షణ, వేదాంగముల అధ్యయనం, కవిత్వం, నాటకరచన మొదలైనవానిలో పాల్గొనేవారు. అలెగ్జాండర్‌ మనదేశంపై దండెత్తినప్పటినుంచీ, మనదేశానికీ, ఇతర దేశాలకూ సంపర్క మేర్పడి మనదేశంవారు, నూతన విషయములను నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది.

జైన బౌద్ధములు తమ మతవ్యాప్తికోసం తీవ్రంగా ఇతర దేశములకు వెళ్ళేసరికి, మనదేశానికీ ఇతర దేశాలకూ సంపర్కం అధిక మౌతూ వచ్చింది. ఈ కారణంచేత పెద్ద విద్యాస్థానాల అవసరం ఏర్పడింది. చదివే విషయములూ ఎక్కువైనాయి. పాతకాలపు గురుకులవాస విధానం క్రమంగా క్షీణింపనారంభించినది. దీనితోపాటు ఇతర మతాలు మనదేశంపై దుండెత్తినవి. ఆ మత వ్యాప్తికోసం, వారు విద్యాస్థానాలను స్థాపించి, విద్యార్థులకు విద్యార్థి వేతనములు (Scholarships) ఇచ్చేసరికి, ఆ వ్యామోహానికి అనేకులు అట్టి విద్యాస్థానాలకు వెళ్ళడానికి ప్రారంభించారు. దీనికి మన సమాజంలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులూ దోహదం చేశాయి.

59. ప్రత్యేక పరిస్థితులు

ఈ ప్రత్యేక పరిస్థితులు ఏవి?

మన పూర్వులు, బ్రాహ్మణులను అన్ని జాతులవారికీ, వారి వృత్తివిద్యలను నేర్పవలసినదని ఆదేశించారు. అంతేకాదు, వారికి ధర్మబోధ, ఆత్మ విద్యా విషయములూ చెప్పవలసినదని నిర్దేశించారు. కాని వేదములు నాలుగవ వర్ణము వారికి నేరుగా చెప్పబడలేదు. వారికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ప్రత్యేకమైన వృత్తులు ఏర్పడినవి. వైదికవిద్య, వైదికానుష్ఠానములు ఆ జన్మ విధిగ బ్రాహ్మణులకు విధింపబడిన ధర్మము.

గురుకులంలో వేద విద్య బోధించేవారు. ఈ వేద విద్య బోధించిన పిదప ఆచార్యులు, ఇతర వర్ణములవారికి వారి వృత్తి విద్యలను చెప్పేవారు. సామాన్య జనులు ఆధ్యాత్మికవిషయములను, నైతికవిషయములనూ, ధార్మికవిషయములూ ఇతిహాసపురాణములు తెలిసిన వారివద్దనుండి తెలుసుకొనేవారు. ఇవి గురువుకులములలో బోధింపపడేవి కాదు.

నాలుగవ వర్ణము వారికి వారి వృత్తులుండేవి. ఆ వృత్తులను కుశలతతో అవలంబించి జీవితం గడిపే కారణంచేత వానిని నేర్చుకోడానికి గురుకులములకు పోవలసిన అవసరం లేకపోయింది. వారి పిల్లలను గురుకులములకు పంపవలసిన ఆవశ్యకత లేకపోయింది. వృత్తివిద్యకు, వారి గృహములే పాఠశాలలుగా వుండేవి.

వేదవిద్యను బ్రాహ్మణుని వద్ద నుండి మాత్రమే నేర్చుకోవాలి. వృత్తివిద్యకు ఆ నియమం లేదు. వృత్తి విద్య ఆయా వృత్తులవారు, చేస్తూ చేస్తూ నేర్చుకొనేవారు. పెద్దలతోబాటు చిన్నవారూ వారికి తోడ్పడుతూ ఆయా వృత్తులకు వలసిననేర్పూ, కుశలతా జ్ఞానమూ సంపాదించేవారు. అందులో ఏవైనా సందేహాలున్నా, మెళకువలు తెలుసుకోవాలన్నా బ్రాహ్మణులను ఆశ్రయించేవారు. కంసాలి, వడ్రంగి, శిల్పి, మొదలైన వృత్తులను అవలంబించేవారిని తమిళ##దేశంలో 'ఆచారి' అనే పిలిచే వాడుక వున్నది. ఈ 'ఆచారి' అనే పదం ఆచార్య పదంలో నుంచీ పుట్టింది.

త్రైవర్ణికులందరికీ గురుకులములో విద్యార్థులై వేదాధ్యాయనములనకు అధికారమున్నప్పటికీ వారికి వేర్వేరు వయస్సులలో ఉపనయనము కావింపబడేది. ఉపనయనమునకు ముందు అక్షరాభ్యాసం చేసే అలవాటు తరువాత కాలంలో వచ్చినది. నలువది సంస్కారములలో అక్షరాభ్యాసం లేదు. పురాతన కాలంలో వ్రాతలేనందున విద్యారంభమునకు అక్షరాభ్యాసం అవసరం లేకుండేది. చదువు అంతా నోటిమూలకంగానే, వ్రాతమూలకంగా కాదు. విద్యాభ్యాసం ఉపనయనంతోనే ప్రారంభించబడేది. ఉపనయనకాలంలో ఉపదేశం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మంత్రోపదేశంతోనే విద్యభ్యాస ప్రారంభం. వేదాధ్యయనమునకు గాయత్రీ మంత్రమే అంకురార్పణగా వుండేది. ఉపనయనం కాగానే పిల్లవాడు గురుకులానికి వచ్చేవాడు.

బ్రాహ్మణునికి గర్భాష్టమంలోనూ, క్షత్రియునికి పదునొకండవ ఏట, వైశ్యుని పండ్రండవ వయస్సులోనూ ఉపనయన విధిని నిర్వర్తించేవారు. బ్రాహ్మణునికి 16 ఏళ్ళ లోపలా, క్షత్రియునికి 22 లోగా, వైశ్యునికి 24 లోగా ఉపనయనము పూర్తి కావలెననీ నియమముండేది. బ్రాహ్మణకుమారుడు చాల తెలివికలవాడైతే 5 ఏళ్ళకే అతనికి ఉపనయనం చేయవచ్చును. అదేవిధంగా క్షత్రియులు, వైశ్యులలో, 6, 8 ఏళ్ళకు ఉపనయనం చేయవచ్చును.

బ్రాహ్మణులకంటే బ్రాహ్మణతరుల విద్యారంభం ఎందులకు ఆలస్యం చేశారంటే, వారు ఎక్కువ కాయకష్టం చేయడం వల్ల, పిల్లలు ఇంట్లో వుంటే వారిని చూచి వారి వృత్తులను నేర్చుకోవడానికి సుళువుగా వుంటుందని ఈ నియమం ఏర్పడ్డది. పిల్లలకు చిన్న వయసులో అనుకరణ ఆసక్తి అధికంగా వుంటుంది. పిల్లలు తమ పెద్దలు చేసే స్వధర్మోచిత వృత్తికర్మలను సులభంగా ఆ విధంగా నేర్చుకొనేవారు.

ఈ కాలంలో మాంటిసరీ పద్ధతీ దీనినే చెబుతుంది. చదువు ప్రాక్టికల్‌గా ఉండాలని, ఒక పనిని చేస్తూ నేర్చుకోవటం సులభం. మన పూర్వీకులకు అందుచేత మాంటిసరి క్రొత్త కాదు. అందులకే పిల్లలను కొంచెం ఆలస్యంగా గురుకులాలకు పంపేవారు. తల్లతండ్రుల వద్ద వారు వృత్తి విద్యలు నేర్చుకొంటూ, తమ పెద్దలకు సహాయకారులుగా వుండేవారు.

రెండవది బ్రాహ్మణ విద్యార్ధులకు మంత్రోపాసనకు అవసరమైన కొన్ని ఆహారాది నిబంధనలుండేవి. అవి ఇతర వర్ణములవారికి లేవు. బ్రాహ్మణ విద్యార్ధులు నేర్చుకొనవలపిన వేద విజ్ఞాన పరిమితి వారికి లేకుండెడిది. వారు ఎక్కువ కాలం గురుకులంలో వుంటే వారి వృత్తులూ, విజ్ఞానం దెబ్బతింటాయి. అందుకే అ గురుకులవాసకాలంలో వివిధ వర్ణముల వారికి ఉన్న వ్యత్యాసం.

గురుకులంలో క్షత్రియులూ, క్షత్రియ వంశముల వారూ కొన్ని సంవత్సరములపాటు విద్యాభ్యాపం చేసేవారు. బ్రాహ్మణులకు ఇతర వర్ణముల వారికి చదువు చెప్పే విధి యున్నందున వారి విద్యాభ్యాసకాలం అధికంగా వుండేది. ఈ కాలంలో వారు ధనుర్వేదం, అర్ధశాస్త్రం కూడా నేర్చుకొనేవారు. అంటే బ్రాహ్మణులందరూ కాదు.

క్షత్రియులు ధనుర్వేదం, అర్ధశాస్త్రం తప్పనిసరిగా నేర్చుకొనేవారు. బహుశా క్షత్రియ విద్యార్ధులకు ప్రత్యేకమైన గురుకులములు కూడా ఉండేవేమో? పదునాలుగు విద్యలు నేర్చిన పిదప క్షత్రియ విద్యార్ధులు ఈ విద్యల కొఱకై ప్రత్యేకమైన గురుకులాలకు వెళ్ళివుండవచ్చును. భరద్వాజుడు తన పుత్రుడు ద్రోణునితోబాటు, క్షత్రియుడైన ద్రుపదునికి విద్యనేర్పినాడు. అదే విధంగా సాందీపుని ఆశ్రమంలో కృష్ణుడూ, సుదాముడూ ఇరువురూ విద్యాభ్యాసం చేశారు.

60. రెండు కధలు

విలువిద్యలో భరద్వాజునికి అసమాన కౌశల్యం వుండేది. అతని పుత్రుడు ద్రోణుడు తండ్రి వద్ద, పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకొన్నాడు. పిదప అతడు పాండవులకు కౌరవులకు ధనుర్విద్యాచార్యుడుగా వుండేవాడు. ద్రోణుడు దారిద్ర్యంతో బాధపడుతూ తన సహాధ్యాయియైన ద్రుపదుని వద్దకు సహాయార్ధం వెడతాడు. ద్రుపదునికి ధనగర్వం హెచ్చై ద్రోణునిని అనాదరించి అవమానిస్తాడు. ఈ పరాభవం భరించలేక, తన శిష్యుడైన అర్జునునిచేత ద్రోణుడు ద్రుపదుణ్ణి ఓడించి బంధితుడిని చేసి తన వద్దకు తీసుకొని వచ్చేటట్లు చేస్తాడు. ద్రుపదుడు అయిష్టంగా ద్రోణుడికి అర్ధరాజ్యం ఇవాల్సి వచ్చింది. ఈ పరాభవానికి ప్రతీకారం తీసుకోవాలని, ద్రుపదుడు ద్రోణుని చంపగలిగిన పుత్రుణ్ణి కోరి ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞాగ్నికుండమునుండే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది ఉద్భవించారు.

తర్వత ద్రౌపది స్వయంవరంలో అర్జునుడిని వరించింది. అర్జునుడు తన్ను ఓడించి బందీగా తీసుకొనిపోయినప్పటికి ద్రుపదుడు సంతోషంగా ద్రౌపదిని అర్జునుడికి కన్యాదానం చేసాడు. అతనితో యుద్ధం చేసినపుడు అతని వీర్యమును చూచి మెచ్చుకొన్నాడు. అతని పగ ద్రోణుని యందే గానీ, అర్జునునితో అతనికి వైరం లేదు. కట్టకడపట మహాభారత యుద్ధంలో తన గురువైన ద్రోణునితో అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. ద్రోణుడు సాధారణ యోధుడుకాదు, అతడు అనివార్య పరాక్రమశాలి.

అర్జునుడు యుద్ధంలోని జయాపజయములు, కృష్ణునిచేతిలో వదలివేసి నిశ్చింతగా వున్నాడు. ఏనాడూ అసత్యమాడి ఎరుగని ధర్మపుత్రుడు-అశ్వత్థమాహతః కుంజరః అని కల్ల చెప్పవలసివచ్చింది. అశ్వత్థామ ద్రోణునికి అత్యంత ప్రేమాస్పదుడైన కుమారుడు. అతడు చనిపోయాడని వినగానే ద్రోణుడు అస్త్రసన్యాసం చేశాడు. అశ్వత్థామ అనే ఏనుగును యుద్ధంలో చంపారు కనుక, ధర్మపుత్రుడు అశ్వత్థమాహతః కుంజరః - అని అని చెప్పినపుడు కృష్ణుడు తన శంఖాన్ని బిగ్గరగా ఊదినాడు. ఆ శంఖనాదంలో 'కుంజరః' అన్న మాట ద్రోణుని చెవిని పడలేదు. తన పుత్రుడు చనిపోయాడనుకొని అతడు శస్త్ర సన్యాసం చేసాడు. ఆ సమయంలో నిరాయుధుడైన ద్రోణుడిని దృష్టద్యుమ్నుడు చంపివేశాడు. ఈ గర్హనీయమైన కార్యాన్ని చూచి పాండవ సైన్యమూ హహాకారం చేసింది.

రెండోకధ సుదాముడు, కృష్ణుని గూర్చి. ద్రోణునివలెనే, సుదాముడు దారిద్ర్యబాధపడలేక, కృష్ణుని వద్దకు వెడతాడు. ఈ బీద బ్రాహ్మణుని కృష్ణుడు ఎంతో అదరించి, రాజమర్యాదలు చేసి, తన ప్రక్కను కూర్చుండ బెట్టుకొని, అతనికి ప్రీతితో పాదపూజ చేసి, రుక్మిణిని వింజామరమును విసరమంటాడు. ఎదురుచూడని శ్రీ కృష్ణుని మర్యాద అనే మాయలో చిక్కుకున్న బ్రాహ్మణుడు తన వచ్చిన పని ఏమో మరచిపోతాడు. కానీ కుచేలుడు కృష్ణుని ఏమీ యాచించక ఇంటికి వెళ్ళి చూస్తే అంతా సువర్ణమయంగా వుంది. రెండుకధలు ఒక కధలో సహూధ్యాయుల మధ్యా గర్వం, పగ, శతృత్వం. మరొక కధలో ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞత, వినయం. ఈ ఇద్దరు బ్రాహ్మణులను గూర్చి నాకు తోచినది చెబుతాను.

కుచేలుడు ఎంత కష్టపడినా తన స్వధర్మమైన బ్రాహ్మణీకాన్ని మరువలేదు. అతనికి శీలసంపదా వినయమూ వున్నవి. అందుచేత అతడు కృష్ణ పరమాత్మ మన్ననలను చూరగొన్నాడు. ద్రోణుడూ గొప్పవాడే. ద్రోణుడు ధనుర్వేదం చెప్పటంతో నిలవలేదు. తానూ యుద్ధంలో పాల్గొన్నాడు. ద్రుపదునితో స్వయంగా యుద్ధంచేయకపోయినా అర్జునుడిని ద్రుపదుని యందున్న విదోధ భావంచేత, యుద్ధానికి పురికొల్పినాడు. బ్రాహ్మణోచితమైన సాత్త్వికభావాన్ని వదలిపెట్టి, రజోగుణసంబంధమైన క్రోధాన్నీ మాత్సర్యాన్నీ అతడు అవలంబించాడు. మొదటినుంచీ అతనికి ధనుర్విద్యపై అభిమానం. తండ్రి వద్దనేకాదు, పరశురాముని వద్ద కూడా అతడు విలువిద్య అతి ఆసక్తితో నేర్చుకొన్నాడు. అందుచేత అతని స్వధర్మం దెబ్బ తిన్నది.

ద్రోణుని చిక్కులన్నీ స్వయం కృతాపరాధ జనితములే అతడు అన్యాయపరుడైన దుర్యోధనుని పక్షంలో యుద్ధం చేయవలసి వచ్చింది. అర్జునుని బాణములకంటే సునిశితములైన మాటలతో భీముడు ద్రోణాచార్యుని నొప్పించాడు. బ్రహ్మణ ధర్మమునకు విరుద్ధంగా నీవు వర్తిస్తున్నావని భీముడు ద్రోణుడుని దెప్పిపొడిచాడు.

బ్రాహ్మణధర్మం పాటించేంత వఱకు బ్రాహ్మణునికి గౌరవమూ, మర్యాదా వుంటుంది. ధర్మచ్యుతి ఏర్పడినపుడు ఆ గౌరవం లుస్తమౌతుంది. ఈ విషయాన్ని పై రెండు కధలు కొట్ట వచ్చేటట్లు మనకు తెలుపుతున్నవి.

61. బుద్ధుని కాలంలో బ్రాహ్మణులు

ప్రపంచంలోని దుఃఖమును ఉపశమింపచేయవలెనని బుద్ధుడు సంకల్పించాడు. ఆ విషయంలో ఆ కాలంలోని బ్రాహ్మణులు ఆయనకు తగిన సహాయం చేయలేకపోయారు. ఆయన తపస్సు చేసి దుఃఖమునకు కారణం తృష్ణ అని తెలుసుకొన్నాడు. తృష్ణకు కారణం మాయ. ఈ ప్రపంచం సత్యమని తోపింప చేసేదే మాయ. మోక్షము లేదా నిర్వాణము ఈ మాయను పరిహరింపచేస్తుంది. నిర్వాణం అంటే శూన్యం. శూన్యంలో కోరిక లేదు, దుఃఖములేదు, ఏమీ లేదు. బుద్ధుని చరిత్ర నుంచీ ఆయన ఈ సత్యమును తెలుసుకొని ప్రపంచములో వ్యాప్తి చేశాడని మనము గ్రహిస్తాము.

కానీ బుద్ధునికి పూర్వమే ఈ విషయాలన్నీ వేదములూ, ఉపనిషత్తులూ, గీతా చెప్పినవి. బుద్ధుడు కూడా నిర్వాణమేమిటో పూర్తిగా చెప్పలేకపోయాడు. నిర్వాణమంటే శూన్యమని ఈయన వదలి వేసినాడు. మన శాస్త్రాలు మోక్షమంటే శూన్యం కాదనీ పూర్ణత అనీ చెబుతున్నవి. మోక్షమంటే పరమానందము. పరిపూర్ణ సచ్చిదానంద స్థితి. ఈ విషయాన్ని ఆ కాలపు బ్రహ్మణులు బుద్ధునికి చెప్పలేక పోయారంటే, వారు ఎంత దిగజారి పోయారో అన్న విషయం మనకు అవగతమౌతుంది.

బుద్ధుడూ, వర్థమానవీరుడూ (జీనరుడు) యజ్ఞ యాగాదులో జరిగే పశుహింసను ఖండించారు. వారు అహింసకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. వైదిక ధర్మములలో కూడా అహింస పరిగణించబడ్డది. సాధారణ ధర్మములలో అహింసకు ప్రధమ స్థానమున్నది.

భగవంతుడు లోకవ్యవహారములు, మానవులు దేవతల మధ్య పరస్పర సహకారములతో జరుగ వలెనని నిర్దేశించాడు. అందుచేతనే భగవదాదేశితులైన ఋషులు యజ్ఞయాగాదుల నాచరించినట్లయితే దేవతలు మనకు భౌతిక శక్తులు సుఖకరములుగా వుండునట్లు చేసి మనలను అనుగ్రహిస్తారని చెప్పారు.

దేవతలు యజ్ఞములలో పశువులను ఎందుకు ఆహుతిగా కోరుతున్నారో మనం చెప్పలేము. సృష్టిలో ఎన్నో వింతలున్నవి. సింహము, గద్ద మొదలైనవి చూడటానికి సుందరుగా వున్నప్పటికినీ, మాంసాహారులు. మంచివాసనలు, చేసే పుష్పములను కలిగిన చెట్లకు మనం దుర్వాసనతో కూడిన ఎరువును చేస్తున్నాం. మంత్రపూతములైన బలులు దేవతలకూ అట్లే ఆహారంగా వున్నవి. కావలి కాచే కుక్కలకు మాంసాహారాన్ని ఇస్తున్నారు. మనలను రక్షించే దేవతలను ఉద్దేశించి చేసే పశుబలిని దీనితో పోల్చరాదు. యజ్ఞంలో ఆహుతి కాబడిన పశువులు పుణ్యలోకాలకు వెడతాయి.

అప్పయ్య దీక్షితులు సుమారు మూడు వందల సంవత్సరముల క్రితం ఉండేవారు. ఆయనది చాల దయగల హృదయం. ఆయన వాజపేయయజ్ఞం చేసేటపుడు పశుబలి చేయవలసి వచ్చింది. దానికి ఆయన చాలా దుఃఖించాడు. ''ఓ భగవంతుడా! బ్రాహ్మణుడనైనందున, విధిగా చెప్పబడిన యజ్ఞములను, నీ పాదములను చేరుతున్నవనే వేదవచనములపై విశ్వాసముతో, ఈ మూగ జీవులను చంపి చేయుచున్నాను. ప్రజలలో ఈ వేదవచనములపై నమ్మిక నీవే ప్రతిష్ఠింపచేయవలయును''. అని పార్ధించి యాగ విధిని ఆయన పూర్తిచేశాడట. ఆ సమయంలో, ప్రజలందరి సమక్షంలో వసాహూమంచేయబడిన పశువులన్నిటినీ, గంధర్వులు, అప్సరసలు పుష్పకవిమానంపై, గౌరవంతో దేవలోకములనకు తీసుకొని వెళ్ళారట. ఈలాంటి కధలు పురాణములోనూ వున్నవి.

ఈ కాలంలోనూ యఙములు చేస్తే వానలు కురవడం చూస్తున్నాము. విద్యుక్తంగా చేసి యఙములు అభీష్టఫలములను ఇచ్చే విషయంలో ఏ మాత్రమూ సందేహములేదు.

ఈ విషయాన్ని చక్కగా చెప్పగలిగిన బ్రహ్మణులు, బుద్ధుని కాలంలో లేకపోయారు. అందుచేతనే బుద్ధుడు, జినుడూ, వేద నిరసనచేసి నూతన మతములను స్థాపించడానికి ప్రయత్నం చేశారు. బ్రాహ్మణునిలో ఆధ్యాత్మిక శక్తి క్షీణించిన కారణం చేత ఇట్టి దురవస్థ ఏర్పడింది. వేదములలో ప్రజలకు గౌరవంతగ్గింది. నూతన మతవ్యాప్తికి కావలసిన వాతావరణం ఏర్పడింది.

62. జాతీయైక్యతకు వేద ధర్మం

వర్ణాశ్రమధర్మ వ్యవస్థ కారణంగా దేశంలో ఐక్యత లేకపోయిందని కొందరు అపోహ పడుతున్నారు. ఇది సరికాదు. వైదికానుష్ఠానాలను సక్రమంగా పాటించినంతవరకు దేశంలో ఐక్యత వుండనే వుంది. ఆ కాలంలో గొప్ప వంశములకు చెందిన రాజులు పరిపాలించి దేశాన్ని మహోన్నత స్థితికి తెచ్చారు. ఆ వైదిక మతములు ప్రబలిన తర్వాతనే దేశం క్షీణించసాగినది. ఆ కాలంలోనే దేశం భిన్నమైనది. దేశం భిన్నంకాగానే ఇతర దేశముల వారు మనపై దండెత్తినారు. ఈ విషయం కే.ఎమ్‌.మున్షీ వ్రాసిన చరిత్ర వలన తెలుపస్తుంది.

చంద్రగుప్తమౌర్యుని కాలంలో వేదధర్మనిరతికి, వర్ఱాశ్రమధర్మానికే ఆదరణ వుండేది. అతని తర్వాత అశోకుడు బౌద్దమతాన్ని అవలంబించే సరికి మౌర్యసామ్రాజ్యము భిన్నమైంది. దేశం విదేశీయులైన సిధియన్లు, పార్ధియన్టు, కుషాణుల పాలబడినది. తర్వాత పుష్యమిత్రసుంగ రాజ్యమునకు వచ్చాడు. అతడు వైదికధర్మనిరతుడు. అశ్వమేధయాగం చేశాడు. దేశం మరల ఉత్సాహవంతమైనది. పిదప వచ్చిన సముద్రగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు వైదిక మతావలంబములే. వారూ అశ్వమేధ యాగం చేశారు. వారి పాలనలో వర్ణాశ్రమ ధర్మం చక్కగా వర్ధిల్లినది. వీరి కాలంలో దేశం ఉన్నత స్థితి అందుకోవడానికి కారణం వర్ణవ్యవస్త. ప్రజలలోని సమైక్యత అని మున్షీ ఆయనతోబాటు, ఇతర చరిత్రకారులూ అభిప్రాయపడుతున్నారు.

అన్ని ఆశ్రమములవారూ వారికి నిర్ణయించిన వృత్తులూ వ్యాపారములలో పాటుపడి సామూహికాభివృద్ధికి సహకరించారు. బుధ్ధుడు, జినుడు బోధించిన నిర్వాణ కైవల్యములు వారికి అంతగా రుచించలేదు. దానికి బదులు వారికి హిందుమతములోనే కల్యాణగుణములు కనబడినవి. రామకృష్ణాద్యవతారపురుషులు సంసారం చేస్తూ కర్తవ్యపాలన చేసినవారు. అహింస పేరుతో వారు వారి ధర్మమును వదలిపెట్టలేదు. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసిన మహాత్ములవారు. అట్టి అవతారపురుషులను ఆదర్శంగా వుంచుకొని ప్రజలు తమ తమ ధర్మములను సకృత్తుగా పాటించినందువలన స్వర్ణయుగమును తలపించే సామ్రాజ్యములు మన దేశంలో వర్ధిల్లినవి. బౌద్దుడైన హర్షవర్ధనుని కాలంలో ఏ సామ్రాజ్యములు నిర్మింపబడలేదు! అతని ఆస్థానకవి బాణుడు రచించిన హర్ష చరిత్రహర్షుని మహా సామ్రాజ్యాధి నేతగా అభివర్ణించిననూ. అది సరి కాదనీ, గుప్తుల కాలంలోనే దేశము మహోన్నత స్థితినందు కొన్నదనీ, హర్షుని రాజ్యం అతని పిదప అంతరించినదనీ మున్షీ వ్రాశారు.

బౌద్దాన్ని పాటిస్తున్నరాజులు అహింసా వాదాన్ని పూర్తిగా అవలంబిస్తేరాజ్యాలు ఏలలేమని తెలుసుకొన్నారు. వారు విహారములు, చైత్యములు నిర్మించినప్పటికీ యుద్ధాలు చేశారు. వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రోత్సహించి, బ్రాహ్మణ సత్కారం చేశారు. జాతీయైక్యతకూ, సామాజిక వ్యవస్థకూ వర్ణాశ్రమ ధర్మం అవసరమని గుర్తించారు.

బ్రాహ్మణులు ఏర్పరచిన వర్ణాశ్రమ ధర్మం వలన దేశం క్షీణించి, విదేశీయుల పాలైనదని చెప్పేవారి వాదన సరి కాదని చారిత్రుకులే అభిప్రాయపడుతున్నారు. అశోకుని పిదప మౌర్యసామ్రాజ్యమును స్థాపించినది ఒక్క బ్రాహ్మణుడే. ఈ చరిత్రనంతా నేనెందుకు చెప్పుకొని వస్తున్ననంటే, ఒకే కుటుంబంగా మెలుగుతున్న ప్రజల మధ్య కలహబీజాలను నాటి ఉమ్మడి కుటుంబాన్ని భిన్నం చేయకూడదు అని అనడానికే.

63. అద్వైతము, రాజ్యాంగము

వర్ణాశ్రమధర్మాన్ని గూర్చి ఉన్న అపోహలాంటిదే మాయావాదమును గూర్చివున్నది. శంకరభగవత్పాదులు జగన్మిధ్యాత్వాన్ని బోధించారు. అందుచేత ప్రజలలో ధైర్యము కార్య కుశలత లోపించి ప్రజలు పరదేశీయలకు లోబడి మెత్తని వారైపోయారన్న అపవాదు ఒకటి వున్నది. ఆచార్యపాదులు భావాద్వైతం చేయమన్నారే గానీ క్రియాద్వైతంవారు బోధించలేదు. వ్యవహారంలో మాయగానీ అద్వైత ప్రసక్తిగానీ పాటించాలని వారు ఎన్నడూ చెప్పలేదు. వారు కర్మానుష్ఠానమునూ, ఈశ్వరభక్తినీ వదలరాదనే చెప్పారు. మాయను, అద్వైతమును పక్వజీవులకు వారు బోధించారేగానీ జన సామాన్యానికి కాదు.

మనదేశంలో మూడు మహాసామ్రాజ్యాలు నెలకొల్పడానికి పునాది వేసినవారు ముగ్గురూ అద్వైతులైన బ్రాహ్మణులే.

మాలిక్‌కాఫర్‌ రామేశ్వరం దాకా దండెత్తి త్రోవలో వున్న ఆలయాలను నేలమట్టం చేసి హిందూ సమాజముపై ఎంతో అఘాయిత్యంం చేశాడు. కానీ మన నాగరికత, సంస్కారము మళ్ళా తలెత్తి మునుపటి వలెనే నిలద్రొక్కుకొన్నదంటే దీనికి కారణం విజయనగరపు మహారాజులే. విజయనగర సామ్రాజ్యమును స్థాపించిన విద్యారణ్యులవారు గొప్ప పండితులు, తత్త్వజ్ఞులు, రాజకీతవేత్తలు, అంతేకాదు, వారు మహామనీషులైన అద్వైతాచార్యులు.

విజయనగర రాజ్యమునకు చెందినదే తంజావూరు. దానిని నాయక రాజులు పరిపాలిస్తూ వుండెడివారు. తంజావూరు రాజ్యమును స్థాపించినవారు గోవింద దీక్షితులు; వారు గృహస్థులు. కానీ వారిని అద్వైతాచార్యులనే పిలిచేవారు. మరాఠా రాజ్యాన్ని శివాజీ స్థాపించి ఔరంగజేబు యొక్క ఔద్ధత్యమును ప్రతిఘటించాడు. ఆయన గురువు సమర్ధరామదాసు. ఆయన బ్రహ్మచారి, అద్వైతి,. కొందరు తాము సర్వజ్ఞులన్నట్లు తెలిసీ తెలియక మాట్లాడుతుంటారు. అద్వైతము,మతైక్యము, జాతిసమస్య,దేశైక్యత మొదలైన పద ప్రయోగాలు చేస్తూ ఇతరులలో లేని పోని సందేహాలను కలుగ చేస్తారు. మన మతసాంప్రదాయాలను సాటించే వారిలో ఏ విధమైన అసూయ గానీ, వైషమ్యంగానీ ఉండెడిది కాదు. బ్రహ్మక్షత్రియుల మధ్య కించిత్‌ వైషమ్యముండేదేమో! కానీ అది అంత గణనీయంకాదు.

64. సంఘర్షణలో క్షాంతి

బ్రహ్మక్షత్రియుల మధ్య ఘర్షణలు అరుదుగా వుండినప్పటికి, కొన్ని అంశాలు పరిసంధులమధ్య గమనింపదగ్గవి. ఇతరదేశాలలో ఇట్టి కలహాలు రక్తపాతానికి దారితీసేవి. రాజుకు, పోపుకూ మధ్యా సంఘర్షణ; సుల్తానుకూ ఉలేమాకూ మధ్య వున్న అభిప్రాయభేదం - ఉదాహరణంగా తీసుకోవచ్చును. అభిప్రాయభేదకారణంగా క్షత్రియులు బ్రాహ్మణులను, పాశవికశక్తితో అణగద్రొక్కలేదు. అభిప్రాభేదములున్నప్పుడు బ్రాహ్మణులు ఔద్దత్వం చూపేవారని కొందరు తప్పు అభిప్రాయపడుతున్నారు. అట్లావుండే ఇతర జాతులు, క్షత్రియులను బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రవర్తించమని రెచ్చకొట్టి వుండేవారు. కానీ అలాంటిదేమీ జరుగలేదు.

బ్రహ్మణ క్షత్రియుల మధ్య సంఘర్షణ ఏర్పడినపుడు క్షత్రియుల వర్తన, అవధులను తప్పక నియమ బద్ధంగానే వుండేది. సామాన్యజనులకు వేదాధ్యయనాధికారం లేకున్నా వారు ఎంతో నియమంతో వర్తించేవారు. అది వారి సౌశీల్యాన్ని తెలుపుతుంది. అవకాశం లభించింది కదా అని, వారు జాతుల మధ్య వైషమ్యం పెంచడానికి ఎన్నడూ పూనుకోలేదు.

65. జ్ఞాన పూర్వకమైన ప్రతిపక్షము

ఒక వేళ బ్రహ్మణులకు జాతిగర్వమూ, విద్యాగర్వము వుండివుంటే, ఇతర జాతులు వారిని ఎందుకు అంతకాలము మన్నించి వారికి సమాజంలో ఒక ఉన్నతస్థానాన్ని ఇచ్చి గౌరవించివుంటారు? బ్రహ్మణులు గర్వోద్ధతులై వుండివుంటే, క్షౌత్రధర్మాన్ని పాటించే క్షత్రియులు వారిని కట్టుబాటులో పెట్టి వుండేవారు. అందుచేత ఆ కాలంలో బ్రహ్మణులకు విద్వత్తేకాక, గౌరవనీయమైన శీనసంపదా వుండేదని తేలుతున్నది. ఈ లాంటి శీలం వారికి ఎలా అలవడినదంటే, దానికి కారణం ఆ కాలంలోని గురుకులాలలో నేర్చిన విద్యాప్రాభావమే.

బ్రాహ్మణ క్షత్రియ స్పర్థలు, అట్లా తలచూపినా, అవి వైదిక ధర్మానుష్ఠాన భేదాభిప్రాయములచేతనో, సిద్ధాంత ప్రతిపాదనలో భేదం చేతనో వచ్చినవే కానీ ఆర్ధిక సంబంధమైనవి మాత్రంకావు. అట్టి ప్రతిపక్ష భేదం బ్రాహ్మణుని విద్వత్తుకు నికషోపలము (ఒరిపిడి రాయి) వలె వుండేది. బౌద్దము, జైనము, శిక్కుమతము మనసులో వుంచుకొనే నేను ఈ మాట చెబుతున్నాను.

బౌద్ధ జైనముల వలె శిక్కుల మతము వేదమత విరుద్ధము కాదు. కర్మ, వర్ణవ్యవస్థలతో ఏకీభవించకపోయినా శిక్కుల మతం మూలమతమైన హిందూమతానికి ప్రతిపక్షియని చాటుకోలేదు. ముస్లిము రాజలు బ్రహ్మణ విద్వాంసులను విద్వేషించి పగబట్టినపుడు శిక్క గురువులు ఆ బ్రాహ్మణులకు ఆశ్రయమిచ్చి వారి పక్షంలో ఆ రాజులతో పోరాడారు.

బుద్ధుడు, జినుడు, నానక్‌ అందరూ క్షత్రియులే. వారు బ్రహ్మణులతో ప్రతిపక్ష భావం వహించినా, అది సాత్వికంగా వుండేది. వాళ్ళ భేదం, తత్త్వభేదం. మతభేద సంబంధమైనది. ఆసమయంలో బ్రహ్మణులు ఆత్మబలంలో కొంచెం వెనుకబడి యుండెడినారు. బ్రాహ్మణులపై విజయం సాధించవలెనంటే అది శారీరకంగా కాదు, మానసిక రంగంలోనే, తాత్వికంగా క్షత్రియులు బ్రాహ్మణులను అధిగమించవలెననెడి ప్రయత్నంలో జినుడు, బుద్ధుడు సహకరించారు.

పూర్వం క్షత్రియులకు బ్రాహ్మణుడు విజ్ఞాన పూర్వకమైన సలహాలను శాస్త్రసమ్మతంగా ఇచ్చేవాడు. కొందరు క్షత్రియులు ఒక్క క్షాత్రంలోనే కాక వైజ్ఞానికంగా కూడా బ్రాహ్మణులను అధిగమించాలన్న ఉద్దేశంతో క్రొత్త మతాలను స్థాపించి వ్యాపకం చేసారు.

శాస్త్రములు బ్రాహ్మణులను సాత్వికులుగా వుండవలెనని నిర్దేశించినవి. దైనందిన జీవితములో వారు సచ్చీలవంతులుగాను, దాంతులు గానూ, శాంతిపూర్వకముగనూ వుండేవారు. క్షత్రియులు క్షాత్రవంతులై రాజసికముతో వుండేవారు. బ్రాహ్మణులకంటే సత్వమూ, విజ్ఞానమూ తాము సాధించవలెనన్న ప్రయత్నంలో అహింసకు వారు అత్యున్నత స్థానాన్ని ఇచ్చి యజ్ఞవిధులను దూషించినారు. వారికి అహింసలో వున్న నిష్ఠను ఎవరూ సందేహించ నక్కరలేదు. బ్రాహ్మణుల కంటే తాము సాత్వికులమన్న భావంతో వారు ఆ మతాలను స్థాపించి ఉండవచ్చును.

66. క్రొత్త మతాలూ, పెద్దవిద్యాశాలలు

ఇట్లు బుద్ధుడు, జినుడు స్థాపించిన క్రొత్తమతాలలో బ్రాహ్మణులు బోధించే వేద ప్రామ్యాణ్యము, వైదికానుష్ఠానములు, వర్ణవిభాగములు మొదలగునవి లేవు. వేదాధికారము సనాతన మతములో కొందరికే విధింపబడియున్నది. జైన బౌద్దమతములలో ఆ పట్టింపు లేక అందరూ వారి శాస్త్ర గ్రంధములను చదవవచ్చునని వారు ఏర్పరచారు. ఈ కారణంచేత వారు సర్వులకు ఉపయోగకరముగా ఘనమైన విద్యాశాలలను స్థాపించవలసి వచ్చినది.

గురుకులములలో వ్యాకరణ శుద్ధములైన సంస్కృత గ్రంధములనే బోధించేవారు. సామాన్యులకు సంస్కృత పరిచయం లేదు. అందుచేత ఈ నూతన మతప్రవర్తకులు ప్రాకృతభాష తమ మతవ్యాప్తికి ఉపయోగింప వలసి వచ్చినది. బౌద్ద మతమునకు ఆధార గ్రంధములైన ''త్రిపిటకము''లు 'పాళి' అనే ప్రాకృత భాషలో వ్రాయబడినవి. జైనుల ఆధారగ్రంధములైన ''అంగములు'' ప్రాకృతభాషలోనూ, అర్ధమాగధి లోనూ వ్రాయబడినవి.

వ్రాత తెలియని సాధారణ జనులకు మతబోధ కొఱకై విద్యాశాలల నేర్పరచినారు. క్రైస్తవ మిషనరీల మతవ్యాసంగము మన మెరిగినదే. ఐదువందల సంవత్సరముల క్రితము నానక్‌ మతబోధ చేయుటకు ఉద్యమించినపుడు, పంజాబీభాషకు లిపి లేకపోగా, ఒక లిపిని సిద్ధము చేయవలసివచ్చినది. ఆ లిపియే నానక్‌ పిదప వచ్చిన అతని శిష్యుడు అంగద్‌ అను నతడు ఏర్పరచిన గురుబుఖి అనే లిపి. ఇక్కడ గ్రహించవలసిన విషయమేమిటంటే, నూతన మతప్రవర్తకులు సాత్వికమార్గములో, నిర్బంధము లేక ఇతర మతానుయాయులను తమ మతమునకు మార్చదలచుకొన్నచో విద్యాస్థానములను స్థాపించవలసి వస్తుందన్నమాట. ఇట్లా విద్వాంసులొక్కరే వాడుతున్న సంస్కృతభాషను వదలి తమ మత వ్యాప్తికై జైన బౌద్ధములు ప్రాకృత భాషను, అర్ధమాగధిని ఆశ్రయించవలసివచ్చినది.

పై మతములు వ్యాప్తముకాను కాను, క్లిష్టమైన తత్త్వవాదములను చర్చించుటకు ఈ భాషకు గాంభీర్యము చాలక, వారు తర్వాత సంస్కృతమనే ఉపయోగించారు. పుస్తకములు సంస్కృత భాషలోనే రచించుటకు ప్రారంభించారు. క్రీ.శ. ఏడవ శతాబ్దమున, హర్షవర్థనుని కాలములో చీనాయాత్రికుడు హ్యూన్‌ సాంగ్‌ భారత దేశమునకు పర్యటనకు వచ్చినాడు. బౌద్ధ విద్వాంసులు, సంస్కృత భాషలోనే వాదప్రతివాదములు చేస్తున్నట్లు ఆయన తన గ్రంధంలో వ్రాసుకొన్నాడు. కాని మతవ్యాప్తికి సాధారణ జనులకు వారు ఎరిగిన భాషలో బోధచేయడానికి పెద్దపెద్ద విద్యాస్ధానములు, బౌద్ద జైనములు స్థాపించవలసి వచ్చినవి.

67. మానవుడు

మనువు ఆది పురుషుడు. అతని నుండి పుట్టిన వారు మానవులు. మనస్సు ఉన్నవాడు మానవుడు. ఇంగ్లీషు భాషలో మనిషిని, ఆలోచించేశక్తిగల మృగమని అంటారు. (Man is a thinking animal) గురుకులములలో ప్రధానంగా బ్రహ్మణ విద్యార్ధులు చదివేవారు. ఇతరులు వృత్తి విద్యలను అభ్యసించి తమతమ వృత్తులను జీవనాధారానికి అవలంబించేవారు. కొన్ని విద్యలకు బ్రాహ్మణులకే అధికారమున్నదన్న విషయం ఇతరులలో ఏ విధమైన సంచలనం కలిగించలేదు. వారి వారి వర్ణ ధర్మములను పాటించుటలోనే సమాజ శ్రేయస్సు ఉన్నదని వారు విశ్వసించారు. అందులో వారికి న్యూనాధికతలు గానీ స్పర్థలు గానీ కనపడలేదు. ఈ భావం వున్నంత వరకు సమాజంలో అరమరికలు లేక సౌజన్యం వెల్లివిరిసింది.

68. బుద్ధుని కాలంలో వర్ణవ్యవస్థ

వేదకాలం నుంచీ వస్తున్న విద్యావిధానాన్ని బుద్ధుడు, జినుడు తప్పుగా అర్దం చేసుకొన్నారు. ఆ నాటి బ్రహ్మణులు అనుష్ఠానశక్తిగానీ, వేదాంత విజ్ఞానంగానీ లేక దురహంకార పూరితులై యుండినందున వారు ఆ విధంగా దురభిప్రాయ పడి యుండవచ్చును. అట్టి బ్రాహ్మణులను చక్కపరచకుండా, వేదముల ఉద్దేశ##మే తప్పు,వర్ణవిభాగమే కూడదు, హిందువులేర్పరచిన వర్ణవ్యవస్థలో చాల పక్షపాతమున్నది అని జినుడూ, బుద్దుడూ తప్పుగా తలచారు. ఈ విధంగా వారు బోధించేసరికి జనసామాన్యానికి, మతంలో విశ్వాసం సడలినది. ''మా మతంలో వర్ణవ్యవస్థలేదు. వైదికమతావలంబులు మీకు చేయలేని పనిని మేము చేస్తున్నాము'' అని వారన్నారు. మతగ్రంధములు వాడుక భాషలో వ్రాసి, పెద్ద పెద్ద విద్యాస్థానాలను ఏర్పరచి, మతబోధ చేసేపరికి, జైనబౌద్ధములు విస్తారంగా వ్యాపించినవి.

ఇట్లు జైన బౌద్ధములు వ్యాపిస్తున్నా, బ్రాహ్మణ్యములో కొంత శైధిల్యం ఏర్పడినా, బ్రాహ్మణతరులలో వర్ణధర్మము అంతరించలేదు. యజ్ఞయాగాదులూ వేదాంత విచారమూ వారికెప్పుడూ విధింప బడలేదు కదా! అయితే వేదాంత విచారములేనందున, బౌద్ధుల వాదనలలోని నిజానిజములు పరిశీలింపలేకపోయారు.

ఏ ఉద్యమంలోనైనా ప్రజలు నిషేధాలను పాటించినట్లు, విధులూ., వర్తనలు పాటించమంటే పాటించరు. గాంధీగారు, తెల్లదొరతనం వద్దనీ, విదేశీయులను ఎదుర్కొనవలెనీ చెప్పేసరికి అందరూ ఆ నిషేధ వాక్యాలను పాలించారు. కానీ వారి అనుయాయులు గాంధీగారు బోధించిన అహింస, సత్యము, ఈశ్శరప్రణిధానమూ ఎంతవరకు పాటించారు.? నేను కూడ నాస్తిక్యములో ,ఇతర మతముల వారు మన మతస్థులను తమ మతములలో చేర్చుకొనే ఉద్యమమునో, ప్రతిఘటించమంటే వెంటనే మీరు సభలు ఏర్పాటు చేసి తీర్మానములను సులభంగా చేయగలరు. అదే కర్మానుష్ఠానము చేయవలసినదంటే మీరు అంత సులభంగా నామాట వింటారా? లేదు. హిందుమతములో సోపాన ప్రక్రియలో లక్ష్యసాధనము, మార్గములు నిర్దేశింపబడినవి. అధికార భేదమును అనుసరించి ప్రజలకు సాధన ప్రణాళికలు ఏర్పడినవి. జైన బౌద్దములు అట్లుకాక అందరికీ అహింసా, త్యాగములను బోధించినవి. జైనములో అందరకీ తీవ్ర తపశ్చర్య విధింపబడినది. ఇవి జన సామాన్యానికి దుర్గమమైన సాధనా విధానములే.

ప్రజలు వర్ణధర్మమును వదలి పెడితే సమాజంలో ఎవరు ఏ పనిచేయాల వితర్కం ఏర్పడుతుంది. ప్రజలు సంశయగ్రస్తులౌతారు. అశోకుని కాలంలోని శాసనముల వలన ప్రజలలో వర్ణధర్మముండినదనీ, దానిని వారు గౌరవించేవారనీ తెలుస్తున్నది. తరువాత కాలంలో తర్కశాస్త్ర ప్రచారకులైన ఉదయనాచార్యుడు, మీమాంసకుడైన కుమారిలభట్టు వైదిక కర్మానుష్ఠానములను ఆచరించినవారే. వారు బౌద్దమతస్తులతో వాదించి, వేదధర్మాన్నీ వర్ణాశ్రమ ధర్మాన్నీ పూర్వమున్నరీతి వెలయించారు. ఈ విషయం మనం చరిత్రలో చూడవచ్చును.

ఐరోపీయులు వ్రాసిన చరిత్రల ప్రకారము, జైన బౌద్ధముల కాలములో వర్ణచ్యుతి ఏర్పడినదనీ, భగవత్పాదుల కాలములో వర్ణాశ్రమ ధర్మము పునరుద్ధరింపబడినదనీ వున్నది. ఇవన్నీ కట్టుకధలే. వీనిలో చారిత్రిక సత్యమేమాత్రమూ లేదు. శంకరుల కాలమునకు అవైదిక మతములన్నీ క్షీణించినవి. వర్ణాశ్రమధర్మము ఈ చారిత్రికులు చెప్పిన విధముగా లుప్తమైయున్నచో, శంకరుల వంటి గొప్పవారికి కూడ వాని పునరుద్ధారణము అసాధ్యకార్యమై వుండేది. ఆయన రాజుల సాయముతో వర్ణాశ్రమ ధర్మమును నిలబెట్టారనే వాదములకు తగిన ఆధార శాసనములేవియు కనబడుటలేదు.

బౌద్ధజైనములను అవలంబించినా ప్రజలు తమ తమ పూర్వవృత్తులను మానుకోలేదు. మతం మారినా ప్రాపంచిక జీవితం మారలేదు. దక్షిణ దేశంలో జ్ఞాన సంబంధుల కాలంలో మతం మార్చుకొన్న ఇతర మతముల నాశ్రయించిన చాలామంది జనులు మళ్ళా హిందుమతానికి వచ్చారు. భయంతో ఆలయాలకు వెళ్ళడం మానుకొన్న జనులు ఆలయాలకు మళ్ళా వెళ్ళసాగారు. వృత్తి జీవనం యధాప్రకారంగా ప్రజలు కొనసాగించారు.

జైన బౌద్ధములు మనదేశంలో పుట్టినా, పుట్టిన దేశంలో అవి శాఖోపశాఖలుగా వ్యాపించలేదు. వానివలన హిందూమతానికి ఏ విధమైన అపకారమూ జరగలేదు. మత సంబంధ దృష్టిలో కాక, సామూహికంగా చేస్తే, బ్రాహ్మణులు ఈ మతాన్ని స్వీకరించలేదు. ఎవరో అల్పసంఖ్యలో బ్రాహ్మణ్యమును వదలి వుండవచ్చును. దక్షిణ దేశంలో కూడ పాండ్యడు జైనమతావలంబియైనప్పటికి, అతనిభార్య, అతని ముఖ్యమంత్రి అతనిని మతం మార్పులో అనుసరించలేదు.

మరొక ముఖ్య అంశ##మేమిటంటే బ్రాహ్మణతురుల కూడా జైనబౌద్ధ విద్యాలయాలను విద్యార్ధం అశ్రయించలేదు. వృత్తి విద్యకు వాళ్ళకు విద్యాస్థానాల అవసరం లేకపోయింది. వంశ పారపర్యంగా తండ్రి నుంచి పిల్లవానికి వృత్తి విద్యా కౌశల్యం సుభంగా సంక్రమించేది. జాతిమతభేదం లేకుండా జైనబౌద్దవిద్యాలయాలు బోదించినందువలన బ్రాహ్మణతరులలో అల్పసంఖ్యాకులు అక్కడ విద్యాభ్యాసం కొఱకు వెళ్ళారేమో.

అందుచేత జైనబౌద్ధములు భిక్షుదర్మాన్ని విస్తారంగా బోధించినప్పటికి, అందరూ సన్యసించి భిక్షువులు కాలేదు. వారి సంఖ్య అల్పమే. పూర్వకాలంలో సన్యసించిన వారిలో చాలమంది బ్రాహ్మణులే. వారు మొదట మూడు ఆశ్రమవిధులను చక్కగా నిర్వర్తించి, పిదప నాలుగవదైన సన్యాసాశ్రమం జ్ఞాననిష్ఠతో స్వీకరించేవారు. హిందూ సన్యాసులు ఏకాంతంగా సంచరించేవారు. కానీ బౌద్ధభిక్షులకు సంఘాలు ఏర్పడినవి. వారు ఒకచోట వానస్థలం ఏర్పరచుకొని విద్యాలయాలను నడిపేవారు. కానీ పమాజంలో దాదాపు అయిదు శాతం భిక్షులైనందువలన, సామూహిక వ్యవస్థ కొంచెం దెబ్బతిన్నది.

ఐతే పాశ్చాత్య చారిత్రికులందరికీ పక్షపాతమున్నదనుట సరిగాదు. వారిలోనూ కొందరికి సత్యనిష్ఠ వున్నది. ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం ఏ విషయాన్నైనా పరిశోధిస్తే, అదే అంతిమ సత్యం అని కూర్చోవటంలేదు. ఆ విషయం గుర్చి పరిశోధనలు చేస్తూనే వుంటుంది. క్రొత్త విషయాలు పూర్వ విషయాలకు విరోధంగా వుంటే, వానినీ ప్రచురించి పాత సిద్ధాంతాలను మార్చడమో, తొలగించడమో, వృద్దిచేయడమో, చేస్తూనే వుంటుంది. ఆక్స్‌ఫర్డు యూనివర్సిటీ వారి హిందూదేశ చరిత్రలో ఈ విధంగా వున్నది.

''జైన బౌద్ధములను బహుసంఖ్యాకులు స్వీకరించినా, కొన్ని రాష్ట్రములలో వాని ప్రభావము అధికంగా వున్నా, ఈ మతములు దేశమంతా వ్యాపించినదని ఎవరైనా చెప్పినచో అది నమ్మతగినదికాదు. అనాదిగా బ్రాహ్మణుల హిందూ మతం ఒక గొప్ప జీవశక్తిగా వుండెడిది. అన్ని కాలాలలోనూ, ఆ మతానుయాయులు బహుసంఖ్యాకులు వుండిరనుటలో ఏ విధమైన సందేహము లేదు. చరిత్రలో బుద్ధుని కాలము, జైనుల కాలము అని వ్యవహరించడం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు. జైనబౌద్దములు హిందూమతాన్ని దాని ముఖ్యస్థానం నుంచీ ఎన్నడూ తొలగించలేదు. జైనబౌద్దములు ఒకటి రెడు రాజ్యములలోనో, రాష్ట్రములలోనో వర్ధిల్లినవి. దేశమంతటా అవి ఎన్నడూ వ్యాపించలేదు''

ఈ విషయమంతా ఎందుకు చెప్పుతున్నానంటే, ఈ కాలంలో చరిత్రపేరిట, జైనబౌద్ధములు దేశమంతటా వ్యాపించిన వనియూ, సుస్థిరమైన పునాదులపై వానిని ఆ మతాచార్యులు ప్రతిష్ఠించినారనియూ., చేసే అసంబద్ధములైన ప్రలాపములను ఖండించుట కొఱకే.

శంకర భగవత్పాదులు అశేషశేముషీ ధురీణులు. మహాప్రజ్ఞావంతులు. వారు చేసిన కార్యము అన్యులకు అసాధ్యము. వారిలో స్వార్ధాభిమానము లవలేశ##మైననూ లేకుండెను. వారు వ్రాసిన భాష్యగ్రంధములుందు కానీ, ప్రకరణ, స్తోత్రగ్రంధములందుకానీ, ఆత్మ ప్రశంస ఏ మాత్రమూలేదు. తమ బ్రహ్మసూత్రభాష్యములో వారు ఈ విధంగా వ్రాసారు;

''మనకు ఈ కాలంలో దేవతలతో సంపర్కం లేనందున, పూర్వకాలంలోని జనులుకు అట్టి సంపర్కశక్తి లేదని అనుకోవటానికి మనకు అధికారం లేదు. అట్లు చెప్పటం ఈ కాలంలో సార్వభౌమత్వం లేనందువలన ఏ కాలంలోనూ సార్వభౌములు లేరని వాదించినట్లు ఔతుంది. ఇపుడు వర్ణాశ్రమ ధర్మం దుర్గతి పాలైనందున ఏ రాష్ట్రంలోనూ వర్ణాశ్రమ ధర్మముండలేదు అనేదీ ఇట్లే. ఇది విపరీత వాదన''.

ఇందువలన మనకు ఏమి అర్ధమౌతుంది?

ఒకదేశంలో తన చట్టం వలన ఒక సార్వభౌముడు వర్ణాశ్రమ ధర్మమును విధించలేడని, శంకరుల కాలంలోనూ సార్వభౌములు లేరు. వర్ణాశ్రమధర్మమేమో ఆయన కాలంలోనే వర్ధిల్లింది. ఆయన తర్వాత వర్ణాశ్రమ ధర్మమున్నందున, ఆయన కాలంలో కూడా వుండినదనే అనుకొనవలె. శంకర భగవత్పాదుల వారి కాలంలో వర్ణ విభాగం పూర్తిగా లోపించినదని కాదు అర్దము. అది సడలినదనీ, నియమావసరం ఎంతైనా వుందనీ దాని అభిప్రాయం.

ఆ కాలపు వ్యవహారాలు ఈ విధంగా వుండేవని ఊహిస్తున్నాను. వైదిక ప్రభావం తగ్గేసరికి ప్రజలలో కాపాలికం వంటి ఘోరమైన, అసహ్యకరమైన మతాలు తలచూపినవి. వారికి చెందిన వారు రామకృష్ణాద్యవతారములను కొలచుటకు బదులు బుద్ధుడు లేదా తీర్ధంకరులను అనుసరించుటకు ఆరంభించారు. కానివారికి ఈ మతాలను గూర్చిగానీ, వారి తత్త్వములను గూర్చిగానీ జ్ఞానముండి ఉంటుందనుట పొసగదు.

జైనబౌద్ధ బిక్షులలో స్వార్ధత్యాగులు, మహా విద్వాంసులు, నైష్ఠికులు ఉన్నప్పటికీ, వారు జనసామాన్యానికి ఆదర్శంగా వుండలేకపోయారు. సాంసారికులైన వైదికమతానుష్ఠాతలును, గృహస్థులు అయిన హిందూ గురువులను ఆదర్శపురుషులుగా వుండేవారు. పైగా కాలక్రమేణా బౌద్ధ భిక్షువులలోను ధర్మలోపం ఏర్పడ్డది. వారిలో శీలం లోపించింది. వారు ఎంతదిగజారిపోయారంటే, వారిపై ప్రహసనాలు వ్రాసేంత పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణ - మహేంద్ర పల్లవుని మత్త విలాసప్రహసనము. కానీ వర్ణవ్యవస్థ చెక్కుచెదరేదు.

69. ఆదిశంకరుల అసమాన వైభవము

ఉదయనుడు, కుమారిలభట్టుక, వీని పిదప ఆదిశంకరులు,బౌద్ధజైనములను పండితులతో వాదించి ఎదుర్కొన్నారు. ఇందులో ఆదిశంకరులు చేసిన కార్యం అద్వితీయం. ఐతే ఆదిశంకరుల అద్వైతం ఎవరో పండితులే అర్ధంచేసుకోగలరు. దానిని అనుభవంలోనికి తెచ్చుకొగలిగినవారు కోటికి ఒక్కరు. బౌద్ధజైనములను ఖండించుటతో బాటు వారొక మహోన్నతమైన కార్యం చేశారు. ఆ కాలంలో దేశంలో ప్రబలిన దుర్మతములను వారు ఖండించి వైదిక కర్మానుష్ఠానములను మరల వాడుకలోనికి తెచ్చి బ్రాహ్మణ్యమును, దాని నాయకత్వమును పునఃస్థాపనం చేశారు.

నాయకత్వం అంటే ఈ కాలంవలె జండాలు ఎత్తుకొని ఊరేగింపులూ, సభాధిపత్యములూ, పూలమాలలూ, బంగారుశాలువలూ కాదు. ఆ నాయకత్వం మౌనంగా జరిగింది. అహింస, భక్తి, ప్రేమ, అపరిగ్రహం స్వార్ధరాహిత్యం మొదలైన ఆత్మగుణములతో బ్రాహ్మణులు ఉన్న చోటుననే డంభాచారములకు పోక ప్రజలలో నిర్భయత్వమను పెంపొందించారు. ఇతరులకు వారు ఆదర్శంగా వున్నారు. భారత దేశమంటే ఏమి? భారతం అంటే దర్మం, భక్తి, ఆత్మైశ్వర్యమూ. శంకరుల విషయంలో ఆచార్యపదం అర్ధవంతమైనది. వారి బోధలు ఒక్క భారతదేశానికీ కాదు ప్రపంచమంతటికీ.

వారు దేశమంతా విజయ యాత్రలు చేశారు. దుర్మతములు దేశాన్ని వదలి పారిపోయినవి. వారి విజయం వైదిక మత విజయం. వారు ధర్మాన్ని పునఃప్రతిష్ట చేశారు. ప్రజలలో జ్ఞానము, భక్తీ, అద్వైతము, పునఃస్థాపనం చేసారు. కర్మము ధర్మమూ ఎపుడూ అవినాభావంగా వుంటాయి. వేదములన ప్రకారం వర్ణవ్యవస్థ ఏర్పడినది. కులకర్మమే కులధర్మము. అదే స్వధర్మమని గీత చెబుతున్నది. స్వకర్మ ఒకనికి జన్మతఃసిద్ధిస్తున్నది. శాస్త్రవిహిత కర్మాచరణ వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అది మొదటి మెట్టు. పిదప ఈశ్వర ధ్యానం వలన, చిత్తం మరింత పరిపక్వమై అద్వైత జ్ఞానం సిధ్ధిస్తుంది. ఆ జ్ఞానం ఈశ్వరసాయుజ్యమే.

ధర్మములను బోధించేవి స్మృతులు, ధర్మశాస్త్రములు. భక్తికి పురాణములు బోధిస్తాయి. అద్వైత జ్ఞాన సాధనము వేదాంతము. వేదాంతమనగా ఉపనిషత్తులు. మన ఆచార్యులు ఈ మూటికినీ నిధానము. జ్ఞానానికి శ్రుతి, కర్మకు స్మృతి, భక్తికి పురాణములు, ఏర్పడి వున్నవి.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం

నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్‌

వారు ఒక్క జ్ఞాన బోధనేకాదు. కర్మ భక్తి మార్గములను ప్రజలకు నిర్దేశించిన కరుణామూర్తులు. శంకరులు అంటే సుఖము కలుగచేసే వారు అని అర్ధము. శంకరులు నిజముగా లోక శంకరులు. మతాచారములు, కర్మానుష్ఠానములు నునఃప్రతిష్ఠచేసి బ్రాహ్మణ్యమును చక్కదిద్ది లోకానికి ఆదర్శమును కలుగచేశారు. వాదములతోబాటు, వారు వెళ్ళినచోటులలో ఆలయములను పునరుద్ధరించి యంత్రప్రతిష్ఠలతో, ఉగ్రమూర్తులను సామ్యమూర్తులాగా చేసి, లోక కళ్యాణమునకై పాటుపడ్డారు. ప్రజలలో ఆస్తిక్యం వర్ధిల్లుటకు షణ్మతస్థాపన చేశారు. షణ్మతమునగా, సూర్యుడు, దేవి, విష్ణు, గణపతి, శివుడు, సుబ్రహ్మణ్యుడు వీరి ఆరాధనా విధానం. షణ్మత స్థాపనతో హిందువులలో ఒక విధంగా ఐక్యత సిధ్ధించినది.

70. లేఖనావశ్యకత

బౌద్ధ విశ్వ విద్యాలయాలు అమితంగా పెరగడానికి మరొక కారణం వున్నది.

బ్రాహ్మణులు మేధాశక్తి ప్రాచుర్యంకోసం మయిమేధాం అన్న మేధాసూక్తమున్నది. ఒక మారువింటే చాలు, దానిని ధారణచేసే శక్తి వారికి వుండేది. సామాన్య జీవనమవలంబించి బ్రహ్మచర్యం చేస్తూ ప్రపంచసుఖాలకోసం కాయిక బుద్ధి శక్తులను వ్యర్ధంచేసుకోకుండా, కర్మానుష్ఠానలతో, వేదాధ్యయనంతో, గాయత్రీ పురశ్చరణతో వారు తమ మేధాశక్తిని పెంపొందించుకొనేవారు.

అధ్యాపనం, ఆరుబ్రాహ్మణ విధులలో ఒకటి. బ్రాహ్మణతరులు సందేహనివృత్తికి బ్రాహ్మణుని ఆశ్రయించేవారు. సదస్సులలో సభ్యులు అడిగే స్రశ్నలకు అతడు సమాధానమివ్వాలి. అప్పుడు నేను పుస్తకం చూచి చెపుతాను అని అనడానికి వీలులేదు. అన్ని విషయాలూ అతడు తన మస్తిష్కంలోనే పదిలపరచుకోవాలి. అతని మేధ విజ్ఞాన సర్వసకవంగా వుంటేకాని అతడు తనకర్తవ్య పరిపాలన చేయలేడు. ఆ మేధా లబ్ధి కోసం అతడు కొన్ని విషయాలు త్యాగం చేయవలసి వచ్చేది. బ్రాహ్మణుడు ఇట్లు లిఖిత పాఠం అవసరం లేకుండా వినికిడి చేతనే విద్యాభ్యాసం చేసిన కారణాన వేదములు శృతులైనవి.

ఒక విషయం గ్రంధస్థం చేస్తే మనకు తెలియకుండానే అశ్రద్ధ ఏర్పడుతుంది ''పుస్తకంలో వుంది అవసరం వచ్చినపుడు చూచుకోవచ్చును'' - అని సోమరితనం పెరిగి సమగ్ర విషయగ్రహణముపై ఆసక్తి లోపిస్తుంది. వ్రాసి పెట్టిన విషయం గ్రంధంలో వుంటుంది కానీ మేధలో వుండదు. అందులకే - సహస్రంవద, ఏకం మాలిఖ - వేయి చెప్పినా, ఒక్క విషయము కూడ వ్రాయవద్దు - అన్న నానుడి వాడుకలో వుండేది.

విషయములను గ్రంధస్థం చేసే అలవాటు బౌద్ధులకాలంలో ప్రారంభ##మైనదని నేనొక పుస్తకంలో చదివాను. క్రీ.పూ. ఆరవశతాబ్దంలో అనగా అలెగ్జాండరు మనదేశానికి రాక పూర్వము, శాస్త్రములను సారభూతంగా సూత్రబద్దములు చేసేవారు. ఉదాహరణ బ్రహ్మసూత్రమలు, యోగసూత్రములు, పాణిని వ్యాకరణసూత్రములు. అంటే లిపి సూత్రముల కాలం నుండే ప్రారంభించినదన్నమాట. కానీ మనదేశంలో వ్రాతలు ఆ కాలంలో అల్ప మాత్రంగానే వుండేవి.

రాజశాసనాలకు వ్రాత అవసరమైంది. శాస్త్ర వాఙ్మయము శృతిరూపంలోవుండేది. వేదసంహితలేకాదు, వైదిక విధులను తెల్పే బ్రాహ్మణములు కూడా శృతిరూపంలోనే వుండెడివి. వానిని గ్రంధస్థం చేయడానికి పూనుకోలేదు. ఆ రోజులలో వ్రాతపనిముట్టు గంటము, సీరా వున్నట్లు కనిపించుటలేదు. బౌద్ధమునకు సంబంధించిన అశోకుని శాసనములు - (క్రీ.పూ.3వశతాబ్దము) బ్రాహ్మీలిపిలో వ్రాయబడినవి. రామాయణ భారతములలో, రాముడు, పాండవులు విద్యాభ్యాసం చేసినప్పటికీ, వారికి వ్రాత తెలుసునని ఎక్కడా చెప్పబడలేదు. బుద్ధుని చరిత ఐన లలిత విస్తరంలో బుద్ధునికి వ్రాతనేర్పిరని వున్నది. ఆ కాలంలో విషయములు గ్రంధస్థం చేస్తే తేలిక అయిపోతాయన్న అభిప్రాయముండినదని నేను చదివిన ఒక పుస్తకంలో వున్నది.

వేదములను గ్రంధస్థం చేయరాదనీ, అట్లు లిఖిత పాఠంలో వేదాభ్యాసంచేసిన వాడు, పాఠకాధముడనీ, వ్యవహారంలో ఉండేది.

యుద్ధం చేయటం, రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొని ఉండేట్టు చూడటం, రాజ్యాంగంలో ఉద్యోగం - ఇవీ క్షత్రియుని ధర్మములు -వైశ్యునికి వాణిజ్యమూ, గోరక్షణా. నాలుగవ వర్ణంవారు కాయకృషిచేసి జీవనోపాది సంపాదించుకోవడం ధర్మములుగా చెప్పబడినవి. వీళ్ళందరూ గురుకులవాసంలో సంవత్సరముల కాలం విద్యాభ్యాపం చేయడం జరిగేపని కాదు. అట్లా చదివినా ఆ చదువు వల్ల తరువాత కాలంలో ప్రయోజనమేమి? వారి వారి పెద్దలు అవలంబించిన వృత్తులను వారిని చూచి పిల్లలు నేర్చుకొనేవారు. వంశపారంపర్యవిద్య సులభంగా పట్టుపడుతుంది. జీవితమంతా నేర్చుకొన్నా బ్రాహ్మణుడు క్షత్రియుని వలె ఖడ్గసంచాలన విన్యాసం చేయలేడు. వ్యాపారం వైశ్యుని రక్తంలోనే వున్నది. నాలుగవ వర్ణంవారు శ్రామికులు. ఈ విధానాన్ని మార్చినది బౌద్ధులు. బౌద్ధుల కాలంలో విద్యాభ్యాసానికి గ్రంధాలు ఏర్పడినవి. వ్రాత అవసరమైనది. దానితో క్రొత్తశాస్త్రములు రావడానికి ప్రారంభ##మైనది. ఎంత కుశాగ్ర బుద్ధులైనా ఈ శాస్త్ర సముద్రాన్ని గ్రంధాలు, లిపిలేక ఎట్లా తరించగలరు? అందుచేత విద్యావిధానానికి వ్రాత అత్యావశ్యకమైనది.

71. కాంచీనగర ప్రశస్తి

ఒకపుడు కంచి గొప్ప విద్యాకేంద్రముగా వుండేది. ఇక్కడా నానావిధములైన శాస్త్రములు చదివేవారు. అప్పరుస్వామి కంచిని అప్రమేయ కళానిలయమని పేర్కొన్నాడు. అనుగ్రహశక్తిమంతులై ఈశ్వరానుభవము కల్గిన మహాత్ములున్నారు. వారు ఒకరీతిలో విద్య అనవసరమని కూడ అనుకోవచ్చును. అట్టి మహాత్ములలో శ్రీరామకృష్ణపరమహంస ఒకరు. వారి శిష్యుడైన వివేకానందుడు గొప్ప విద్వాంసుడు. అప్పర్‌స్వామియు గొప్ప విద్యావంతుడు. ఆయన జైన సిద్ధాంతములను కూలంకషముగా చదివెను. జైనుడుగా వున్నపుడు ఆయన పేరు ధర్మసేనుడు. గొప్ప వినయము కలవాడు. భక్తితో బాటు వారికి ఉపనిషత్తుల జ్ఞానముకూడ ఉండినదని ఆయన వ్రాసిన తేవారముల వలన మనము గ్రహించగలము. ఆయన కంచిని గొప్ప విద్యాకేంద్రముగా పేర్కొనుట గమనింప వలసిన విషయము.

కంచి సర్వజ్ఞ పీఠమని ప్రసిద్ధి కెక్కినది. అన్ని శాస్త్ర విషయములలోనూ సదుత్తరములు చెప్పగలిగిన వారే సర్వజ్ఞపీఠమున అధిష్టించగలరు. భగవత్పాదులు సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించారు.

కాంచీనగరములో మహావిద్వాంసులైన జైనబౌద్దపండితులు వుండేవారు ఈ కోవకు చెందిన వారే దిజ్నాగుడు, ధర్మపాలుడు. ఇంతేకాక, అవైదిక కాపాలిక, కాలముఖ మతములు కాంచీమండలములో వ్యాపించుటకు ప్రయత్నించినవి. ఇక్కడ ఉన్న ఎనిమిది కాళికాలయములలోని దేవతలను సౌమ్యమూర్తలుగా చేసి, కామాక్షి దేవాలయంలో శంకర భగవత్పాదులు శ్రీ చక్రమును ప్రతిష్టించారు. కంచిలో ఒక్క హిందూ మతసిద్ధాంతములేకాక, బౌద్ధజైన మతచర్చలు కూడ జరిగేవనీ, ఒకపుడు ఇది మహూన్నతమైన విద్యాకేంద్రముగా వుండెననీ అనుటకు చారిత్రిక ఆధారములు కలవు.

72. ఘటికలను గూర్చి నా పరిశోధన

ఘటికాస్థానమనే పదం మీరు వినే వుంటారు. లేదా ఎక్కడో విన్నట్లు అనిపించవచ్చును. వినకపోయి కూడా వుండవచ్చును. మన శాస్త్రాలగూర్చిగానీ, సాంప్రదాయములను గూర్చిగానీ, పురాతన విద్యావిధానమూ, విద్యాలయాలు గూర్చిగానీ మనకు ఉన్న జ్ఞానం చాలా తక్కువే. ఈ విషయాలు వీరికి తెలిసి వుండవచ్చును అని నేను అనుకొనిన వారిని అడిగేసరికి, వారు బదులు చెప్పలేకపోయారు. ఈ పేరు విని వున్నామని వారన్నారు. తమిళ##దేశంలో ఎన్నో ఘటికాస్థానాలు వుండినవి. కానీ వీరు ''ఘటికాస్థానాలు అంటే, విద్యాస్థానాలు. అవి గోదావరి లోయలో వుండినవి, మాకు వానిని గూర్చి వివరాలు తెలియవు''. అన్నారు. ఘటికాస్థానమంటే విద్యాస్థానమని అయినా వారు తెలుసుకొనినందుకు నేను సంతోషించాను.

ఘటికాస్థానాలలో వేదములు, శాస్త్రములు, కళలు, ఆ కాలపు సైన్సులు బోధించేవారు. తరువాత కాలంలో వేదసంబంధములేని విద్యాస్థానాలను కూడ ఘటికాస్థానాలని అనే వారేమో! మొట్టమొదట వేదవిద్య బోధించేస్థానాలనే ఘటికాస్థానాలని పిలిచేవారు. తమిళంలో క్లుప్తంగా 'ఘటిక' అని పిలిచేవారు.

వేదవిద్యలే కాక లౌకికవిద్యలు నేర్పే విద్యాస్థానాలు వుండేవని నేను చెప్పాను. బుద్ధుని కాలమునకు పూర్వము కొద్దిగా వున్న ఈ విద్యాస్థానాలు బుద్ధుని అనంతరము, అధికమైనవి. ఈ విద్యాస్థానాలనే ఘటికాస్థానాలను పిలిచేవారని నేను తర్వాత తెలుసుకొన్నాను. కంచిలోని విద్యాలయాలూ ఘటికలే. వాని కోసం గోదావరికో గంగోత్రికో వెళ్ళనక్కరలేదు.

తరువాత, ఏ ఏ చోట్లలో ఇవి వుండినవని, తత్సంబంధ వాఙ్మయం, చరిత్ర ఎపిగ్రాఫి- (పురాతన వస్తువుల చరిత్ర) చదవ సాగాను. ఈ విషయంలో చాల పరిశోధించాను. దానిని గూర్చి తర్వాత చెబుతాను. ఇప్పుడే కదా స్వోత్కర్ష మొదలెట్టాను!

73. ఘటిక అనే పేరెందుకు?

ఘటిక అనేపదం నా కుతూహలాన్ని రేకెత్తించింది. అంతటితో ఈ విషయంగా పరిశోధంచసాగాను.

ఘటికకు ఒక అర్థం చిన్నకుండ అని. ఘటమంటే పెద్ద కుండ. ఘటిక అంటే, ఘడియ-24 నిముషముల కాలము, మరి విద్యాస్థానాలకు ఘటికలని పేరెలా వచ్చినది? నేను ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. నేను నా పరిశోధన మధ్యలో వదలి పెట్టలేదు.

వ్యాసమహర్షులు బ్రహ్మసూత్రములు వ్రాశారు. వానిపై భగవత్పాదులు ఒక భాష్యం వ్రాసినారు. ఆ భాష్యంపై మరొక భాష్యం (వివరణ) వాచస్పతి మిశ్ర అనేవారు, భామతి అనే పుస్తకం ఒకటి రచించారు. భామతికి కల్పతరు అనే ఒక వ్యాఖ్య అమలానందులు వ్రాసారు. ఆ కల్పతరువుపై మరొకవ్యాఖ్యయే అభోగము. దీనిని లక్ష్మీనరసింహులు రచించారు. అభోగమును చదివిన పిదప నేను కల్పతరువును చూచాను. కల్పతరువులో ఘటికా స్థాన పదప్రయోగం కనబడ్డది.

సూత్రకారులైన వ్యాసులు సన్యాసాశ్రమమనేది ఒకటి వున్నదని బ్రహ్మసూత్రములలో(3-4-20) వ్రాశారు. జైమిని తన పూర్వమీమాంసలో గృహస్తుడు స్వకర్మను అనుష్టించి మోక్షం పొందుతాడు., అతనికి వైదికకర్మ విహీనమైన సన్యాసం అక్కరలేదు, అని అభిప్రాయం వెలిబుచ్చినారు. అమలానందుని కల్పతరువులో సన్యాసి ధర్మములు వివరింపబడినవి. సన్యాసి శిరోముండనం చేసుకొని యజ్ఞోపవీతములును త్యాగం చేయనక్కరలేదని అంటారు. రామానుజల విశిష్ఠద్వైత సంప్రదాయంలో ఈ విధమైన ఆచారమున్నది. ఈ విషయంగా కల్పతరు రచయిత ''యేతు శిఖాయజ్ఞోపవీత త్యాగరూప పారమహంస్య వృత్తిం నమన్యన్తే తేన పశ్యన్తి ప్రత్యక్షఘటికాస్థానేషు పఠ్యమాన అధర్వణీం శృతిం - సశిఖః వపనం కృత్వా బహిస్సూత్రం త్యజేత్బుధః'' - అనగా పరమహంస వృత్తి అనుసరించే సన్యాసికి శిరోముండనము, యజ్ఞోపవీత త్యాగము కూడదని చెప్పేవారు ఘటికాస్థానములలో అధ్యయనము చేయబడుతున్న అధర్వణ శ్రుతిని వినలేదన్నమాట - అని వ్రాశారు.

దీనినుండి మరొక విషయము తెలుసుకొంటున్నాము. ఆ కాలంలో అధర్వణవేదం ఇంకా అధ్యయనం చేస్తున్నారన్నమాట. ఒక అద్వైత గ్రంధంలో ఇట్లా ఘటికాస్థాన ప్రశంస వచ్చినది. క్రీ.శ.పదమూడవ శతాబ్దంలో (రామానుజులకు 100-150 ఏళ్ళ పిదప) ఉన్న యాదవ వంశమునకు చెందిన కృష్ణ, మహాదేవులకు, కల్పతరువు గ్రంధకర్త అమలానందుడు సమకాలీనుడు.

క్రీ.శ.నాలుగవ శతాబ్దంలో కర్ణాటక దేశంలోని షిమోగా నుండి మయూరవర్మ అనే రాజు కంచికి విద్యాభ్యాసార్ధము వెళ్ళాడు. అతని గురువుపేరు వీరశర్మ; వారు పల్లవేంద్రపురమైన కంచిలో ఘటికా స్థానంలో చదువుకొన్నారని షిమోగాజిల్లా, తలగుండ అనేచోట, ప్రణవేశ్వరస్వామి ఆలయంలో వున్న కకుత్ధ్సవర్మ కాలమునకు చెందిన శిలాశాసనంలో వున్నది. అనగా ఆ కాలంలోనే కంచిలోని ఘటికాస్థానం అంత ప్రసిద్ధి వుండేదని తెలుస్తున్నది.

విద్యాభ్యాసంకోసం 1000 లేక 1500 మైళ్ళదూరం, రాకపోకలకు రైళ్ళు, బస్సులులేని ఆ కాలంలో వారు వెళ్ళేవవారన్నమాట. కంచినుంచీ కాశీకి లేదా పాటలీపుత్రం కూడా వెళ్ళేవారు.

క్రీ.శ.నాలుగవ శతాబ్దం మయూరవర్మ కాలంలో కంచిలో పల్లవరాజు స్కందశిష్యుడు రాజ్యం చేసేవాడు. అతడు సత్యసేనుడిని ఓడించి ఒక ఘటికను సంపాదించాడట. ఆర్కోణం సమీపంలో వున్న వేలూరపాళ్యం శాసనంలో ఈవిధంగా వున్నది.

స్కంద శిష్యస్తతో అభవద్విజానాం ఘటికాం

రాజ్ఞ స్సత్యసేనా జ్ఞహరయః

'ద్విజానాం ఘటికం' అంటే వైదిక విద్య బోధించే బ్రాహ్మణ ఘటిక. అశోకుని శాసనంలో పేర్కొనబడిన సత్యపుత్రుడు, సత్యసేనుడూ ఒక్కరే అయివుండాలి. ఈ సత్యపుత్రులు తొండమండలాధిపతులుగా వుండేవారు.

నరసింహవర్మ కంచిలో కైలాసనాధ ఆలయం నిర్మించుటతో బాటు, ఒక ఘటికాస్థానాన్ని కూడ పునర్నిర్మాణం చేశాడట.

తత్పుత్ర సూనః నరసింహవర్మా

పునర్వ్యధాత్‌ యో ఘటికాం ద్విజానాం

శిలామయంవేశ్మ శవాంక మౌళేః

కైలాసకల్పంచ మహేంద్రకల్పః

నరసింహవర్మ పిదప రాజులు క్షీణించారు. వారి పిదప చెట్టియార్లు, పిళ్ళైలు మతసంరక్షణకు పూనుకున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ, పాఠశాలల నిర్మాణంలాటి ఎన్నో పుణ్యకార్యములు వీరు చేశారు. విద్యయొక్క ప్రయోజనం ఈశ్వరుణ్ణి తెలుసుకోవటమే. మనకు ఎంతో విద్వత్తువున్నా, ఆ సర్వజ్ఞాని ముందు అది అవలేశ##మే అన్న నమ్రత మనకుండవలెను.

ఒకప్పుడు కంచికి రాజు లేకపోయాడు. ఊరిపెద్దలందరూ చేరి హిరణ్యవర్మ కుమారుడు పరమేశ్వర వర్మను కంచికి రాజుగా ఉండవలసినదని ఆయనకు రాయబారము పంపారు. అందులకు హిరణ్యవర్మ అంగీకరించారు. పరమేశ్వర వర్మ, నంది వర్మ పల్లవుడన్న బిరుదునిచ్చి పట్టాభిషేకం చేశారు. రాయబారంలోనూ పట్టాభిషేక ఉత్సవంలోనూ ఘటికాస్థలంలోని అధ్యాపకులు పాల్గొన్నారట. ఈ విషయం వైకుంఠపెరుమాళ్‌ ఆలయ శాసనం చెబుతున్నది.

వాతాపి (బాదామి) నుండి పరిపాలిస్తున్న చాళుక్యులకు 'విక్రమాదిత్య' 'సత్యాశ్రయ' అన్న బిరుదులుండేవి. చాళుక్యులు పల్లవులు ఒకరిపై ఒకరు దాడి చేసేవారు. జయాపజయాలు సమానంగా వుండేవి. కైలాసనాధాలయంలో మహామండపం పడమర భాగంలో వున్న స్తంభం మీద ఒక శాసనమున్నది. చాళుక్యరాజు విక్రమాదిత్య సత్యాశ్రమునిచే చేయబడిన దానముల వివరణ అందున్నది. ఘటికలలోని వారిని ఆ శాసనం మహాజనులని పేర్కొన్నది. 'ఈ దానములకు హాని చేసేవానికి మహాజనులను హత్య చేసే పాపం సంక్రమిస్తుంద'ని అందులో వున్నది. గంగా తీరంలో నల్ల గోవును చంపితే మహాపాపం. ఒక మహాజనుడిని చంపినా అంతే పాపం.

74. కర్ణాటకం - ఆంధ్రదేశంలో ఘటికాస్థానాలు

తెలుగుదేశం గోదావరీ ప్రాంతంలో ఘటికస్థానాలు క్రీ.శ.ఆరవ శతాబ్దంలో వుండేవి. తుని తాలూకా చిక్కుళ్ల అగ్రహారంలో ఒక తామ్రశాసనం దొరికింది. విష్ణుకుండినవంశంలోని రెండవ విక్రమేంద్రవర్మ నాటిదీ శాసనము. అందులో 'యధావిధి వినిర్మాసిత ఘటికావాస్త పుణ్య సంచయస్య' అన్న వాక్య మొకటియున్నది.

కర్ణాటకంలో తుమ్‌కూరు జిల్లాలోని హేమవతి తోట్టప్ప ఆలయంలో ఒక శాసనం లభించినది. అది క్రీ.శ.పండ్రెండ్రవ శతాబ్దము త్రిభువన మల్లిదేవ చోళమహారాజు కాలమునాటిది. అందు - శ్రీమదు హెంచార పట్టణద మహాఘటికాస్థాన శ్రీ నోనంపేశ్వర దేవర సన్నిధినల్లి - అన్న వాక్యం కర్ణాటక భాషలో వున్నది.

మైసూరు రాష్ట్రంలో మాండ్య తాలూకాకు చెందిన హలెకెరే గ్రామంలో లభించిన శాసనం వలన పృధ్వీకొంకణ మహరాజా శివకుమారుడు, ఘటికలో అధ్యాయనం చేస్తూ వున్న వేయిమందిలో ఒకరికి భూదానం చేసినట్లు - ఘటికాసహస్రాయ హరితస గోత్రాయ మాధవ శర్మణ - అను ఒక వాక్యమున్నది.

చెన్నరాయ పట్టణంలో క్రీ.శ.1442 కు చెందిన శిలాశాసనంలో - ''దుందుభౌ హయనే భాద్రపదే మాసి శుభదినే ఉత్తంగోక్త్వా సామవేదే వ్యధత్త ఘటికాశ్రమం'' దుందుభి సంవత్సరం భాద్రపదమాసములో ఉత్తుంగుని ఆజ్ఞచేత సామవేదాధ్యయన నిమిత్తం ఒక ఘటిక నిర్మింపబడినదని ఉన్నది. ఘటికాస్థానమనులకు బదులు ఘటికాశ్రమం అన్నపద ప్రయోగం ఈ శిలాశాసనంలో చేయబడ్డది. ఈ చోట పురాతనగురుకులము వలె, నూర్లకొలది శిష్యులకు ఆచార్యులనేకులు విద్యాదానం చేసి యుండవలెనని మనము ఊహించవచ్చును.

ఉత్తర ఆర్కాటుజిల్లాలో చెయ్యారు తాలూకాలో బ్రహ్మదేశమనే గ్రామమొకటి ఉన్నది. అక్కడ ఉన్న చంద్రమౌళీశ్వరుని ఆలయంలో ఉత్తరభాగంలో గోడపై ద్రావిడభాషలో - త్రైరాజ్య ఘటికా మధ్యస్థమూవాయిరవర్‌ - మూడువేలమంది ఘటికలో విద్యాభ్యాసం చేస్తూ ఉండినట్లు వ్రాయబడినది. కొన్నిచోట్ల, 'ఘటికైఏళాయిరవర్‌' ఘటికలో ఏడువేల మంది చదివినట్లు వున్నది. తంజావూరు జిల్లా వేపత్తూరులో కూడ ఘటిక ఒకటి వుండేది.

ఈ ఘటిక అన్న పదప్రయోగం ఎందుకు చేసారు? ఘటమంటే కుండ. ఘటిక అంటే చిన్నకడవ. లత - లతిక, పత్ర - పత్రిక అన్నట్లే ఘటం ఘటిక ఔతుంది. కానీ ఘటికకు విద్యాస్థానానినికీ ఏ విధమైన సంబంధం?

కుమారిలభట్టు తంత్ర వార్తిక మనే పుస్తకం వ్రాసారు. అందులో కల్పసూత్రాధికరణమనే భాగంలో ఒక శ్లోకంలో 'ఘటికామార్గవృత్తిషు' అన్న పదప్రయోగం చేయబడింది. అనగా క్రీ.పూ.500 సంవత్సరముల క్రితం కూడ ఘటికలనే విద్యాస్థానములున్నట్లు రుజువవుచున్నది. తాంత్రికులు, మీమాంసకులు బౌద్ధులను ఎదుర్కొన్నారు. వేదవిద్యకు సంబంధములైన ఘటికలు ఈ విద్వాంసులను చేరదీయడానికి ఏర్పడి వుంటాయి. అపుడు ప్రారంభ##మైన ఘటికలు తరువాత శతాబ్దములవరకు వ్యాపించినవన్నమాట.

కుమారిలభట్టు ప్రయాగలో వుండేవారు. ప్రయాగను తరువాత కాలంలో అలహాబాదని పిలువసాగారు. అనగా ఘటికలు ఉత్తరంలో గంగా తీరం నుంచీ దక్షిణంలో చోళ##దేశం వఱకు వ్యాపించినవి.

తంత్రవార్తిక వ్యాఖ్యాత, భట్టసోమేశ్వరుడు ఘటికాస్థానాన్ని ఈ విధంగా నిర్వచించాడు.

''వేదకౌశలజిజ్ఞాసార్థం తత్తత్‌ వేద భాగ చిహ్న లేఖ్యాని ఘటికాయాం కుంభకాయాం నిక్షిప్య తత్తద్‌ వేదాభాగపరీక్షకాలే తాన్యాకృష్య ఆకృష్యలేఖాచాహ్నితం వేదంపాఠ ఇత్యధ్యేతారః అనుయుజ్యంతే ఇతి ఘటికామార్గ వర్తినో లనుయోగః''

'అనుయోగేషు ఘటికామార్గవర్తిషు' అన్న పదప్రయోగం తంత్రవార్తికంలోనిది భట్టసోమేశ్వరుడు దీనిని వ్యాఖ్యానిస్తూ 'ఘటికామార్గ వర్తినో అను యోగః' అని వివరిస్తూ విరమించాడు. ఘటికలలో జరిగే విద్యా వ్యాసంగాన్ని 'ఘటికా మార్గ వృత్తి' అని చెప్పారు. అచ్చట ఆ విధంగా చదివేవారు, 'ఘటికా మార్గ వర్తులు'. అక్కడ సరిగా మీమాంసను, పరీక్షను - 'అనుయోగం' అని వ్యవహరించారు. ఘటికలను (కుండలు) ఉపయోగించి పరీక్షలు ఘటికలో (విద్యాస్థానాలు) నడపబడేవని సోమేశ్వరుడు వివరించాడు.

విద్యార్థుల వేద విద్యాకౌశాల్యాన్ని పరీక్షించడానికి, ఆయావేదభాగములను తెలిపే లేఖలు, లేక చీటీలు, కుండలలో వుంచి పరీక్ష కాలంలో ఏదో ఒక చీటీని పైకి తీసి, ఆ చీటీలో వ్రాయబడిన వేదభాగాన్ని విద్యార్థిని అధ్యయనం చేయమని పరీక్షకాలంలో నిర్దేశించేవారట. ఈ విధంగా ఘటికలలో పరీక్షలు జరిపేవారు.

వేదపరీక్షలకు ఘటములను ఉపయోగించడం సముచితంగానే వుంది. వేద ధర్మమనేదొక అనాదికాల వృక్షము. ఆ వేద ధర్మమనే వృక్షమునకు ఫలములే ఆలయములు. ఆలయములలో గోపురములు, విమానములు కలశములు, విగ్రహములూ వుంటవి. ఇవన్నీ వేదమంత్రములతో చైతన్యవంతములౌతవి. గోపురములపై కుంభములుంటవి. ఆ కుంభముల ద్వారా మంత్రపూతమైన జలముతో విగ్రహములకు అభిషేకం చేస్తారు. దీనినే, కుంభాభిషేకమని అంటారు. ఈ విధంగా కుంభమునకు వైదిక సంబంధమున్నది. ఆలయంలో విగ్రహములను చైతన్యవంతం చేసే ప్రక్రియలోనూ, ఘటికాస్థానములలో వేద విద్యాకౌశల్య పరీక్షలలోనూ ఘటికలు, ఉపయుక్తములౌతున్నవి.

కడలూరు, పాండిచేరికి మధ్య ఉన్న బాహూరు, అనే చోట కొన్ని తామ్రశాసనములు లభించినవి. చాతుర్దశ విద్యలను బోధించడానికి ఒక పెద్ద, విద్యాశాల బాహూరులో వుండేదట. ఒక్కొక్క విద్యకూ ప్రత్యేకమైన విభాగములుండేవట. అ తామ్రశాసనములో, విజయనృపతుంగ మహారాజు మంత్రి, క్రీ.శ.తొమ్మిదవ శతాబ్దంలో ఈ విద్యాలయ నిర్వహణ కొఱకు మూడు గ్రామాలు దానం చేసినట్లు చెప్పబడినది.

బాహూరు సమీపంలో త్రిభువనమనే చోట వరదరాజు స్వామి ఆలయమున్నది. ఈ ఆలయంలో తూర్పు, పడమర, ఉత్తర దిశలలో వున్న గోడలపై కొన్ని శాసనములున్నవి. ఇవి క్రీ.శ.1048 కి చెందిన రాజాధిరాజు కాలమునకు చెందినవి. త్రిభువనంలో ఒక పెద్ద విద్యాస్థానముండేదట. అచట నూట తొంబై విద్యార్థులు, పండ్రెండు ఉపాధ్యాయులు వుండేవారట. ఆ విద్యార్థులలో 60 మంది సామవేదము, మిగిలిన 50 మంది ఇతర శాస్త్రములను అధ్యయనం చేసేవారట. వారిలో 70 మంది వేదాంతమూ, రూపావతారమనే వ్యాకరణ శాస్త్రమూ చదివేవారట. ఇవేకాక, భారతము రామాయణము, మనుధర్మశాస్త్రమూ కూడా చెప్పేవారు.

వైఖానసమని ఒక వైష్ణవ ఆగమమున్నది. శ్రీవైష్ణవులకున్న నాలుగు ముఖ్యాలయములు. శ్రీరంగము, తిరుపతి, కాంచీపురము, మేల్కోట. తిరుపతి ఆలయంలో జరిగే ఆరాధనా విధానం వైఖానసాగమానుసారి. మిగతా ఆలయాలలో పాంచరాత్ర విధానాన్ని పాటిస్తారు. త్రిభువనంలోని విద్యాస్థానంలో వైఖానసమును నేర్పేవారు. ఈ పాఠశాలలోని విద్యార్ధులకు, అధ్యాపకులకు, విద్య తప్ప వేరే కార్య క్రమం ఏదీ లేదని అక్కడ దొరికిన శాసనం చెబుతున్నది.

విళ్ళువురం తిండివనం మధ్య ఎన్నాయిరం అనే గ్రామం ఒకటి వున్నది. దీనికి రాజరాజ చతుర్వేది మంగలమన్న పేరుకూడా వున్నది. నాలుగు వేదాలు అధ్యయనం చేసిన బ్రాహ్మణులకు ఈ గ్రామం రాజరాజు దానం చేసాడు. మొదటి రాజరాజేంద్ర కాలపు శాసనం ద్వారా ఇచ్చటి విద్యాస్థానంలో 340 మంది విద్యార్థులు, 14 అధ్యాపకులు వుండిరని తెలుస్తున్నది. వీరిలో 270 మంది పై తరగతులలోనూ. 70 మంది క్రింది తరగతులలోను ఉండెడివారట, 270 మందిలో 75 మంది ఋగ్వేదము, 75 మంది యజుర్వేదము, 20 మంది సామవేదపు చాందోగ్యశాఖ, 20 మంది సామవేదీయాతలవకారశాఖ, 20మంది శుక్లయజుర్వేదము (వాజసనేయము) 10మంది అదర్వవేదము, 20 మంది బోధాయన గృహ్యకల్పము (వేదాంగభాగం) 40 మంది రూపావతారము చదివేవారట.

75. అధర్వవేదము

కొన్ని శతాబ్దములుగా అదర్వవేదాధ్యయనము క్షీణించిపోయినది. కాని క్రీ.శ.11వ శతాబ్దములో ఎన్నాయిరములో 10 మంది అధర్వం అధ్యయనం చేసినట్లు, చూస్తున్నాము. ఘటికల గూర్చి చెబుతూ కల్పతరువులో అధర్వవేదము ప్రసక్తి వచ్చినదని ఇంతకు ముందే చెప్పాను. బాహూరులో కూడ అధర్వవేదాధ్యయనం జరిగివుండాలి. ఇక్కడ చతుర్దశ విద్యలూ నేర్పబడేవి. కాలక్రమేణా అధర్వం చదివేవారి సంఖ్య లుప్తమైపోయింది.

76. ఆలయాలు-విద్య

వేయి ఏళ్ళక్రితం, పాండ్యులూ పల్లవులకంటే, చోళులు పరాక్రమవంతులుగా ఉండేవారు. విజయాళుని అనంతరం పరాంతకుడు, రాజరాజు, రాజేంద్రచోళుడు చోళరాజు సీమలను విస్తరింపచేశారు. వీరి కాలంలో కళలు ఎంతో అభివృద్ధిగాంచినవి. పల్లవుల కాలంలో చాల పెద్ద ఆలయాలు నిర్మింపబడితే, చోళుల కాలంలో చిన్న చిన్న ఆలయములు నిర్మింపబడినవి. విద్య, వాఙ్మయం, నృత్యము గానకళ, సర్వతోముఖంగా వ్యాపించినవి. వీని కన్నిటికీ, ఆలయం స్థూలకేంద్రముగా విలసిల్లేది.

ఆ కాలంలో అనేక శైవాలయములలో వ్యాకరణ దాన మండపములని నిర్మించేవారు. ఆలయాలలో విద్యా వ్యాసంగం నడిచేది. చిదంబరం, తంజావూరు ఆలయాలలో రెండతస్తుల మేడలు వున్నవి. ఇవన్నీ చోళుల కాలంలో పది పండ్రెండవ శతాబ్దములలో నిర్మింపడబడినవి. వీనిలో గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేయబడినవి. ఎన్నో గ్రంథములు సేకరించి విద్యార్థులకూ అధ్యాపకులకూ పుస్తకాలు అందుబాటులో వుండేటట్లు చేయబడినది.

ఈ ఆలయాలలోని విద్యాలయాలలో ఒక్క మత సంబంధమైన విద్యలేకాక, సామాజిక విద్యలు కూడా నేర్పబడేవి. సామాజిక విద్యలు చెప్పబడినంత మాత్రాన మతాన్నీ దేవుణ్ణీ, నిరసించారని అర్ధంకాదు. ఏ విద్యకైనా దైవ సంబంధమున్నదని ప్రజలకు అభిప్రాయం కలగడానికే ఏర్పాటు. ఈ చోట్ల ఆయుర్వేదంకూడా చెప్పేవారు. అంటే వైద్య కళాశాలలూ వుండేవని అర్థమౌతుంది.

ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలలో కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెడుతున్నది. దీనిలో నూటికి ఒక్క పాలు పురాతన శాస్త్ర పరాశోధనా ప్రణాళికపై ఖర్చు పెట్టగలిగితే ఎంత ఉపయోగకరంగా వుంటుంది? విద్యార్థులకు వేతనాలు ఇచ్చి, వారు పరీక్షలలో ఉత్తీర్ణులైన పిదప, రీసెర్చికి వలసిన ఆర్థిక సదుపాయాలు చేయగలిగితే మన ప్రాచీన శాస్త్రములను పునరుద్ధరించడానికి ఎంతో అవకాశముంటుంది. కాని ఈ కాలపు ప్రభుత్వం, వారు చెప్పే నిబంధనలకు ఒప్పుకొంటేకానీ ఆర్థిక సహాయం చేయడంలేదు. అందుచేత ప్రభుత్వాలపై ఆధారపడుటకంటే శాస్త్రములపై గౌరవమూ అభిరుచీ కల ప్రజలు ఇలాంటి విద్యాస్థానాలు స్థాపించుటకు పూనుకొంటే మంచిది.

77. సరి అయిన పద్ధతి

మన ప్రాచీన కళలను నేర్పడానికి ఏర్పరచే విద్యాలయాలు ప్రాచీన విద్యా విధానాన్ని అనుసరించేవిగా వుండాలి. ప్రాచీన శాస్త్రములను ప్రాచీన విధానంలోనే బోధించాలి. అమెరికాలో నిర్మించబడిన ఆలయాలలో అర్చించబడే మూర్తులకు అర్పించే నైవేద్యం-పుళిహూరే గానీ, బిస్కెట్లు కావుకదా! భరత నాట్యంలో నర్తకి వస్త్రలంకరణ వెయ్యేండ్లక్రితం శిల్పాలలో వున్న విధంగా వుంటుందేకానీ ఈ కాలపు దుస్తులు ధరించడం లేదు కదా! ఈ కాలపు విద్యాలయాలలో విద్యార్థులు విదేశీయ వస్త్ర విధానాన్ని అనుసరించే విధంగా కాక మన శాస్త్రాలు చదివే విద్యార్థులు ప్రాచీన పద్ధతిలో స్వదేశీ వస్త్ర విధానాన్ని అనుసరించాలి.

ప్రాచీనకాలంలో, గురుకులాలను మన ఋషులు పర్ణకుటీరాలలో నడిపేవారు. మధ్యకాలంలో ఘటికలు పట్టణాలకొచ్చినవి. పూర్వ కాలపు పట్టణములకూ ఈ కాలపు పట్టణములకూ ఎంతో తేడా వున్నది. నాగరికత ప్రబలిన ఈ కాలంలో విద్యా స్థానాలు పట్టణాలలో స్థాపిస్తే మన ప్రాచీన విద్యావిధానమునకు వలసిన బ్రహ్మచర్యాది వ్రతానుష్ఠానాలకు అనుకూలంగా వుండదు.

ప్రాచీన కాలంలో ఋషివాటికల లోని విద్యాస్థానాలు ప్రశాంతంగానూ, ప్రకృతి సౌందర్యముతోనూ భాసించేవి. పశువులు, జింకలు, లతాగుల్మములు, పూలచెట్లు, వీని మధ్య విద్యార్థులు గాయత్రీ మంత్ర జపకులై సంతోషంగా కాలం వెళ్ళబుచ్చేవారు. ఆనాటి వాతావరణ, జీవనము ఈ రోజులవలె యాంత్రికంగానూ క్లిష్టంగానూ వుండేదికాదు. ప్రాచీన విద్యా విధానాన్ని మనస్సులో వుంచుకొనే విశ్శకవి రవీంద్రనాథ్‌ ఠాగుర్‌ తన విశ్వభారతిని శాంతినికేతన్‌ అన్నపేరిట స్థాపించాడు. విద్యాభూములు ప్రకృతి రమణీయతతో శోభిల్లేవి.

నగరాలకు దూరంగా కొన్ని విద్యాస్థానాలు మనం నెలకొల్పాలి. ఆ విద్యాలయాల వాతావరణం ఈ కాలపు నాగరికతతో కలుషితం కానట్లు చూడాలి. ప్రశాంతి, ప్రకృతి, సౌందర్యంతో నిండిన ఈ చోట్లలో విద్యార్థులు విద్య నేర్వాలి. పెద్దపెద్ద భవనాల అవసరం లేదు. పర్ణకుటీరాలు చాలు. విద్యా గ్రహణమే ప్రథానమైన అంశంగా వుండాలి.

78. అక్షరాస్యతా, నేరాలు

ఎక్కడెక్కడ ఎక్కువ ఆధునికమైన చదువులు చదువుతున్నారో, అక్కడ నేరంచేసే ప్రవృత్తీ అధికంగా వుంటున్నది. ప్రపంచం అంతా ఎలాంటి విద్యావిధానం అవలంబిస్తున్నదో ఈ ఒక్క విషయమే చెబుతోంది. స్కూళ్ళు, కాలేజీలు, పోస్టుగ్రాడ్యుయేటు కోర్సులూ వున్నచోటే నేరాలు అమితంగా జరుగుతున్నవి.

గ్రామాల్లోనూ, ఆటవిక ప్రదేశాలలోనూ, నేరాలు అంత ఎక్కువగా జరగటంలేదు. ఆటవిక జనంలో నిజాయితే చదువు కొన్న వారికంటే ఎక్కువగా కనిపిస్తున్నది. వారికి లాయర్లు అవసరంలేదు.

ఆధునిక విద్యా విధానంవల్ల నేర్పుగా, తెలివిగా అన్యాయం చేయడం ప్రజలు నేర్చుకొంటున్నారు. కర్మాగారాలు నడిపేవారు, రాజ్యాగం చేసేవారు చేసే నేరాలు కోర్టులుదాకా రావటంలేదు అంటే వారి చాకచక్యం ఎంతో ఇట్టే తెలిసి పోతుంది. ఇదంతా ఈనాటి విద్యామహిమే. నేరాలలో ముప్పాతికవంతు పోలీసు వరకూ కోర్టులు దాకా రావటంలేదు. అజ్ఞాతంగానే వుండిపోతున్నది. బ్యాంకుల దోపిళ్ళు, అత్యాచారాలు, అమాత్యవర్గాన్ని సమూలంగా బుల్లెట్లతో చంపటం, ఒక మంత్రివర్గాన్ని పడదోసి దాని స్తానంలో మరొక మంత్రివర్గం రావటం ఇలాంటివి ఎంతో నేర్పుగానూ, లాఘవంగానూ నాగరిక విద్యా ప్రభావంచేత ప్రజలు చేయటం మనం తరచు చూస్తున్న విషయమే. ఇవేకావు. కొట్లాటలు, రెచ్చకొట్టడం, అమాయకులను హింసించడం, లంచగొండితనం, బలాత్కారం మొదలైనవి విద్యా శాతం ఎక్కువగా వున్న దేశాలలో మరింత ఎక్కువగా నున్నది. విశ్వవిద్యాలయాలలో, సెనేటు మీటింగులలో కూడా, రాళ్ళతో పరస్పరం కొట్టుకొంటున్నారు. లేదా కుర్చీలతో ఒకరినొకరు మొత్తుకొంటున్నారు. ఈనాటి నాగరీకం ఇలా వుంది.

ఆదివాసులలో ఎప్పుడో ఒకప్పుడు కుటుంబ కలహాలలో, క్రోధంతో ఒకరినొకరు శిరశ్ఛేదం చేసుకొంటారేమో. కానీ అవన్నీ క్షణికోద్రేకం వల్ల జరిగే నేరాలు. లేకుంటే వారు శాంతంగానే జీవితాలు గడుపుకొంటున్నారు. అక్షరాస్యత లేనందువల్ల, వాళ్ళకు దొంగచెక్కులు వ్రాయటం, ధనాగారాలను దోచుకోవటం తెలియటంలేదు.

79. అయితే విద్య అనవసరమా?

మహాత్ములందరూ జనానికి విద్య ఎంత అవసరమో నొక్కిచెప్పారు. వ్రాత తెలియనివాడు దుంగతో సమానం అని తమిళ కవయిత్రి అవ్వైయారు చెప్పింది. భర్తృహరి, 'విద్యావిహీనఃపశుః' విద్యలేనివాడు పశువుతో సమానుడు-అని అన్నాడు. మహాత్ములు విద్య అవసరం గూర్చి చెప్పినది ఒకటి; ఈ కాలపు చదువులు చదివిన ప్రజల చర్య మరొకటి. మహాత్ములు. 'విద్యాదదాతి వినయం' విద్య వినయాన్ని ఇవ్వాలి అని చెప్పారు. ఈశ్వర అస్తిత్వంపై నమ్మకం, అతని యందు భక్తీ, విద్య వృద్ధి చేయాలి. అట్టి చదువే చదువు. అక్షరాస్యతవేరు, విద్యవేరు. ప్రజలలో భక్తి లోపించిన కారణం చేతనే వారు పెడత్రోవలలో పోతున్నారు.

అరబ్బుదేశాలలో ఎక్కువ పాళ్ళు ముస్లింలున్నారు. మన ధర్మశాస్త్రం వలె వారికి ''షేరియత్‌'' వున్నది. ముస్లిం జనులకు వారి మతమంటే అభిమానము, గౌరవమూ. వారిలో నేరములూ తక్కవే. పాశ్చాత్యులు రోజుకొక్క ఫాషన్‌ పాటిస్తారు. కానీ ముస్లిములు వారి శాస్త్రం నిర్దేశించినట్లే సాధారణంగా జీవితం గడుపుతారు. వాళ్ళ వేషభాషలలో నాగరికతా ప్రభావం అంతగా కానరాదు. వాళ్ళలో ఒక విధమైన నియమ పాలన మున్నది. హిందూమతానికి ముస్లిములు అపకారం చేసినా, వారి మతాభిమానం వారి మతనిష్ఠ మాత్రం మెచ్చుకోతగ్గదే.

కమ్యూనిస్టు దేశాలలో మతాన్ని బహిష్కరించారు. అస్తికులమైన మనకు వారి నాస్తిక్యం అంగీకారం కాదు. అయినప్పటికీ మత స్థానంలో వారు నియమాన్ని ప్రవేశ##పెట్టారు. కఠినమైన చట్టాలు అమలులోకి తెచ్చి ప్రజలలో ఒక భయాన్ని వాళ్ళు కల్పించగలిగారు. అందుచేత ఆదేశాలలో నేరాలు తక్కువ.

ఐతే మానవుడు విధించిన చట్టాలకు భయపడే ఒక నియమ పాలనం చేయటంకంటే, భగవద్విశ్వాసంతో, భగవంతుని చట్టములను మనసా వాచా పరిపాలించటం ఎంతో గొప్ప. భగవంతునియందు ప్రేమతో, స్వధర్మానుష్ఠానం చేయటం అంతకంటే గొప్ప.

కానీ ప్రజానీకానికి సామాన్యంగా ఒక లక్ష్యపరిపాలన చేయటం అంతసులభ##మైన పనికాదు. అందుచేతనే పూర్వకాలంలోని విద్యాలయాలు శాస్త్రసమ్మతమైన ధర్మస్మృతులను బోధించేవి. గురువు అధీతి బోధాచరణలతో శిష్యులను సన్మార్గగాములుగా చేసేవారు.

కానీ దురదృష్టవశాత్తు మనదేశంలో కమ్యూనిస్టుదేశాల వలె నియమనమూలేదు. శాస్త్ర విహిత కర్మాచరణాలేదు. ప్రభుత్వం తన్ను సెక్యులర్‌-ఏ మతానికి సంబంధించినదికాదని-చెప్పుకొంటూ, ప్రజలలో ఒక విధమైన నిరంకుశత్వం ప్రబలడానికి కారకమైనది.

వట్టి విద్యాలయాలు స్థాపించినంత మాత్రాన ప్రయోజనం లేదు. మీలో ప్రతిఒక్కరూ ఏదో ఒక శాస్త్రంలో నిష్ణాతులుకావాలి. పరంపరాగతంగా వస్తున్న ఈ శాస్త్రములు ఏవిధంగానైనా మనం దక్కించుకోవాలి. ఆఫీసుకుపోయి, మాసవేతనం గ్రహించి, ఇంట్లో సంసార భారం వహిస్తే చాలదు. ఏదో ఒక శాస్త్రం-ప్రాచీన కాలంనుంచి మనకు ప్రాప్తించినది-అధ్యయనం చేయాలి. దాని లోతుపాతులు చూడాలి. అధ్యాపకులకు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడంతోబాటు, మీరు కూడా విద్యార్థులై విద్యాగ్రహణ చేయాలి.

భాషలో ఆసక్తి ఉంటే, వ్యాకరణమో, నిరుక్తమో చదవాలి. లేదా తర్కాన్ని నేర్చుకోవచ్చు. సంగీతంలో అభిరుచివుంటే, వీణ, మృదంగం, జలతరంగం, లేదా నోటిపాటనో నేర్చుకోవచ్చును. అదీ లేకపోతే ఒక చిన్న గునపమూ, సుత్తీ తీసుకొని శిల్పకళను అభ్యసించండి. చిత్రకళ నేర్చుకోండి. మన ఆలయాలు చూస్తే చాలు. ఒకప్పుడు మనకళలు ఎట్లా అంబరమును చుంబించినవో బోధపడుతుంది.

80. అహాన్ని అణచాలి

అహంకారం తొలగేదెట్లా? మనం ఏ కళను నేర్చుకొన్నా దానిని ఈశ్వశరార్పణం చేయాలి. ఈశ్శరార్పణకాని కళ అహంకారానికి దారితీస్తుంది. మేము పీఠాధిపతులుగా వున్నాం. దాని ఉద్దేశ్యమేమి? ప్రజలలోని అహంకారమును తగ్గించి వాళ్ళను ఈశ్శరోన్ముఖులుగా చేయడానికే ఈ పీఠాలు ఏర్పడినవి. ఏ కళ నేర్చుకొన్నా, దానిని వ్యాప్తి చేసినాం, అవి అన్ని ఈశ్వరానుగ్రహ కారణంగా జరుగుతున్నదన్న విషయం మనం మరువరాదు. మనలోని కళాకౌశల్యం ఈశ్వరస్మరణకు సహాయకారిగా వుండాలి.

వాఙ్మయమే మీకు అభిరుచి అయితే మీరు శబ్ద బ్రహ్మాన్ని అన్వేషించాలి. గానమే మీ అభిమాన వస్తువు అయితే మీరు నాద బ్రహ్మాన్ని అన్వేషించాలి. తర్కశాస్త్రంలో రుచివున్నట్లైతే తర్కమూలంగా పరమాత్మను అన్వేషించాలి. గణితం మూలంగా అప్రమేయమైన వస్తువు ఏది? అన్న వితర్కం చేయాలి. గణిత శాస్త్రజ్ఞులు అయిన ఆర్యభట్టు, భాస్కర రాయలు, తమ మంగళాశాసనములలో వారి శాస్త్రవిషయం ఈశ్వర తత్త్వమే అని వ్రాసుకొన్నారు. అన్ని శాస్త్రములూ పరమేశ్వశరుని సృష్టిని గూర్చిన విషయాలనే చెబుతున్నవి.

భూగోళశాస్త్రం - పర్వతాలు, నదులూ, లోయలూ, ఎడారులూ, వివిధ దేశముల నైసర్గిక వాతావరణాల గూర్చి బోధిస్తుంది. ఖగోళశాస్త్రమును చదివామంటే, మినుకుమనే నక్షత్రాలు, గ్రహాలు, కంటికి కనబడని ప్రపంచాలను గూర్చి తెలుసుకొని నివ్వెరపోతాం. ఇట్లా చూస్తే, అన్ని శాస్త్రాలు ఈశ్వరుడు సృష్టించిన ప్రపంచానికి సంబంధించినవే; ఇవన్నీ అంతిమంలో పరమార్థతత్త్వ బోధకములే. ఇది గ్రహిస్తే కానీ మనకు విద్యాగర్వం దూరంకాదు.

అయితే మీరు అనవచ్చు ''ఏదో దూరంగా ఈ మఠంలో కూర్చుని మమ్ములనుప్రాచీన శాస్త్రాలు చదవండి, కళలు నేర్చుకోండి అని మీరు అంటారు. జీవితంలో ఎలాంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నామో, ఎలాంటి కష్టాలు పడుతున్నామో, మీకెట్లా అర్థం ఔతుంది'' అని. మీకు శ్రద్ధ అనేదొకటివుంటే ఏ కష్టాలూ మీ విద్యావ్యాసంగానికి అడ్డురావు. మీరు 24గంటలూ జీవిక కోసం వెళ్ళబుచ్చుటలేదుకదా? సినిమాలు చూడటానికీ, పేక ఆడడానికీ, దినపత్రిలు చదవడానికీ, కబుర్లు చెప్పుకోడానికీ ఎంత కాలం వృధా చేస్తున్నారు? ఆ కాలం విద్యకు వినియోగిస్తే ఎంతలాభదాయకం! మీరూ బాగుపడుతారు. సమాజానికీ దానివలన ప్రయోజనం వుంటుంది. మీరు నన్ను మళ్ళా అడగవచ్చు. ''మాకు సరదా అదీ అక్కరేదా? మేము యాంత్రికంగా ధనార్జన చేస్తూ కుటుంబ భారం వహిస్తూ గానుగెద్దులా అనవరతం శ్రమిస్తూ వుండవలసినదేనా?'' అని. నేను చెప్పిన కళ##లే మీరు నేర్చుకుంటే, మీ మనస్సుకు అది రసాయనంలా, టానిక్‌వలె పనిచేయగలదు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం-వీనికి మించిన సరదా ఎక్కడ ఉన్నది? స్వదేశీయమైన విద్య ఏదైనా సరే నేర్చుకొంటే, మీరు, మీ పూర్వీకుల అడుగుజాడలో నడచినట్లు ఔతుంది. మీ కాలం దుర్వినియోగం చేయలేదని మనస్సుకూ తృప్తివుంటుంది.

మనం మానవులుగా పుట్టాం. మానవాతీతమైన ఒక ఉన్నత స్థితిని అందుకోకుండా మనం చచ్చిపోతే, మనకూ మృగాలకూ వున్నతేడా ఏమి? పశువులకు ఇలాంటి విచికిత్స లేదు. మనిషికి భగవంతుడు మనస్సు అనే దానిని ఇచ్చినందువల్లనే మనకు ఈలాంటి జిజ్ఞాస వున్నది. ఈశ్వరానుగ్రహంవల్ల మనకు ఎన్నో ఉదాత్తమైన విద్యలూ, కళలూ సంక్రమించినవి. ఒక్క భగవంతుడే జ్ఞానానికి అతీతుడు. భగవంతుని కోసం అన్నిటినీ త్యాగం చేస్తాము; కళకూ స్వస్తిచెప్తాం. జ్ఞానికి బహుశా కళల అవసరం లేకపోవచ్చు. అజ్ఞాన దశలో వున్నవారికి ఇవన్నీ అవసరమే. ఇవి వద్దనుకోవటం శుష్కవేదాంతమేకానీ వేరేకాదు.

మనం చదివినది చక్కగా ధారణచేయాలి. పూర్వం ఒక్కొక్క గ్రామంలోనూ, రెండువేదాలు, రెండు శాస్త్రాలు చదివినవారుండేవారు. గొప్పగొప్ప పండితులు, విద్వత్సింహములు, మన శంకరాచార్యులవలె గురు పీఠములను అధిష్టించిన వాళ్ళుండేవారు. అదే ఈ కాలంలో ఎవరైనా వేదపండితుని వద్దకు వెళ్ళి ఏదైనా వేదభాగానికి అర్థం చెప్పమంటే, 'ఉండు, నేను భాష్యం చూచి అర్థం చెబుతాను' అని అంటారు. ఈ కాలానికి తగినట్లు నేనూ ఒక గురు పీఠాన్ని అధిష్ఠించి వున్నాను. ఇంతకుముందే నేను చెప్పాను. గురువుల విజ్ఞానం శిష్యుల జ్ఞానాన్ని అనుసరించి వుంటుందని. శిష్యులు విద్వాంసులైతే, గురువు కూడా శ్రమపడి విద్యావ్యాసంగం చేస్తాడు. శిష్యుడు ప్రశ్నవేస్తే గురువు తడుముకోరాదు. గురువులు నిష్ణాతులుగా వుండాలంటే ఆ బాధ్యత శిష్యులదే.

పైగా చదువుకు వయస్సుతో నిమిత్తంలేదు. ఏ వయస్సులో నైనా విద్యారంభం చేయవచ్చును. విద్యా పరిశ్రమకు కుతూహలం, ఉత్సాహం, శ్రద్ధవుండే చాలు. ఏ వయసై#్సనా ఫరవాలేదు. ఉత్సాహంకొద్దీ సామర్థ్యం వృద్ధి ఔతుంది. ఇన్ని ఏండ్లు ఈ విధంగా గడిపినాను. ఇప్పుడు ఈ మార్పు లెందుకు? అని నిరుత్సాహపడరాదు. ఇంతకాలం వ్యర్థమైపోయాని, మిగిలిన కాలమైనా ఉపయుక్తంగా వుండేటట్లు వినియోగం చేయవచ్చుకదా! ప్రొఫెసరు సుందర రామయ్యరు అనే వారొకరు వుండేవారు. ఆయన శాస్త్ర వ్యాసంగం తనకు 50 ఏళ్ళు మీద పడిన తర్వాత ప్రారంభించాడు. అచిరకాలంలో అసమానమైన ప్రతిభ సంపాదించాడు. పెద్ద పెద్ద సమావేశాలలలో శాస్త్ర చర్చలలో పాల్గొని, సభ్యుల సందేహ నివారణ చేసేవాడు. వృద్ధులైనవారు చెప్పలేని ఉపనిషద్వాక్యార్థములు ఆయన మంచినీళ్ళవలె చెప్పేసేవాడు. అందు చేత మనమంతా అ తరంవారిని విద్యాభిముఖులుగా చేయాలి. వయస్సుతో ప్రమేయం లేకుండా, మనమూ, మనకు తోచిన, ఇష్టపడిన శాస్త్రమో కళనో గ్రహించిపరిశ్రమ చేసివ్యుత్పన్నతను సంపాదించాలి. పూర్వకాలంలో రాజులలో మహా విద్వాంసులుండేవారు. రాజసభలు పండితులతో, కవులతో, విద్వాంసులతో నిండి వుండేది. వారికందరికీ సముచితమైన పారితోషికాలను రాజులిచ్చేవారు. వారికి రాజ సన్మానం చక్కగా లభించేది. ఈ నాటి సంగతి మీకందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పబనిలేదు. ఈ నాటి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్‌ మినిష్ట్రీ అనీ, కల్చరల్‌ మినిష్ట్రీ అనీ వున్నవి. వాళ్ళు చేస్తున్నది కొంచెమైనా, వారిని అభినందించక తప్పదు. మన దేశంలోని జనాభా కోట్ల సంఖ్యలో వున్నది. ఈ జనాభాలో ఏదో పదిమంది విద్వాంసులను పిలిచి రిపబ్లిక్‌ దినంనాడు అభింనందిస్తున్నారు. లేదా ప్రాచ్యకళాశాలకు తోచిన విరాళాలు, అల్పసంఖ్యలో ఇస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో ప్రాచీన శాస్త్రాలకు ఏవో పీఠములు కల్పిస్తున్నారు. గ్రామ కళలను ప్రోత్సహించడానికి మధ్య కల్చరల్‌ ఫెస్టివల్స్‌ జరుపుతున్నారు.

ఇవన్నీ కలిపితే, ఒక్క తులం ఇంగువ సముద్రంలో కలిపినట్లు. భారతదేశపు బడ్జెటులో ఈ కార్యక్రమాలకై వినియోగించే ద్రవ్యం వేయికి ఒకవంతు కూడా వుంటుందో వుండదో. రాజ్యాంగానికి చెందిన పార్టీలలో ఈ విషయమై ఏ విధమైన శ్రద్ధాలేదు. వాళ్ళనుంచీ మనం ఎదురు చూచి ప్రయోజనమూ లేదు. వారిని నిందించటం అంతకంటే తెలివితక్కువ.

ఏదైనా చేయకలిగితే మనమే చేయడానికి పూనుకోవాలి. గురుపీఠాలకు చెందిన శిష్యులు ఈ విషయంలో శ్రద్ధవహించాలి. అట్లా చేస్తేకానీ మనకు ఇప్పుడున్న శాస్త్రములు భావి కాలంలో వుండవు. మన జాతీయ విద్యలను సంరక్షించుటకు అందరూ పాటుపడాలి. ఎన్నో ఏండ్లుగా అనూచానంగా వస్తున్న ఈ నిధిని, ఈ జాతీయతను మనం పోగొట్టుకోరాదు.

ఈ నాటి విద్యా విధానాన్ని చూస్తుంటే విషాదం వస్తుంది. శాస్త్రాలు క్రమేణ సమసి పోతున్నవి. కొన్ని కళ##లైతే నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలసిపోయినవి. చీకట్లో మిణుగురుపురుగులు మిలమిల ప్రకాశిస్తవి. ఒక గురుపీఠంలో కూర్చున్న ఒకడు కొంత విజ్ఞతను చూపిస్తే అతనిని లోకం సర్వజ్ఞుడని భావిస్తున్నది. ఈ పొగడ్తలకు అతడు తబ్బిబ్బులై తాను ఇంక చదవలసినది ఏదీ లేదని చెట్టుకొనకొమ్మపై కూర్చుంటాడు!

మిణుగురు పురుగులంటే ఒక కథ జ్ఞాపకానికి వస్తున్నది. ఇది జరిగిన కథ. మీరు నీలకంఠ దీక్షితులను గూర్చి వినివుంటారు. ఆయన కొక సమకాలీనుడు వుండేవాడు. ఆయన పేరు వళయామేరి మహాదేవశాస్త్రి. నీలకంఠదీక్షితులు తిరుమల నాయకునికి అమాత్యుడుగ వుండేవాడు. ఈ తిరుమలనాయకుడే మధురలో నూతన మండపాన్ని కట్టించినది. నాయక మహల్‌ను కట్టినదీ అతడే. నీలకంఠ దీక్షితులు గొప్ప విద్వాంసుడు, భక్తుడు. మహాదేవశాస్త్రి కూడా గొప్ప విద్వాంసుడే, కానీ అతనికి దీక్షితులకున్నంత యశస్సు లేదు. మహాదేవశాస్త్రి వ్యంగ్యంగా ఒక శ్లోకం దీక్షితులపై వ్రాశాడు. లోకంలో జ్ఞానం లేకపోతే కించిదజ్ఞులు కూడా మిణుగురు పురుగులవలె మిలమిల ప్రకాశిస్తారని ఆ శ్లోకంలో మహదేవశాస్త్రి వ్రాశాడు. అటుపై దీక్షితులకు మహదేవశాస్త్రిపై గౌరవం వృద్ధైనది.

ఈ కాలంలో పండితులూ ఈ విధమైన మిణుగురు పురుగులే. నిజమైన విద్వత్తు వున్న వాడికి లోకంలో స్థానపం లేకుండా పోతున్నది. మిడిమిడి జ్ఞానం వున్నవాళ్ళు వేదాంత గ్రంథాలను వ్రాస్తున్నారు. వానిని ప్రచురించడానికి ముందుకొచ్చే ముద్రణాలయాలూ వున్నవి. వాగాడంబరం వుంటే వాడు పండితుడౌతాడు. లేదా ఏదో ప్రత్యేకమైన జాతికి వాడు చెందివుండాలి. దీనితో నిజమైన విద్వాంసులూ, అర్హతలు కలవారూ వెనకబడుతున్నారు. ఏది సత్యం, ఏది మిధ్యలనేదే తెలియకపోతున్నది. ప్రాచీన విద్యలన్నీ సమసిపోతున్నవి. ఈ దిగజారిపోవటం నిలపాలనే నేను చెబుతున్నది.

ఈశ్వర ప్రణిధానంగా చేసే అధ్యయనమూ, అధ్యాపకత్వమూ సజీవంగా వుండటమేకాక సర్వతోముఖంగా అబివృద్ధి ఔతుంది. అట్టివారికి ఈశ్వరుడే ఒక త్రోవ చూపిస్తాడు. ఈలాంటి పండితులు విద్వాంసులు పూర్వకాలంలో ఎంతోమంది వుండేవారు. పరమభక్తుడూ, గాయక శిఖామణి ఐన త్యాగరాజస్వామి-'నిధి చాలా సుఖమా? అని రాజసమ్మానమును నిరాకరించాడు. ఆయనలో కీర్తి కాముకత్వం అవలేశ##మైనా ఉండేదికాదు.

విద్వత్తువున్నవాడికి ధనాన్ని యశస్సునూ తిరస్కరించడమనేది అంత సులభంకాదు. 'నేనెంత చదివాను? ఎన్ని పరిశోధనలు చేసాను?' అన్న ఆత్మగర్వం అప్పుడప్పుడూ తల ఎత్తుతూవుంటుంది. కొందరైతే- ఈ ప్రపంచానికి నా వ్రాతలు అర్థం చేసుకొనే తెలివీ, స్తోమతా వున్నది? నన్ను గౌరవించే అర్హత వీరికి ఉన్నదా' అని విర్రవీగడమూ కద్దు. విద్య అభ్యసించినంతమాత్రాన ప్రయోజనం లేదు. దానితోబాటు వినయమూ మనము అలవరచుకోవాలి.

విద్యవున్నవాడు ఒక మూలకూచుని, ఉపవాసం వుండాలని నేను చెప్పటంలేదు. విద్వాంసుడు విద్యావ్యాప్తికి త్యాగం చేసినందున, ఇతరులూ అతనిని గౌరవించి తమకు సాధ్యమైన సహాయం చేస్తూ అతని విద్యాకృషికి తోడ్పడాలి. మన సంప్రదాయం లుప్తం కాకుండా జాగ్రత వహించాలి. వారికి తగిన ఆర్థికసదుపాయం, వస్తుదానం చేయాలి. అపుడే సమాజోద్ధరణ కలసి రాగలదు. ఆ పండితుల కౌశల్యము వ్యర్థం కాకుండా సమాజాభివృద్ధికి దోహదంగా వుండే బాధ్యత అందరూ వహించాలి.

పరంపరాగతమైన శాస్త్రాలు పరంపరాగత విధానాలలోనే ప్రచారం కావాలి. ఈ రోజుల్లో పేపర్లు చదువుతారు, సమావేశాలు చేస్తారు. పండితులుగా కొందరిని నిర్ణయించి వారిచేత పుస్తకాలు వ్రాయించి ప్రచురిస్తారు. ఈ పుస్తకాలు గ్రంథాలయాలలో అజ్ఞాతముగా ధూళిగ్రస్తమై వాసంచేస్తాయి. వీనివలన ప్రయోజనమేమైనా వుందా? వీనికేమైన స్థిరమైన విలువలు వున్నవా? గురుశిష్యపరంపరాగతమైన విద్య అట్లుకాదు. ఏ విద్య అయినా సరే, అది ప్రజల శీలాభివృద్ధికి ప్రయోజనకరంగా వుండాలి. నియమ జీవనానికి, ఇంద్రియ నిగ్రహానికి, సౌశీల్యానికీ, ఈశ్వర ప్రణిధానానికీ, తోడ్పడే విద్యయే విద్య. అట్టి విద్యవలయలనే సమాజ శ్రేయస్సు సమకూరుతుంది.

గురుకులవాసం గూర్చీ, ఘటికాస్థానాలు గూర్చీ ఇంత విస్తారంగా నేను చెప్పడం, మన జాతీయ విద్యావ్యాప్తికి, ఈ విధానాలు ఎంతో అవశ్యకములని నిరూపించుటకే.

నేను చెప్పినదంతా మీ ధారణకు అంబికానుగ్రహంచేత వస్తుందని ఆశిస్తున్నా. కేనోపనిషత్తులో చెప్పబడిన ఆ హైమవతియే' ఆ విద్యాస్వరూపిణియే మనకందరికి వివేచనా శక్తికి ప్రసాదించాలి. ఆమెను ఆచార్యులవారు తమ భాష్యంలో 'బహుశోభమానగా' వర్ణించారు. అందులోనే వారు-'విరూపోభివిద్యావాన్‌ బహువోభ##తే'- విరూపి ఐనా విధ్వాంసుడు శోభిసకతాడని వ్రాశారు. విద్వాంసుని ముఖంలోనే ఒక వర్చస్సు వుంటుంది. అదే ఒక సోమరిముఖంలో తామసీశక్తి తాండవం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బహుశోభమాన ఉమాదేవి మన ముఖలలోనూ, వాక్కులలోనూ. హృదయంలోనూ వర్తించి మనలను తేజస్సులుగను, వర్చస్సులగను విద్వాంసులుగనూ చేయుగాక!

81. ఈశ్వరుడు, గురువు

మీ తండ్రి స్థిరాస్థిగా ఒక ఇల్లు రాసి యిచ్చినాడనుకొందాం. కాలక్రమేణా అది శిధిలమౌతుంది. దాన్ని మరమ్మతు చేయాలి. అపుడపుడూ దానికి వెల్ల వేయాలి. లేదా భూమిని మీ తండ్రి వదలిపెట్టి పోతే దానిని దున్ని సేద్యం చేయాలి. దానికి విత్తనాలు, ఎరువుకూ ఖర్చు చేయాలి. ఆనేల పండకపోతే అదొక్క చిక్కు. దానికి జలాధారం వేరే కల్పించాలి. మధ్యలో వానలు రాకుండా దుర్భిక్షం ఏర్పడవచ్చును. లేదా ఆనకట్టల నుండి కావలసిన నీరు ఆ అధికారులు ఇవ్వకపోవచ్చును. ఇపుడు ప్రభుత్వం వారు వేరే చట్టాలు తెచ్చినారు. ఒక్కొక్కరూ ఎంతనేల వుంచుకోవాలో దానికొక నియతి వున్నది. లేదా నగదుగా మీ తండ్రి ఆస్తి వదిలి పెట్టిపోయాడంటే, మార్కెట్టులో దాని విలువ డివాల్యుయేషన్‌ వల్ల తగ్గిపోవచ్చును. ఉన్న సంపదపైన పన్నులు వేరే కట్టాలి. దీనినంతా సాధించామనుకొందాం. ఏ దొంగవచ్చి దీనినంతా ఎక్కడ ఎత్తుకొని పోతాడో అనే దిగులు ఎప్పుడూ వెన్నాడుతూనే వుంటుంది.

ఎంత ఆస్తివున్నా కాలం గడిచేకొద్దీ అది క్షీణించవచ్చును. ఇతర వారసులెవరైనావుంటే వారు కోర్టులు కెక్కవచ్చును. వాళ్ళు లంచాలిచ్చి తీర్పులు తమ పక్షానికి అనుకూలంగా వుండేట్లు ప్రయత్నం చేయవచ్చును. చట్టాన్ని తలక్రిందులు చేయవచ్చును. ఆవగింజంత ఆస్తి వుండేదాన్ని నిలబెట్టుకోడానికి కొండంత పాపం చేయాల్సివస్తుంది.

ఏదో అదృష్టం చేతనో పూర్వ పుణ్యబలంచేతనో ఆస్తిని నిలబెట్టు కొన్నామనుకుందాం. ఎన్నడో ఒకరోజు మనం కళ్ళుమూనుకొని కాలగతి చెందవలసినదే. ఆకాశాన్నంటే మేడ, కోట్లకొద్దీ డబ్బూ వున్నా, అన్నీ విడిచి, ఒక్కరోజు కట్టుగుడ్డకూడా లేకుండా పరలోకం వెళ్ళాల్సిందే. మనతో ఒక్క పూచిక పుల్ల అయినా వెంటరాదు.

పిత్రార్జితమైన ఆస్తి విషయం అటుంచుదాం. మన స్వార్జితం విషయమేమి? దానిగతీ అంతే. ఐతే మనతో వచ్చే ఆస్తి ఏది? ఏ ఆస్తిపై మనం పన్నులు కట్టకుండా సుఖంగా కూచోవచ్చు? ఏ ఆస్తికి రిపేర్లు చేయడం వెల్లవేయడం అనేది లేదు? ఏ ఆస్తిని దొంగలు కళ్ళెత్తి కూడా చూడరు? ఏ ఆస్తి కోసం మనం అన్యాయాలు చేయనక్కరలేదు. అగచాట్లు పడనక్కరలేదు?

ఆ ఆస్తియే మనకు మన గురువే ఇచ్చేది. ఆ ఆస్తియే బంధహేతువుకాక మోక్షదాయకంగా వుండేది. ఆ ఆస్తివుంటే మనం మళ్ళీ ఈ లోకానికి రానవసరంలేదు. ఆ ఆస్తియే మనలను పరమాత్మతో ఎడబాటు లేకుండా చేర్చిపెట్టే ఆస్తి.

ఆ ఆస్తి పేరే జ్ఞానం. ఆ జ్ఞానం గురువుయొక్క ఆహేతుక అనుగ్రహంచేత ఉపదేశరూపంగా మనకు సంక్రమిస్తుంది. దానికి కాలభయంలేదు. చోరభయంలేదు. అది తరిగి పోతుందన్న దిగులులేదు. దాన్ని నిలబెట్టుకోడానికి మనం పాపాలు చేయనక్కరలేదు. అనుక్షణం వృద్ధి అయ్యే అమూల్యసంపదే గురువనుగ్రహం. ఆ జ్ఞానమే మనకు మన గురువే ఇచ్చే ఆస్తి. అదేనిత్యానందం.

82. గురుభక్తీ, ఈశ్వరభక్తీ

గురువు మనకు ప్రసాదించే అభ్యుదయాన్నిబట్టి చూస్తే మనం ఎంత భక్తి ఆయన యందునెరపినా అది అల్పమాత్రమే. అందుచేతనే ఉపనిషత్తు, ఈశ్వరుని యందెట్టి భక్తి మనం ఉంచుతామో, అట్టి భక్తియే గురువు యందుకూడా మనకుండవలెనని చెబుతుంది. ''యస్యదేవే పరాభక్తిః యథాదేవే తథాగురౌ!''.

అట్టి భక్తి ఏ మహత్మునికున్నదో, వాని హృదయంలోనే, గురూపదేశం ప్రకాశిస్తుందని ఉపనిషత్తు చెబుతున్నది. అట్టి భక్తిగల శిష్యుణ్ణి మహాత్ముడని చెప్పుటచేత గురుభక్తి మూలంగానే ఆత్మజ్ఞానం అతనికి అభిస్తున్నదని విశదమౌతుంది. గురూపదేశం అతని హృదయంలో జ్యోతివలె ప్రకిశిస్తుందని-తస్త్యెతే కథితాహ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః - అని ఉపనిషత్తు నొక్కి చెబుతున్నది.

శిష్యుడు, గురూపదేశాన్ని తనమేధతో గ్రహిస్తాడనే అర్థం మాత్రం - ప్రకాశంతే - అన్న పద ప్రయోగం నుంచీ మనం తీసుకోరాదు. గురువు బోధించే విషయాలు, ఎట్లాగూ బుద్ధిగ్రాహ్యము లౌతున్నాయి. కథితార్థములు, అనగా తత్త్వజ్ఞానము ప్రకాశిస్తుందని ఉపనిషత్తు ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నది? క్లిష్టార్థమూలూ, క్లిష్టాన్వయములూ శిష్యునికి సుభంగా విశదమౌదుందనా అర్థం? అట్లాగూ తీసుకోవచ్చు. ఈశ్వరానుగ్రహం చేత, గురుని ప్రసాదంచేత, శిష్యుని మేధస్సు తీక్షణత సంపాదించవచ్చును. ఆ బుద్దితీక్షణత చేత, తత్త్వం సులభంగా విశదంకావచ్చును.

ఐతే ఆధ్యాత్మికోపదేశం యొక్క ప్రయోజనమేమి? అహంకార నిర్మూలనమే కాదా దాని ప్రయోజనం? అంటే తాత్త్విక జ్ఞానం బుద్ధికి తుష్టికరంగా వుండవటమేకాక, ఆత్మానుభూతికి కూడా దారితీయాలి. అదే స్వానుభూతి. జీవనచైతన్యమనే దొకటి వున్నది. బుద్ధి వెనుక ఆ చైతన్యమున్నది. ఉపదేశం స్వానుభూతికి దారితీసి, జీవచైతన్య బ్రహ్మచైతన్యముల మధ్యగల బేధమును అంతరింపచేయాలి. ఈ అభేద స్థితియే నిరంతర సత్యం-అదే అద్వైతులు చెప్పే మోక్షం. స్వానుభూతిని అపరోక్షానుభూతి అనీ అంటారు. ఈ పేరిట శంకర భగవత్పాదుల వారొక ప్రకరణ గ్రంథాన్ని రచించారు.

పరోక్షం అంటే మనకు కనబడనిది. అపరోక్షం దానికి వ్యతిరేకం. ఒక వస్తువును గూర్చి వినగా కలిగే జ్ఞానం పరోక్షం. అనుభూతికి వచ్చిన జ్ఞానం అపరోక్షం. కుర్తాలంలో జలపాతమున్నది. అక్కడకు వెళ్ళి వచ్చినవారు దానిని ఎన్నో విధాల వర్ణించవచ్చు. అంత మాత్రాన మనకు కుర్తాలం జలపాతంలో స్నానం చేసిన అనుభవం కల్గుతుందా? మనం ఆ చోటికి పోయి ఒక నాలుగు నిముషాలు ఆ జలపాతంలో నిలిచి స్నానం చేస్తేనే దాని అనుభవం, ఆ సంతోషం గ్రహించగలం.

ఆత్మ బోధకములైన గ్రంథాలను వేలకొలది చదివినా ప్రయోజనమేమీ లేదు. గురువు అట్టి ఉపదేశం చేసినా, అది బుద్ధి మేరలలోనే వుంటే దానివలన ఏమి ఉపయోగం? అది పరోక్షజ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం స్వానుభూత్యైకవేద్యమైనపుడే అది అపరోక్షానుభూతి కాగలదు. మనం ఒక విషయాన్ని స్థూలంగా గ్రహించినంత మాత్రాన ప్రయోజనం లేదు. సూక్మార్థమూ గ్రహించి అనుభూతికి వస్తేనే అది అపరోక్షమౌతుంది. ఙానం అంతరంగికమై సమాధ్యావస్థలను భజిస్తేనే అపరోక్షానుభూతి ఔతుంది.

ఒక విషయాన్ని మనం బుద్ధి సాహాయంతో తెలుసుకోవటం ఒకటి. హృదయంలో దానిని అవగతం చేసుకొనేది మరొకటి. గుడ్లగూబ రాత్రి చూడగలదు. పగలు దాని కేదీ కనపడదు. మనిషి పగలు చూడగలదు. కానీ రాత్రి చేసే శక్తి వారిని లేదు. బుద్ధి తర్కంతో ఒక విషయాన్ని సకృత్తుగా పరీక్షించి తెలుసుకోగలదు. కానీ హృదయానికి వీని అవసరం లేకుండానే తెలుసుకొనే శక్తి వున్నది. జీవితంలో సత్యాన్ని మన హృదయాంతర్వర్తియే ఎరుగగలడు.

కానీ మనం సాధారణంగా బుద్ధికే ప్రాధాన్యత ఇస్తాం. ఆత్మకు సంబంధించిన విషయాలను సరియా కాదా అని బుద్ధి మొదట పరీక్షిస్తుంది. కానీ బుద్ధి చప్పేదంతా మనం ఒప్పుకోవటంలేదు. వేదాంత పుస్తకములు చదువుతాము. గురువుమనకు ఉపదేశం చేస్తాడు. ఆత్మ సచ్చిదానంద స్వరూపమని. కానీ తెలివితక్కువతనం చేత, దీనిని గూర్చీ దానిని గూర్చీ అనవరతమూ మనం విచారిస్తూ వున్నాము. అంటే బుద్ధికి అతీతమైన జ్ఞానాన్ని హృదయంలోనికి తీసుకొని రావాలి. తెలివి అధికంగా వుంటే హృదయద్వారాలు అంత సులభంగా తెరచుకోవు. ఎక్కువ తెలివిలేని వాళ్లకు సాధారణంగా తమకు తెలియదన్న వినయం వుంటుంది. వాళ్ళు ఇతరులు చెప్పిన దానిని విశ్వసిస్తారు. మనకు కూడా అప్పుడప్పుడూ ఒక్కొక్క విషయంలో బుద్ధి మీదనే ఆధారపడి ఒక నిర్ణయానికి రావడం కష్టమనిపిస్తుంది.

శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. వారి మేధకు ప్రపంచమే నివ్వెరపోయింది. కానీ వారు కూడా ఏమన్నారంటే; ''శృతులు చెప్పే విషయాలను ఒక్క మేధతో గ్రహించడం కష్టం. బుద్ధికి అతీతమైనది పరమాత్మ. మనకు వేదాలు ఋషుల మూలంగా ప్రపంచంయొక్క శ్రేయస్సులు ఉద్దేశించి వచ్చినవి. వేద ప్రమాణాన్ని మనం ఏ ప్రశ్నలు వేయక అంగీకరించాలి''.

కానీ భగవత్పాదులవారు అపారమేధాప్రాచుర్యంతో ఎన్నో భాష్యగ్రంథాలు వ్రాశారు. తమ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠాపన చేశారు. ప్రతిపక్షుల వ్యతిరేక అభిప్రాయాలను ముందే ఊహించి దానికి తగిన ప్రత్యుత్తరాలనిచ్చి, అద్వైతమతస్థాపనం చేశారు. శంకరులేకాదు. రామానుజులు, మధ్వాచార్యులూ శబ్ద ప్రమాణాన్ని (వేదములు) అంగీకరించారు. కానీ వారూ తమసిద్ధాంతాలను యుక్తితో నిరూనించారు. యుక్తీ, తర్కమూ బుద్ధికి సంబంధించినవి. యుక్తీ, శృతీ రెండూ అనుభవానికి తీసుకొనిపోవాలి. ఆ అనుభవం హృదయానికి సంబంధించినది. అనగా శృతి, యుక్తి, అనుభవం మూడూ సిద్ధికి అవసరం. ఆ సిద్ధినే మహానుభావమనీ, స్వానుభూతి యనీ, అపరోక్షనుభూతాయనీ అంటారు. ఈశ్వరభక్తీ, గురుభక్తీగల మహాత్ముల హృదయాలలో అనుభూతి ప్రకాశన మవుతుంది. ఆ విషయమే ''యస్య దేవే పరాభక్తి'' అనే శ్లోకం ఉద్ఘోషిస్తున్నది.

ఈశ్వరుడే గురువు, గురువే ఈశ్వరుడైతే, గురువు ఉపదేశరూపంగా తన కృపను చూసి ఆత్మానుభవాన్ని తన అపార అనుకంప చేత అనుగ్రహిస్తున్నాడు. కర్మ ఫలదాత ఈశ్వరుడే. మనం గురువును ఈశ్వరుడిగా భావించినా, ఈశ్వరుణ్ణి గురువుగా భావించినా, కృపతో మనకు ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే గురురూనంలో ఆవిర్భవించి అనుగ్రహిస్తున్నాడు. అందుకే మనం గురుస్సాక్షాత్‌ పరంబ్రహ్మ' అని అంటున్నాం. మనం గురు విషయంగా మాట్లాడుతున్నాం కాబట్టి, నేను మిమ్ములను ఒక గురువును ఆశ్రయించి అతడే ఈశ్వరుడన్న అనన్యభక్తితో ఆత్మార్పణం చేసుకోవలసినదని చెబుతున్నాను.

83. మానవ స్వభావం

మన చిత్తం ఒకరోజు వున్నట్లు మరొకరోజు వుండదు. ఈ చాంచల్యం సాధారణ జనం లోనేకాదు. ఒక్కొక్కపుడు మహాత్ములలోనూ చూస్తాం. ఒక విషయంపై మనకు నేడు అభిరుచి వుండే, మరొక్కరోజు దానిపై మనస్సే పోదు.

పాటకచ్చేరీకి వెళ్ళినపుడు గాయకుడు ఒకే రాగాన్ని తరచూ పాడితే మనకు విసుగువేస్తుంది. మార్పును కోరే గుణం మనస్సుకు స్వాభావికంగా వచ్చినది. ఈ రోజు దధ్యోదనం కోరిన మనస్సు మరుసటిరోజు పుళిహూర కావలెనని మారాం చేస్తుంది. పుర్రెలో పుట్టెడు బుద్ధులు. ఒక్కొక్కరోజూ ఒక్కొక్క విషయంపై బుద్ధి సై#్వరవిహారం చేస్తూవుంటుంది. అందుకూ మన మతంలో ఎన్నో సాధనా ప్రణాళికలు, ఆర్చామూర్తులు వున్నవి.

ఆలయమునకు వెళ్ళి గణశుని ముందు నిలుచుంటాం. దేవతామూర్తిని ఎంతో సుందరంగా అలంకరించివుంటారు. ఆ లంబోదరం, ప్రసన్నవదనం, నాలుగు భుజాలూ, అన్నీ అందంగా వున్నవి. కానీ మనస్సు ఇంకో దేవతా సన్నిధికి-దుర్గ వద్దకు-వెళ్ళాలంటుంది. అందుకే మన పెద్దలు ఈ అస్థిరమైన మనస్సుకు ఎన్నో మార్గాలు చూపారు. వారు - ఎల్లిసెట్టి లెక్క ఏకలెక్క - అని కూర్చోలేదు. అమ్మవారు, దక్షిణామూర్తి, నటరాజు, లింగోద్భవ మూర్తి, అని ఎన్నో దేవతలను ఆలయాలలో స్థాపించారు. ఒక్కొక్క విగ్రహం ముందూ, రెండు నిముషాలు వున్నా, ఆలయం ప్రదక్షిణ చేసి వచ్చేసరికి, ఒక అరగంటసేపు మనస్సు భక్తి భావ భరిత మయ్యే విధంగా మన పెద్దలు సంవిధాన పరచినారు.

మన మతం జీవబ్రహ్మైక్యాన్ని బోధిస్తుంది. ఈ విషయాన్ని ప్రపంచంలోని తాత్తవికులందరూ ప్రశింసిస్తున్నారు. అద్వైతమే ఐశ్వర్యం మనకున్నది. అద్వైతమనే మహూన్నత సిద్ధాంతమే వర్ణాశ్రమ విధానాన్నీ, ఆర్చామూర్తి బాహుళ్యాన్నీ, అంగీకరిస్తున్నది. అద్వైతం, పరమాత్మ అనేది మన అంతిమలక్ష్యం. అది పరమార్థం. కానీ వ్యావహారికంలో అద్వైతాన్ని అనుష్ఠించలేము. అట్లా అనుష్ఠించినా అది మిధ్యావర్తనకే దారితీస్తుంది. వ్యవహారంలో ద్వైతం వుండి తీరుతుంది. అందుకే ఆచార్యులవారు పంచాయతన పూజా విధానాన్ని బోధించారు. అంతేకాదు, కౌమారాన్నీ చేర్చి షణ్మతస్థాపన చేశారు. ఎన్నో ఆర్చామూర్తులు, రాముడు, కృష్ణుడు, నరసింహుడు, అంబ, భవాని, భ్రమరాంబ త్రిపుర సుందరి, శారదాంబ మొదలైన దేవతా మూర్తులను మనం ఆరాధిస్తున్నాం.

అనన్యభక్తి అనేది పరామార్ధ సత్యం. మనం ఒక్కదాటులో ఆ భూమికను అందుకోలేము. గురువుయందు ఈశ్వరభావన వుండవలెనని అన్నారు. మీరందరూ నన్నే ఈశ్వరుడని భావిస్తే, నేను పూజించే చంద్రమౌళీశ్వరుని గతి ఏమి? ఆయన లేకుంటే నా భిక్షగతి ఏమి? నన్ను నమస్కరించి చంద్రమౌళీశ్వరుణ్ణి మీరు తిరస్కరిస్తే ఆయన ఉంటేనే కదా ఈ మఠానికి అస్తిత్వం. భగవత్పాదాచార్యులు ఈ మఠాన్నే కాదు; ఇంకా ఎన్నో మఠాలను స్థాపించారు. ఆయన పేరుతో ఇతర ఆచార్యులూ వున్నారు. ఆ మఠాలలో, ఆయా మఠానుశాసనములను అనుసరించి పూజాక్రమాలున్నవి. కానీ ఇపుడు నేను మాట్లాడేది నా జీవనోపాధిని గూర్చి!

ఇన్ని దేవతామూర్తులు మీ కోసమే వున్నవి. ఏ దేవతామూర్తిపై అభిరుచివున్నదో, ఏ ఆరాధన రసవంతంగా వుటుందో ఆ ఆరాధనను మీరు గ్రహించవచ్చును. నేను అనన్యభక్తిని గూర్చి చెప్పానంటే అది ఒక ఉత్తమ లక్ష్యమని అనడానికే. దానిని వెంటనే మీరు ఆచరణలోకి తెస్తారని కాదు. శృతి, యుక్తి, అనుభవం అని వెనక చెప్పాను. అనన్యభక్తి, యుక్తీ అలవాటు అయినదంటే-అది అనుభవానికి క్రమంగా తీసుకొని వెడుతుంది.

84. అనన్య భక్తిలో చిక్కులు

ఒక ఉత్తమ భూమికను మీరు అధిష్ఠించారంటే అనన్య భక్తి అంటేనూ. ఆత్మకంటే అన్యమైనది లేదంటేనూ ఒక్కటే అని అర్థం ఔతుంది. అనన్యభక్తికి మారుపేరు ఆత్మానందమే. ఆ భూమికలకు వచ్చే వరకు ఇక మూర్తిని ప్రత్యేకంగా వుంచుకోవాలి. ఆ మూర్తికే భక్తిని నెరపాలి. లేదా అన్ని మూర్తులూ ఒక్క పరమాత్మయొక్క విభూతులే అనిన్నీ అందులో ఉచ్చనీచములకు తావులేదనే జ్ఞానముండాలి.

ఒక గురువు యందు అనన్యభక్తి వుండాలి అని అంటే మనం ఎందరో గురువుల వద్ద మంత్ర దీక్షలు పొందవచ్చును. మనకు మన తండ్రి బ్రహ్మూపదేశం చేస్తున్నాడు. ఆయన గాయత్రీ మంత్రం ఉపదేశం చేశారు. ఆయన మొదటి గురువు. ఈ విషయం సాధారణంగా తలకు ఎక్కటంలేదు. ఉపదేశం అంటే, ఏ పంచాక్షరీ ఉపదేశమో, అష్టాక్షరీ ఉపదేశమో అన్న భావనే వున్నది కానీ గాయత్రి ఒక ఉపదేశం క్రింద లెక్క కట్టటం లేదు. గాయత్రికి మించిన మంత్రం, ఆ ఉపదేశానికి మించిన ఉపదేశం వేరే ఏది వున్నది? మీకు పంచాక్షరి ఉపదేశం వేరే ఎవరైనా చేసివుంటే, తండ్రితోబాటు మరొక దీక్షా గురువు సిద్ధిస్తున్నాడు. శాస్త్రబోధ చేసే విద్యాగురువు వేరే వుంటున్నాడు. సన్యాస దీక్ష యిచ్చే మరొక గురువు వున్నాడు.

ఇవికాక మఠాలు, గురుపీఠములు ఉన్నవి. దాని అధిపతులను గురువులని అంటున్నా. మఠాలలో పెద్దస్వామి ఒకరు, చిన్నస్వామి ఒకరూ వుంటున్నారు. ఇద్దరూ గురువులే.

మంత్రజపానికి కూర్చున్నపుడు గురు పరంపరను ధ్యానం చేయాలని ఒక్క విధియున్నది. అందుచేత వ్యవహారంలో ఒక్క గురువును స్వీకరించి అతన్నే ఈశ్వరునిగా భావించాలన్న నియమంలో ఈ చిక్కులున్నవి. ఎవరో కొందరే ఒక్క గురువును స్వీకరించి అతనియందు ఈశ్వరభావముంచి, అచంచల విశ్వాసంతో, అతనిలో సర్వదేవతా సాన్నిధ్యాన్ని చూడగలరు. ఏకనిష్ఠతో ఆ గురువునే ఆశ్రయించి, ఆయన పాదాలనే నమ్ముకొని వుండగలవారు చాల తక్కువ. గురుస్వరూపం ధ్యానానికి ఆలంబనంగా వుంటుంది. ఆ రూపం గురువు రూపమా, ఈశ్వరుని రూపమా? ఇచ్చట నేను గురుభక్తి ఈశ్వరుని భక్తి కంటే పై స్థాయిలో వుండాలని అంటున్నాను.

మీరు అడగవచ్చు. ఈశ్వరుణి అర్చిండానికి బదులు, ఒక మానవుణ్ణి గురువుగా స్వీకరించి అతనిని ఈశ్వరుడిగా భావించి భక్తి చేయటం సాధ్యమా అని.

ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించి పరిపాలించవచ్చును. అతడు ఈ లోకాన్ని సంహరించనూ వచ్చును. మనకా గొడవ ఎందుకు? ఆ పరమ శక్తి గల ఈశ్వరుని వద్ద నీవు కోరేదేమి? ఈ సంసారంలో చిక్కుకొని అలమటిస్తూ వున్న నీకు తాపత్రయాలు పోగొట్టి అనుకంప చూపగల కృపాలేశ##మే కావలసినది. నీకు కావలసిన దల్లా ముక్తి. ఈ ప్రపంచపు సమస్య ఆ ఈశ్వరునిది. ఆయన బాధ ఆయన పడతాడు. ఈ ప్రపంచం మాయా? లీలా? ఈ సృష్టి అంటే ఏమి అనే విచికిత్స నీకక్కరలేదు. ఆ విచారమంతా ఈశ్వరుడు పడనీ, ఈ సంసార పంకంలో చిక్కుకొని అలమటించే నీకు విమోచన యివ్వడానికి గురువు ఒక్కడు చాలు. ఆయన చేసే జ్ఞానబోధతో నీకు వాస్తవమేమో బోధ పడుతుంది,. ఈ సంసారాన్ని తరించడానికి కావలసిన గురువేకాని ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఈశ్వరుడు కాడు.

సరి! గురువు జ్ఞానదాత కావచ్చు. కానీ ఆ గురువుకు జ్ఞానం ఎవరిచ్చారు? ఈశ్వరుడు కాదా? వీనికి జ్ఞానమివ్వాలి ఆని గురువుకు అనుకంపకలిగితే దానికి మూలము ఈశ్వరుడేకదా? అని మీరు అడగవచ్చు.

అది వుండనీ, ఈశ్వరుడు కృపాసముద్రమేకావచ్చు. ఆయన జ్ఞానార్ణవంగానే వుండనీ, నీ మాలిన్యాన్ని పోగొట్టడానికి ఆ సముద్రం అవసరమేమి? నీకు దాపులో వుండే బావి నీరో, కొళాయి నీరో చాలదా? నిన్ను ఉద్ధరించడానికి వచ్చిన గురువు ఆ సముద్రంలో నుంచి వచ్చిన తరంగమే అయినా నీ ఆధ్యాత్మిక తృష్ణ తీరడానికీ, నిన్ను ఉద్దరించడానికీ ఆయన చాలు. ఆయన నీకు ముక్తి ఇచ్చేందుకు సమర్థుడు.

ఒక ధనికుడున్నాడు. ఆయన పదివేల మందిని పిలిచి సంతర్పణ చేస్తాడు. ఆయన మహానసంలో (వంటిల్లు) వున్న పదార్థాలన్నీ నీవు తినగలవా? నీకు కావలసినది నీ ఆకులో వడ్డించినది మాత్రమే.

నీకు ఆ ధనికుడు ఎవడో కూడా తెలియవలసిన అవసరంలేదు. నీకు వడ్డించేవాని అసరా వుంటే చాలు. గురువు విషయము అంతే. గురువు నీకు ఉపదేశం చేసే హక్కు తనకు ఉన్నదని ఎన్నడూ అనుకోడు. ఈశ్వరుడే అతనికి ఆ అధికారం ఇచ్చాడు. అందుచేత ఈశ్వరుని అనుగ్రహం మనకు గురువుద్వారా లభిస్తుంది. అట్టి గురువును ఆశ్రయించి శిష్యుడు నిశ్శ్రేయసం పొందాలనే ఈశ్వరుని వాంఛ.

ఈశ్వరుణ్ణి మన మెవరూ చూచినది లేదు. మహాత్ములు వర్ణనలవలన ఈశ్వర స్వరూపాన్ని మనం ఊహించగలుగుతున్నాం. గురువట్లాకాదు. ఆయనను మనం మన కళ్ళతో చూస్తున్నాం. ఆయనతో సంపర్కసల్లాపాలకు ప్రత్యక్షంగా అవకాశం వుంది. మనం ఈశ్వరుని వద్ద కోనే కర్మక్షయమూ, జ్ఞానలబ్ధీ రెండూ మన గురువు మనకు ప్రసాదించగలడు.

పోగా ఈశ్వరుని మనమెంత మంది సూటిగా ప్రార్ధించగలం? గురువు అట్లుకాదు. అతడు ఈశ్వర చైతన్యంకలవాడు. ఆయన మన తరపున ప్రార్ధిస్తే ఈశ్వరుడు ఆ ప్రార్థనలనాలకించి మనకు వలసిన సదుపాయాన్ని తప్పక అనుగ్రహిస్తాడు.

రెండవది-మన కర్మ భారమును తగ్గించడమో తొలగించడమో అంత సులభ##మైన కార్యం కాదు. గురువు తన తపశ్చర్య చేత రక్షకుడుగా వుంటాడు. మన కర్మను తానేస్వీకరించి మనకు సహాయం చేద్దామన్న ఔదార్యం, కరుణా గురువుకు వుంటుంది. గురువుకు ఈశ్వరుని యందున్న చనువు చేత - ''ఇదిగో - నా శిష్యుడు కష్ట పడుతుంటే నేను చూడలేకున్నాను. నీవేదైనా అతని విషయంలో పరిష్కారం చేయి'' - అని భగవంతుణ్ణి గురువు బెదిరించగలడు కూడా. ''ఏం! నీవు చేస్తావా లేదా?'' అని గురువు అడిగేసరికి ఈశ్వరుడు సరే! అని చెప్పక తప్పదు.

85. యథోక్తకారి

కంచిలో ఒక విష్ణ్వాలయం వుంది. అందులోని పెరుమాళ్ళు పేరు - యథోక్తకారి. యథోక్తకారి అంటే చెప్పినట్లు చేసేవాడని అర్ధం.

పూందమల్లి సమీపంలో తిరుమళిసి అనే గ్రామం వుంది. అందు పుట్టినందువల్ల ఒక ఆళ్వారుకు తిరుమళిసి ఆళ్వార్‌ అన్న పేరు వచ్చింది. ఈ ఆళ్వార్లు అందరూ పరమ భక్తులు. వారికి గౌరవార్ధం వారి పేరుతో పిలిచేవారు కాదు. వారు పుట్టిన చోటో, లేక వేరే ఏదైనా ఇతరమైన అభిజ్ఞను జోడించియో ఆ భక్తులకు నామకరణం చేసేవారు. ఉదా - పెరియ ఆళ్వార్‌ - అంటే 'పెద్ద ఆయన' అని అర్ధం. నమ్మాళ్వార్‌ - అంటే 'మన ఆయన' అని అర్ధం. ఈ తిరుమళిసి ఆళ్వారుకు భక్తి సారుడు అన్న అన్వంతర నామ మొకటి వున్నది. ఈయన పిదప కాలంలో కంచికి వచ్చి స్థిరపడినాడు. కంచిలో విష్ణ్వాలయంలో పాశురములు - విష్ణు సంబంధమైన గీతికలు - పాడుకొంటూ వుండే వారు. శిష్యులకు ఉపదేశమిస్తూనో, లేక యోగసమాధిలోనో ఆయన వుండి పోయేవాడు. తిరుమళిసి ఆళ్వారు విష్ణువుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ''నాశిష్యుడు దేశం వదిని వెడుతున్నాడు. నీవు ఇక్కడ ఊరకే కూర్చుంటే ఎలాగు? అతనిని తీసుకొని రావడానికి నేను వెడుతున్నాను'' అని అనగా పెరుమాళ్ళు ఆళ్వారును అనుసరించాడు. తిరిగి శిష్యుడు మళ్ళా కంచీపురం వచ్చినపుడు పెరుమాళ్ళూ తిరిగివచ్చాడు.

ఈయన వైష్ణవేతర దేవతలను కొంచెం తక్కువ పరచి వ్రాసేవారు. ఆయనకు విష్ణువు యందు పరమభక్తి. ఆ భక్తి అనన్య భక్తి ఐనందువల్ల బహుశా ఈ విధంగా వారు చేసేవారేమో.

తిరుమళిసి ఆళ్వార్‌ వద్దకు ఇద్దరు భార్యా భర్తలయిన భక్తులు వచ్చేవారు. వారికి పుత్రసంతానం లేదు. వారిరివురూ ప్రతిదినమూ ఆళ్వారుకు పాలు తెచ్చియిచ్చేవారు. ఆళ్వారు ఎప్పుడూ యోగసమాధిలో వుండేవారు. కళ్ళు తెరిచినపుడు ఈ భక్తులు తెచ్చిన పాలను స్వీకరించి కొంత మిగిలించే వారు. ఆ భక్తులు దానిని ప్రసాదంగా తీసుకొనేవారు. కొంతకాలానికి వారికి ఒక పుత్రుడు పుట్టాడు. అతనికి కానికణ్ణర్‌ అని పేరు పెట్టారు.

కానికణ్ణర్‌ శైశవంలోనే ఆళ్వారుకు శిష్యుడయ్యాడు. ఒకరోజు అతడు ఆలయానికి వెళుతూ అస్తిపంజరంలా చిక్కి ఉన్న వృద్ధురాలినొకామెను ఆలయప్రాంగణంలో చూశాడు. ఆమె పేడనీళ్ళు చల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతూ వుంది. దేహంలో కొన ఊపిరి వుండేంతవఱకు ఆమె భగవత్కైంకర్యం చేయాలని తీర్మానించినట్లు కానికణ్ణర్‌ తెలుసుకొన్నాడు. అతని హృదయం ఆ భక్తురాలిని చూచి ద్రవించి పోయినది. ఆమెకు తాను ఏ విధంగా సాయపడగలడు?

ఎవరికైనా సరే, హృదయం పూర్తిగా ప్రేమభరితమై చిత్తం అపార కృపాయత్తమైనదంటే, అతని గురువు మొక్క అనుగ్రహ శక్తి అతనిలో ఆవహిస్తుంది. అనగా ఈశ్వరుని కృప గురువు మూలంగా అతని యందు ప్రసరించి అతనిని మహిమాన్వితునిగా చేస్తుందన్నమాట. తన్ను తాను మరచి, ప్రేమతో ఆ వృద్దురాలి వీపును ఇతడు స్పృశించాడో లేడో, జరాకృశ##యైన ఆ వృద్ధ జవ్వనియై పోయింది.

శ్రీ కృష్ణ పరమాత్మ మథురలో ఇదే విధంగా కుబ్జను స్పృశించి ఆమె వక్రతను పోగొట్టి సౌందర్యవతిని చేశాడు. మధుర మోక్షపురులలో ఒకటి. అది ఉత్తర హిందూస్థానంలో వున్నది. దక్షిణ దేశంలో వున్న మోపురి కంచి. మథురలో భగవంతుడు భక్తురాలిని అనుగ్రహిస్తే, కంచిలో, భగవద్దాసదాసుడు అదే విధంగా భక్తురాలిని అనుగ్రహించాడు.

ఆ వృద్ధురాలు కంచిరాజు ఆస్థానంలో దాసిగా వుండేది. వృద్ధాప్యం రాగానే దేవదాసి అయినది. ''ఆహా! ఈ భగవంతుని పుణ్యమా అని నాకు ¸°వనం వచ్చింది. ఈ నా దేహం భగవంతునికే అర్పించి, నా జీవిత శేషమంతా ఆయన కైంకర్యమే చేస్తాను'' అని నిశ్చయించింది.

కానికణ్ణర్‌ చేసిన అద్భుతం ఊరంతా ప్రాకి రాజుకు తెలిసింది. ఒకప్పటి తన దాసి ఇపుడు ¸°వనంగా వున్నదని తెలిసే సరికి వార్ధక్యదశలో వున్న రాజుకూ ఆశ చిగురించింది. అతడు కానికణ్ణర్‌ను పిలిపించి తనకు కూడ ¸°వనం వచ్చేటట్లు చేయమన్నాడు.

కానికణ్ణర్‌కు గురువే సర్వస్వం. ఈతనికి రాజు ఒక లెక్క లేదు. అతడు నిర్భీకుడు. ధర్మపధాన్ని వదిలేవాడు కాదు. అతడు రాజుతో, ''ఆ వృద్ధను యువతిగా చేసినది నేనని ఎవరు చెప్పారు? నాకా శక్తి ఎక్కడిది? నా గురువు ప్రభావం నన్ను అప్పుడు ఆవేశించి ఆకార్యం నాచేత చేయించినది. ఇందులో నా ప్రమేయం ఏమీలేదు'' అని అన్నాడు.

''అట్లైతే నీ గురువును నా సమక్షానికి తీసుకొనిరా'' అని రాజు అన్నాడు.

''నీకు నా గురువు విషయం తెలిసినట్లు లేదు. నిన్నెపుడైనా దేనికైనా అతడు ఆశ్రయించాడా? అతనికి భగవంతుడు తప్ప అన్యం ఏదీ అక్కరలేదు. ఇతరుల వద్ద అతనికి వాంఛనీయమేదీ లేదు. భగవద్భక్తులయందు అతనికెప్పుడూ కరుణ వుంటుంది. వారి కష్టాలను అతడు నివారిస్తాడు. అందుకోసం వారు అతనిని ప్రార్ధించనక్కరలేదు. ఆయన అనుగ్రహిస్తే ఎవరినో ఒకరిని నిమిత్తమాత్రం గ్రహిస్తాడు. ఆ వృద్ధ అతని వద్దకు వెళ్ళి తనకు ¸°వన శ్రీ యాచించలేదు. అతని అవ్యాజ కరుణ ఆమె విషయంలో నా మూలంగా ఫలించింది. ఆమెకు భగవత్కైంకర్యం తప్ప వేరే ప్రపంచం ఏదీలేదు. అట్టి భక్తురాలిని నా గురువు స్వయంగా అనుగ్రహించాడు. ప్రకృతి నియమాలనూ ఉల్లంఘించి ఆమెను యువతిగా చేశాడు. నీకూ ఆమెకూ ఎక్కడ పోలిక? నీవు కామ కారణంగా ¸°వనాన్ని ఇచ్ఛిస్తున్నావు. ఆమె భగవత్కైంకర్యం చేయాలని కోరుకొంటున్నది. నీ బోటి వానిని నా గురువు ఎన్నడూ అనుగ్రహించడు. జరా, మృత్యువులు ప్రకృతి సిద్ధములు. అవి అపరిహార్యము. నీవు ఈ లోకం విడిచిపోయావంటే, ఇంకొకరు నీ సింహాసన మెక్కి ఈరాజ్యాన్ని పాలిస్తాడు. అతడూ ఒకరోజు నీ వలెనే ఈ లోకం విడచి పరలోకం వెళ్ళాల్సి వస్తుంది. ఈ విధవంగా రాజులు వచ్చారు, రాజులు వెళ్ళారు. నా గురువు ఏదైనా ముఖ్య కారణం వుంటే కానీ నిన్ను యువకుణ్ణి చేయడు. నీ ఆశ వదులుకో'' అని కానికణ్ణర్‌ రాజుకు బదులిచ్చాడు.

రాజుకు కోపం వచ్చింది, స్వాభావికంగానే అతనిది రాజరిక ప్రవృత్తి. ''నిన్ను నారాజ్యం నుంచి బహిష్కారం చేశాను. ఈ రాజ్యం వదలి వెళ్ళు'' అని దండన విధించాడు.

''నీవు నన్ను బహిష్కరాం చేసే దేమిటి? నీబోటి రాజు యొక్క రాజ్యంలో ఉండటమే పాపం. నేనే నీ రాజ్యం నుంచి వెళ్ళిపోతాను''. అని కణ్ణర్‌ కంచి వదలి వెళ్ళిపోయాడు. నగరం వదలిపోయే ముందు అతడు తను గురువును దర్శించి జరిగినది చెప్పినాడు.

తిరిమళిసి ఆళ్వారు పరమభక్తుడు. పరమయోగి. అన్నిటిలోనూ ఆయనకువిరక్తే. ఒక్క రెండు విషయాలలో తప్ప. అతడు తన భుజంగశయన పెరుమాళ్ళును వదలి వుండలేదు. రెండవది ఈ శిష్యుడు, కానికణ్ణర్‌, ఇతనినీ వదులుకోలేదు.

శిష్యుడు వెళ్ళేసరికి గురువూ అతనిని అనుగమించాడు. శిష్యుడు గురువును తన వెంట రమ్మన ప్రార్ధించలేదు. గురువే శిష్యుని వెంట వెడుతున్నాడు. ఆయన వాత్సల్యం అలాంటిది. ఆళ్వారు, తాను ఎట్లా తన శిష్యుణ్ణి అనుగమిస్తున్నాడో, తన భగవంతుడైన, భుజగశయనుడూ తన్ను అనసరించి వస్తాడని ఆయన అనుకొన్నాడు. కానీ భుజగ శయనుడు నిశ్చింతగా తన శేష పర్యంకంపై పడుకొని వున్నాడు. ఆళ్వారు అన్నాడు; ''చూడు నాబిడ్డ ఏమో రాజ్యం వదలి పోతూ వుంటే నీవేమో చీమ కుట్టినట్టు కూడ లేకుండ పడుకొనివున్నావు. వెంటనే నీ చాపచుట్టు. నేనేమో వాడిని వదలి వుండలేను. నీవు ఈ విధంగా పడుకొని వుంటే ఏమిటి అర్ధం? గబ గబ లేచిరా'' అని.

ఇక లాభం లేదని భుజగ శయనుడు, ఆళ్వారును అనుగమించాడు. ఆళ్వారు కాని కణ్ణమును అనుసరించాడు. వాళ్ళు ఈవిధంగా 5 మైళ్ళ దూరం నడిచారు. ఇంతలో చీకటి పడింది. పెరుమాళ్ళు అన్నాడు - ''ఈ చీకట్లో నాకు దారి కనిపించటం లేదు. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. తెల్లవారగానే మనం మళ్ళీ ప్రయాణం చేద్దాం.'' భగవంతుడు యథోక్తకారి కదా! చెప్పింది చేయకుండా భక్తునికి ఈ సలహా ఇవ్వడ మెందుకు? ఇదీ ఒక లీలే!

పాలార్‌ తీరంలో చల్లగా గాలి వీస్తుంటే, ఈ ముగ్గురూ, ఆకాశ##మే పందిరిగా, సుఖంగా నిద్రించారు.

కంచిలో పెరుమాళ్ళు వీపుత్రిప్పాడో లేదో, అలక్ష్మి నగరమంతా ఆక్రమించింది. విష్ణువు వక్షఃస్థలంలో లక్ష్మి మబ్బు వెనుక మెఱుపువలె వుంటుంది. విష్ణువు ఎప్పుడు కంచి వదలి వెళ్ళాడో, లక్ష్మి ఆయన వక్షస్థలవాసి కనుక, ఆయన వెంట వెళ్ళింది. కంచిలో అలక్ష్మితాండవించింది. అంతా చీకటే. దీపమన్న మాటలేదు. ఆలయాలలో పూజలన్నీ నిలిచిపోయాయి. అంతా తమసావృతమైంది. సంతోషమన్నమాటలేదు. ఎవరి ముఖం చూచినా విషాదం పులుముకొని వున్నది.

ప్రజలందరూ రాజు వద్దకు వెళ్ళి మొఱపెట్టుకొన్నారు. అతనికీ ఆశ్చర్యమే. ఆదుర్దానే. విష్ణువు ఊరు విడచి వెళ్శినందున ఈ ముప్పు వచ్చిందని గ్రహించాడు. భగవంతుని పాదాలమీద పడి తన తప్పు క్షమించి రక్షించవలసినదని ప్రార్ధించడానికి అతడూ నగరం వదలి బయలుదేరాడు. ఉదయమయ్యేసరికి వారు మువ్వురూ ఉన్న చోటికి చేరుకొన్నారు. అతని ప్రార్ధన వినిన భగవంతుడు ఇలా అన్నాడు; ''చూడూ! నేను నా అంతట నగరం వదలి రాలేదు. ఈ ఆళ్వారు నన్ను రమ్మన్నారు. నేను ఆయన మాట త్రోసి వేయలేక వచ్చాను. ఆ ఆళ్వారు నాకు చెబితే కానీ నేను నగరంలో అడుగు పెట్టను. అందుచేత నీవు ఆ ఆళ్వారునే అడుగు''.

రాజు ఆళ్వారు వంకకు తిరిగాడు. ఆళ్వారు అన్నాడు, ''నేను నా అంతట నగరం వదలి రాలేదు. నా శిష్యుణ్ణివదలి నేను వుండలేను. నన్ను విడిచి వుండలేక పెరుమాళ్ళు నా వెంట వచ్చాడు. నేను వస్తే కానీ పెరుమాళ్ళు కంచి రాడు. నా శిష్యుడు వస్తే కానీ నేను కంచి రాలేను, నీవేమో నా శిష్యుణ్ణి బహిష్కరించావు. పోయి అతని పాదాలపై పడి వేడుకో - అతడు మళ్ళా కంచి వస్తే మేమూ అతని వెంట వస్తాం.''

రాజు కోరికను మన్నించి కానికణ్ణర్‌ కంచి తిరిగి వచ్చాడు. అతనితోబాటు, ఆళ్వారు, ఆళ్వారును అనుసరించి పెరుమాళ్ళూ, యధాప్రకారం కంచిలో మళ్ళా స్థిరపడ్డారు. కంచికి ఐదుమైళ్ళ దూరంలో వీరుమువ్వురూ ఒక రాత్రి గడిపినారు. ఆ చోటు పేరు ''ఓరిదవిరుక్కై'' - ''ఒకనాడి రాత్రి ఉండుట'' కాలక్రమేణా ఆ పదం ''ఒరిక్కై'' ఐనది.

కంచికి వచ్చిన పెరుమాళ్ళు ఆదిశేషుణ్ణి పడుకోమని చెప్పితానూ అనంతశయనమూర్తిగా పవ్వళించవచ్చును కదా! లేదు! ఆళ్వారు ఆజ్ఞకోసం కాచుకొని నిలుచున్నాడు, ఆయన యథోక్తకారి కదా!

అంత వినయంగా నిలుచున్న ఆ పరమపదనాధుని చూచి ఆళ్వారుకు ప్రేమ పొంగిపోయింది. ''నేను వచ్చాను. నా శిష్యుడూ వచ్చాడు. 'అతనిని పిలుచుకొని రావడానికి నిన్ను చాపచుట్టమన్నాను. ఇప్పుడెందుకు వ్యర్ధంగా నిలుచున్నావు? చాప పరచుకొని సుఖంగ పవ్వళించు'' అని భక్తుడు అనుమతించగానే భగవంతుడు భజగ శయనుడయ్యాడు.

దీని తాత్పర్యం ఏమంటో గురుభక్తి ఉన్నవారిని, గురువే కాదు; ఈశ్వరుడు కూడా అతనిని అనుసరిస్తాడని. అందుచేతనే కొందరంటారు; ''నాకు నా గురువనుగ్రహం వుంటే చాలు ఈశ్వరానుగ్రహం తానుగా వస్తుంది'' అని.

86. నమస్కారక్రియ

మనకున్న ఆస్తి అంతా నమస్కారక్రియే. భగవత్పాదుల వారు ఒకపుడు కనకధారా స్తోత్రమనే స్తోత్రంతో లక్ష్మిని ఉద్దేశించి ప్రార్ధించారు. ఒక బీద బ్రాహ్మణవనిత కోసం ఆయన ఈ స్తోత్రాన్ని చెప్పారు. ఆయనకు స్వయంగా కావలసినది ఏదీ లేదు. కానీ మహాలక్ష్మిని ప్రార్ధించి ఆమె దర్శన మిచ్చిన పిదప ఆమెను దేనినీ కోరకుండా వుండటానికీ లేదు. అందుచేత ఆయన నమస్కారమనే సంపదను మాత్రం ఆమె వద్ద కోరుకొంటారు.

సంపత్కరాణి సకలేంద్రియనందనాని

సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి

త్వద్వందనాని దురితోద్దరణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతునాన్యే

కట్టకడపట 'నాన్యే' అన్న పదప్రయోగం ఆచార్యులు చేశారు. ''మహాలక్ష్మీ! నేను చేసే ఈ నమస్కార క్రియను మించిన సంపద వేరే ఏదీ అక్కరలేదు. త్వద్‌ వందనాని ఏవ - నిన్ను ఉద్దేశించి చేసే ఈ నమస్కారము మాత్రము మామ్‌ - నన్ను- అనిశం - ఎల్లప్పుడు, కలయంతు - చేరుగాక - నాకు కలుగుగాక - నాన్యే - ఇతరముకాదు'' అని ఆచార్యులు ప్రార్ధించారు.

అమ్మవారికి చేసే ఆ నమస్కారం ఎటువంటిది? సంపత్కరాణి - సంపదలు కలిగించునది. సకలేంద్రియ నందనాని - అన్ని ఇంద్రియములను సంతోషపెట్టునది. సామ్రాజ్యదాన నిరతాని. అంతేకాదు ఆ నమస్కారము సామ్రాజ్యమునే ఇవ్వగల శక్తి గల యట్టిది. లలితా సహస్ర నామములలో - రాజరాజేశ్వరీ - రాజ్యదాయిని, రాజపీఠ నివేశిత నిజాశ్రితా - అన్న నామములున్నవి. రాజ్యమును ఇచ్చుటకూ, తన ఆశ్రితులను రాజపీఠము అనగా సింహాసనమందు కూర్చోపెట్టుటకు అమ్మవారికి అనుగ్రహశక్తి కలదు.

ఆ నమస్కారానికి మరొక్క శక్తి కలదు. అది, దురితోద్ధరణోద్యతాని - దురితములు అంటే పాపములు దురితముల నుండి ఉద్ధరించుటకు ఉద్యమించే శక్తి అంటే మన పాపములను ఆ నమస్కారం పోగొడుతుంది. దీనికి మరొక పాఠాంతరమును చూస్తున్నాం. అది, ''దురితాహరణోద్యతాని'' వ్యాకరణ యుక్తంగా హరణ, ఆహారణ రెండూ ఒక్కటే హరణ అంటే పోగొట్టుట. ఆహరణ అంటే తీసుకొని వచ్చుట. అనే అర్ధం కూడ వుంది. అపుడు దురితములను తీసుకొని వస్తుందనే అపార్ధం ఔతుంది. అందుచేత, ''దురితోద్ధరణోద్యతాని'' అనేదే సరియైన పాఠం. ఆమె మన నమస్కార క్రియ చేత దురితములను వ్రేళ్ళతో పెకలించగలదు.

మామేవ అన్న పదప్రయోగంలోని 'ఏవ' అను పదములను - నందనాని అనే పదముతో కలిపి చదువుకోవాలి. నందనాని ఏవమామ్‌ మాత అనిశంకలయాతు - నాన్యే - అనగా ఈ నందనం మాత్రం, వేరే ఏదీకాదు - నన్ను వచ్చి చేరుగాక అని ఆచార్యుల భావం.

ఆచార్యులవారు ప్రశ్నోత్తర రత్నమాలికను వ్రాశారు. అందులో ప్రశ్నలు, వానికి ఉత్తరాలు వుంటాయి. అందులో ఒక ప్రశ్న; కింవిషం? విషము ఏది? అని ప్రశ్న దానికి జవాబు - ''అవధీరణా గురువు'' - గురువును అవమర్యాద చేయటమే విషం అని ఉత్తరం అందులోనే మరొక్క ప్రశ్న వున్నది. పాతుకర్ణాంజలిభిః ''కింఅమృతం? శ్రవణామృతముగా వుండేదేది? దానికి బదులు - ''సదుపదేశం'', ''కింఉపాదేయం?'' దేనిని మనం గ్రహించవలసినది? ''గురువచనం''. ఉపాదేయము గురువచనమే. వారి ఉపదేశములే మనకు శిరోధార్యములు. ''కోగురుః''? గురువెవ్వరు? ''యో అధి గతత్త్వః శిష్యహితాయోద్యతః సతతం'' గురువు తత్వాన్వేషణ చేసి తత్త్వజ్ఞుడై వుండాలి. అతడు అనుభవశాలిగా వుండవలె. అట్టి గురువు, అన్ని కాలములలోనూ శిష్యుని హితాన్ని ఉద్దేశించి పాటు పడుతూ వుంటాడు. ''శిష్యమితాయోత్యతః సతతం''.

శిష్యుని హితమేది? అతనిని కర్మ బంధం నుండి తప్పించి, సంసార విమోచలతో అతనికి మోక్ష సౌఖ్యం కల్గించటమే గురువు చేసే హితచర్య. గురువుకు చేసే నమస్కార క్రియ శిష్యునికి ఆ హితాన్ని చేకూరుస్తుంది. గురువు యొక్క కృపాధార అనే కనకధార అతనిపై వర్షిస్తుంది. అందుచేత మనకు ఆ ఒక్క నమస్కారమనే సంపద వుంటే చాలు. వేరే ఏదీ అక్కరలేదు.

''తసై#్మ శ్రీ గురవేనమః''

Sanathana Dharmamu    Chapters    Last Page